హత్యచేసి.. గోనె సంచిలో కుక్కి.. ఈ లాయర్ మామూలోడు కాదు!!
తణుకులో తొలుత అదృశ్యం, ఆపై హత్యగా మారి సంచలనం సృష్టించిన కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది.
By: Raja Ch | 4 Oct 2025 11:59 AM ISTతణుకులో తొలుత అదృశ్యం, ఆపై హత్యగా మారి సంచలనం సృష్టించిన కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. చించినాడ గోదావరి తీరంలో ఈతగాళ్ల సాయంతో పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో.. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని చొదిమెళ్ల గ్రామ పరిధిలో తాడేపల్లిగూడేనికి చెందిన మడుగుల సురేష్ (25) మృతదేహం గోనె సంచిలో కుక్కి కనిపించింది. దీంతో... ఆ కేసు మిస్టరీ వీడినట్లయ్యింది.
అవును... తణుకులో అనుమానాస్పదరీతిలో అదృశ్యమైన యువకుడి ఆచూకీ కేసు పోలీసులకు సవాలుగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అది ఓ కొలిక్కి వచ్చింది. గత నెల 23న తణుకు వెళ్లిన సురేష్ తిరిగి తాడేపల్లిగూడెం రాలేదని చెబుతూ.. ఈ సమయంలో లాయర్ తిర్రే సత్యనారాయణరాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ 25న తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ లో సురేష్ సోదరి శిరీష ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదుచేశారు! అయితే దర్యాప్తులో బయటపడ్డ పలు ఆధారాలతో ముందుగా తణుకు గోస్తనీ కాలువలో, అనంతరం చించినాడ గోదావరిలో రెండురోజులపాటు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సురేష్ మృతదేహం ఉన్న గోనె సంచి మూట గోదావరిలో లభ్యమైంది. అప్పటికే శవం కుళ్లిపోయి, పురుగులు పట్టిన పరిస్థితుల్లో ఉండగా మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టుతో బాధిత వర్గాలు గుర్తించారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు పంచనామా నిర్వహించి రాజోలు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. అనంతరం సురేష్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
వివాహేతర సంబంధం వ్యవహారంలో న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు.. పట్టణానికి చెందిన నలుగురు యువకుల సాయంతో గతనెల 23న సురేష్ పై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి తణుకు నుంచి ఒక కారులో ఎక్కించుకుని చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో పారవేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం.
అయితే నిందితులు అంతా ఒకే మాటపై ఉండి మృతదేహం దొరకకుండా ఉండేందుకు పోలీసులకు తప్పుడు సమాచారం ఇస్తూ ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... లాయర్ సత్యనారాయణ రాజు దీనికోసం పక్కాగా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ క్రమంలో... సురేష్ సెల్ ఫోన్ ను తాడేపల్లిగూడెంలో స్విచ్ ఆఫ్ చేసి, అనంతరం కాలువలో పారవేసి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు పక్కా ప్లాన్ చేశారని చెబుతున్నారు.
మృతదేహం లభ్యం కాని పక్షంలో కేసు వీగిపోతుందనే ఉద్దేశంతో లాయర్ తన తెలివి తేటలు ఉపయోగించి చాకచక్యంగా వ్యవహరించారని అంటున్నారు. అయినప్పటికీ పోలీసుల పట్టుదల ముందు లాయర్ అతి తెలివి నిలవలేదు! దీంతో.. చివరకు మిస్టరీ వీడింది.. మృతదేహం తరలింపులో నిందితులు వినియోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
