Begin typing your search above and press return to search.

డార్క్ ప్రిన్స్ భారత వ్యతిరేక 'హవా భవన్' గతం తెలుసా..!

తే.. తారిక్ రెహమాన్ కు "డార్క్ ప్రిన్స్" అనే పేరు బంగ్లాదేశ్ మీడియా కానీ, ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులు కానీ పెట్టలేదు. ఆ పేరు వాషింగ్టన్ నుంచి వచ్చింది.

By:  Raja Ch   |   26 Dec 2025 10:00 AM IST
డార్క్  ప్రిన్స్  భారత వ్యతిరేక హవా భవన్ గతం తెలుసా..!
X

2001 - 2006 మధ్య బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీ.ఎన్.పీ) - జమాత్ ఇ ఇస్లామీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ దేశ ప్రధానమంత్రి ఖలీదా జియా గణ భవన్ లో ప్రభుత్వాన్ని నడిపేవారు. అయితే దానికి అర కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 'హవా భవన్' లో సమాంతర ప్రభుత్వాన్ని తనదైన భీభత్సపు శైలిలో నడపడం మొదలుపెట్టారు.

ఢాకాలోని ఓ విలాసవంతమైన బహుళ అంతస్తుల టవర్లో ఈ హవా భవన్ ఉండేది. ఇది ప్రగతిశీలతకు చిహ్నం కాదు.. కండబలానికి, రాజకీయ బలానికి, భీభత్సానికి చిహ్నంగా ఆ దేశ చరిత్రలో నిలిచింది. ఢాకాలోని యూఎస్ రాయబార కార్యాలయం, బంగ్లాదేశ్ అవినీతి నిరోదక కమిషన్, మీడియా నివేదికల ప్రకారం 2001-2006 మధ్య ఇది బంగ్లాదేశ్ లో ప్రత్యామ్నాయ శక్తి కేంద్రంగా పనిచేసింది.

అవును... బంగ్లాదేశ్ చరిత్రలో హవా భవన్ ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని అంటారు. దౌత్యవేత్తలు, నిఘా అధికారులు, జర్నలిస్టు, బీ.ఎన్.పీ అంతర్గత వ్యక్తులు కూడా దీన్ని.. మంత్రిత్వ శాఖలు, చట్టాలు, సంస్థలను దాటి నిజమైన నిర్ణయాలు తీసుకునే ప్రదేశంగా అభివర్ణించారు. మాజీ ప్రధాని షేక్ హసీనాను చంపడానికి ప్రయత్నించిన 2024 ఢాకా గ్రెనేడ్ దాడి కుట్రలోనూ దీని పాత్ర ఉందని అంటారు.

ఇదే సమయంలో.. దక్షిణాసియాలో అత్యంత సాహసోపేతమైన ఆయుధ అక్రమ రవాణా కార్యకలాపాలలో హవా భవన్ ఒకటి అని అంటారు. ఈ క్రమంలో.. 2004 ప్రారంభంలో నిఘా సంస్థలు, ప్రభుత్వ అధికారుల చురుకైన సహాయంతో.. భారతదేశ వేర్పాటువాద సమూహం ఉల్ఫా కోసం చిట్టగాంగ్ ద్వారా ఆయుధాలను దిగుమతి చేసుకోవడానికి ఇది దోహదపడిందని నివేదికలు చెబుతున్నాయి!

ఒక్కమాటలో చెప్పాలంటే.. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి కార్యాలయంలో కంటే ఈ హవా భవన్ లోనే అన్ని రకాల ఫైళ్లు వేగంగా కదిలాయని.. వ్యాపారవేత్తలు ఈ భవన్ వైపే క్యూ కట్టారని.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ భవన్ ముందు వంగిపోయేవని చెబుతారు. ఆ భవన్ కు రాజు, యువరాజు ఈ తారిక్ రెహమాన్. అందుకే అతన్ని డార్క్ ప్రిన్స్ అని అంటారు.

అయితే.. తారిక్ రెహమాన్ కు "డార్క్ ప్రిన్స్" అనే పేరు బంగ్లాదేశ్ మీడియా కానీ, ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులు కానీ పెట్టలేదు. ఆ పేరు వాషింగ్టన్ నుంచి వచ్చింది. డిసెంబర్ 2005లో అప్పటి యూఎస్ ఛార్జ్ డీ’అఫైర్స్ జుడీత్ ఎ చమ్మాస్.. తారిక్ రెహమాన్ ను "చీకటి యువరాజు"గా అభివర్ణించింది. మాజీ అమెరికా రాయబారి జేమ్స్ ఎఫ్ మోరియార్టీ.. తారిక్ ను "బంగ్లాలో క్లెప్టోక్రటిక్ ప్రభుత్వానికి, హింస్మాత్మక రాజకీయాలకు చిహం" గా అభివర్ణించారు.

ఈ క్రమంలోనే... 2005లో వరుసగా ఐదో సవత్సరం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్ ను ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశంగా పేర్కొంది అంటే.. హవా భవన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే.. ప్రభుత్వ అవినీతిని స్పష్టంగా పేర్కొంటూ ప్రపంచ బ్యాంకు మూడు ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను రద్దు చేసినట్లు తెలిపింది.

అయితే.. డార్క్ ప్రిన్స్ హవా భవన్ ఇప్పుడు భౌతికంగా లేదు కానీ... దాని లెక్కలేనన్ని అవినీతి, హింసకు సంబంధించిన నీడ ఇంకా దాగి ఉందని అంటారు. ఈ నేపథ్యంలో సుమారు 17ఏళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి వచ్చిన తారిక్ రెహమాన్ తదుపరి చర్య.. విముక్తిని సూచిస్తుందా.. లేదా, హవా భవన్ ను పునరావృతం చేసుందా అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్నంగా మారింది.