Begin typing your search above and press return to search.

తమిళనాడులో సోఫాల సందడి.. నెట్టింట హాట్ డిబేట్

తమిళనాడులో ఎన్నికల అనంతరం రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా ‘సోఫాల రాజకీయం’ అందరినీ ఆకర్షిస్తోంది.

By:  Tupaki Political Desk   |   12 May 2026 6:27 PM IST
తమిళనాడులో సోఫాల సందడి.. నెట్టింట హాట్ డిబేట్
X

తమిళనాడులో ఎన్నికల అనంతరం రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా ‘సోఫాల రాజకీయం’ అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రిగా దళపతి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా విపక్ష నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, సీనియర్ నేత వైగోను విజయ్ వ్యక్తిగతంగా కలిశారు. తాజాగా ఏఐడీఎంకే తిరుగుబాటు నేత షణ్ముగంను కలవాలని విజయ్ భావించారు. కాసేపట్లో విజయ్ వెళతారనగా, షణ్ముగం ఇంటికి కొత్త సోఫాతో ఓ వాహనం రావడం తమిళనాడు రాజకీయాలలో విస్తృత చర్చకు దారితీసింది.

తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే అధికారం చేపట్టేందుకు కావాల్సిన బలాన్ని మాత్రం సాధించలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు దళపతి విజయ్ ఇతర పార్టీలను ఆశ్రయించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. దీంతో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం కూడా చేశారు. ఈ నెల 13లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సివుండగా, ఏఐడీఎంకేలో చీలికతో ఓ వర్గం విజయ్ కి అనూహ్య మద్దతు ప్రకటించింది. దీంతో అసెంబ్లీలో ప్రభుత్వ అనుకూల సభ్యుల బలం 150కి చేరింది.

ఈ నేపథ్యంలో తనకు మద్దతు పలికిన షణ్ముగంను కలవాడానికి ముఖ్యమంత్రి విజయ్ వెళతారనగా, ఆయన ఇంటికి ముందుగా ఓ సోఫా వెళ్లడం నెట్టింట ఆసక్తికర చర్చగా మారింది. గతంలో కూడా వీసీకే మద్దతు కోసం విజయ్ ఆ పార్టీ కార్యాలయానికి వెళతారనగా, కొత్త సోఫాలు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన నెటిజన్లు పుష్ప సినిమాలో ‘సోఫాల’ను గుర్తు చేస్తున్నారు. మద్దతు కోసం విజయ్ ‘పుష్ప’ను ఫాలో అవుతున్నారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ ప్రచారంపై వెంటనే స్పందించిన వీసీకే నేతలు తమ కార్యాలయానికి విజయ్ వస్తున్నారని తెలిసి, మర్యాద కోసం అప్పటికప్పుడు కొత్త సోఫాలు కొనుగోలు చేశామని వివరణ ఇచ్చింది.

దీంతో ఆ ఎపిసోడ్ ముగిసిందని అనుకుంటుండగా, మళ్లీ ఏఐడీఎంకే నేత షణ్ముగం ఇంటి వద్ద మరో కొత్త సోఫా ప్రత్యక్షమవడం గమనార్హం. ప్రస్తుతం ఈ సోఫాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పుష్ప’ సోఫాలా లేక మర్యాద కోసం కొత్తగా కొనుగోలు చేస్తున్న సోఫాలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా షణ్మగం ఇంటికి వెళ్లిన సోఫా ఎక్కడి నుంచి వచ్చింది అన్న స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. విజయ్ వస్తున్నందున వీసీకే పార్టీ నేతలు మాదిరిగా షణ్ముగం కూడా కొత్తది కొనుగోలు చేశారా? లేక ఇంకెవరైనా గిఫ్ట్ ఇచ్చారా? అన్నది తేలాల్సివుంది. దీనిపై ఏఐడీఎంకే, టీవీకే నేతలు ప్రకటన చేయాల్సివుందని అంటున్నారు.