కాంగ్రెస్,బీఆర్ఎస్ ఎక్కడ పుట్టాయి.. కుర్ర హీరో తనీష్ సంచలన కామెంట్స్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన తరపున కుర్ర హీరో తనీష్ ప్రచారం మొదలుపెట్టారు.
By: A.N.Kumar | 7 Feb 2026 2:54 PM ISTతెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన తరపున కుర్ర హీరో తనీష్ ప్రచారం మొదలుపెట్టారు. అభ్యర్థుల తరపున వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. జనసేన ఆంధ్రా పార్టీ అంటూ కామెంట్స్ చేయడంతో హీరో తనీష్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తనీష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జనసైనికుల్లో జోష్ నింపుతున్నాయి.
కుర్ర హీరో హాట్ కామెంట్స్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ గురించి ప్రకటించక ముందే పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోనసీమ కొబ్బరిచెట్లు తెలంగాణ దిష్టి తగిలి ఎండిపోయాయని వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో.. పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. జసేన ఆంధ్రా పార్టీ కాబట్టే.. తెలంగాణ గురించి పవన్ అవాకులు చవాకులు పేలారని విమర్శిస్తున్నారు. దీంతో జనసేన తరపున ప్రచారానికి దిగిన కుర్ర హీరో తనీష్ హాట్ కామెంట్స్ చేశారు. జనసేన ఆంధ్ర పార్టీ అని మాట్లాడుతున్న నేతలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తెలంగాణలో పుట్టిందా అంటూ తనీష్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ గా ఉన్న బీఆర్ఎస్ ఎందుకు పేరు మార్చుకుందని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే కదా అంటూ తనీష్ వ్యాఖ్యానించారు. జనసేన జాతీయ పార్టీ అని, తెలంగాణే కాదు తమిళనాడు, కేరళలో కూడా పోటీ చేస్తామని ప్రకటించడం, ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది.
పవన్ ప్రచారం ?
జనసేన తరపున కుర్ర హీరో తనీష్ ఎన్నికల ప్రచారంలోకి దిగడం ఆసక్తికరం. ఎంతో మంది మెగా హీరోలు, మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలు ఉన్నప్పటికీ తనీష్ ప్రచారం చేయడం ఆశ్చర్యకరం. తనీష్ కొద్ది మంది ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన హీరో. చాలా మంది ప్రజలకు తనీష్ తెలియదు. అలాంటి హీరోను ఎన్నికల ప్రచారంలోకి దింపడం ఆసక్తిగా ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తారా అన్న ప్రశ్న కూడా ఉంది. ఒకవేళ వస్తే.. గతంలో తెలంగాణ దిష్టి అన్న వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని తెలంగాణ నేతలు పట్టుబట్టే అవకాశం ఉంటుంది. పవన్ ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ ప్రచారానికి వస్తారా .. లేదా అన్నది అనుమానం. పవన్ వస్తేనే జనసేన అభ్యర్థుల్లో జోష్ ఉంటుందని, లేదంటే జనసేనలో ఉత్సాహం కరువవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జనసేన ప్రభావం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ప్రభావం పైన రాజకీయ పార్టీల్లో కీలక చర్చ ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలోని కొన్ని డివిజన్లలో జనసేన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలవడానికి, ఓటమికి జనసేన అభ్యర్థులు కారణమయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఎన్నికల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. బీజేపీకి జనసేన బలమయ్యే అవకాశం ఉంది.
