Begin typing your search above and press return to search.

అనుభవం, స్వానుభవం... మధ్యలో విజయ్ పొలిటికల్ ఫ్యూచర్!

ఇక టీవీకేతో జట్టుకట్టే విషయంలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయని అంటున్నారు.

By:  Raja Ch   |   12 Oct 2025 10:35 AM IST
అనుభవం, స్వానుభవం... మధ్యలో విజయ్  పొలిటికల్  ఫ్యూచర్!
X

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో వేడెక్కడం మొదలుపెట్టాయి. ఈ సమయంలో డీఎంకే - కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే - బీజేపీ కూటమి మధ్యలో విజయ్ టీవీకే పార్టీ మధ్య రాజకీయం రోజురోజుకీ హీటుక్కుతోంది. ఈ సమయంలో కరూర్ లో జరిగిన తొక్కిసలాట తర్వాత తమిళనాడు రాజకీయం మరింత రసవత్తరంగా మారిందనే చెప్పాలి.

అవును... తమిళనాడు రాజకీయం కరూర్ తొక్కిసలాట ఘటనకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయిందన్న అతిశయోక్తి కాదేమో అన్నట్లుగా అక్కడి పరిస్థితి ఉంది. కరూర్‌ లో సెప్టెంబరు 27న విజయ్‌ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా వందమందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. దీని తర్వాత సమీకరణలు, విజయ్ దూకుడు మారిందని అంటున్నారు.

బీజేపీ నుంచి విజయ్ కు మద్దతు!:

కరూర్ తొక్కిసలాట ఘటనతో విజయ్ ను కార్నర్ చేసి అధికార డీఎంకే రాజకీయ లబ్ధి పొందుతుందనే చర్చ మొదలైందని అంటున్న వేళ.. అనూహ్యంగా బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఈ దుర్ఘటనపై విచారణకు ఎన్డీయే ఎంపీల బృందాన్ని కరూర్‌ పంపింది. ఈ క్రమంలో... విచారణ చేపట్టిన ఈ బృందం దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించింది.

మరోవైపు తమిళనాడు బీజేపీ నేత కుష్బూ స్పందిస్తూ... ఆ ఘటనపై విజయ్ ఇప్పటికే ప్రజలకు క్షమాపణలు చెప్పారని.. ఆయన సీబీఐ దర్యాప్తును కూడా డిమాండ్ చేశారని అన్నారు. అయితే... తమిళనాడు ప్రభుత్వం మాత్రం సిట్ ద్వారా దర్యాప్తు నిర్వహిస్తోందని.. సంఘటనా స్థలానికి వెళ్లడంలో ఉన్న ఇబ్బందులను కూడా విజయ్ వివరించారని అన్నారు.

అన్నాడీఎంకే నుంచి ఫోన్.. విజయ్ సమాధానం..!:

ఇదే సమయంలో ఎన్డీయే కూటమిలోని అన్నాడీఎంకే పార్టీ సైతం తన ప్రయత్నం తాను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... విజయ్‌ ను అన్నాడీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిసామి ఇటీవల ఫోన్ లో సంప్రదించినట్లు, ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడిస్తూ.. కూటమి ఏర్పాటు చర్చలకు ఆహ్వానం పలికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి!

అయితే ఈ ఆహ్వానం పై విజయ్ స్పందించారని అంటున్నారు. ఇందులో భాగంగా పొంగల్‌ తర్వాత తన వైఖరి వెల్లడిస్తానని విజయ్‌ సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే సభలో టీవీకే జెండాలు ఎగురుతుండటం గమనార్హం.

కాంగ్రెస్ లో రెండు వర్గాలు.. ఒకటి విజయ్ కోసం!:

ఇక టీవీకేతో జట్టుకట్టే విషయంలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయని అంటున్నారు. ఇందులో భాగంగా... ఓ వర్గం విజయ్‌ వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీవీకేతో కూటమి ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ను ఆ వర్గం ఇప్పటికే ఢిల్లీ అధిష్ఠానం దృష్టికి సైతం తీసుకెళ్లిందని తెలిసింది.

మరోవైపు ఈ వర్గం అభిప్రాయాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ఖండించడంతో పాటు ప్రస్తుతం డీఎంకేతో కూటమి బంధాన్ని తెంచుకోవడం ఏమాత్రం మంచిదికాదని గట్టిగా చెబుతున్నారని సమాచారం. ఇదే సమయంలో... కరూర్‌ దుర్ఘటన తర్వాత విజయ్‌ తో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫోన్‌ ద్వారా మాట్లాడిన సంగతి తెలిసిందే!

అనుభవం - స్వానుభవం!:

రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదని.. పైగా కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఒంటరిగా పోటీ చేసి గెలవడం.. ఇప్పటికే పాతుకుపోయిన పార్టీలను పడగొట్టడం అతి పెద్ద టాస్క్ అనే సంగతి తెలిసిందే! ప్రధానంగా గతంలో కాంగ్రెస్, టీడీపీలు పోటా పోటీగా ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఫైనల్ గా కాంగ్రెస్ లో కలిసిపోయింది!

ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా ఉన్న సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తొలుత ఊహించని స్థాయిలో అన్నట్లుగా ఇబ్బందులు పడ్డారు. పైగా ఆయనే స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పరిస్థితి. అనంతరం ఎన్డీయే కూటమిలో చేరిన ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.

ఆ రెండు అనుభవాలను విజయ్ పరిశీలించలేదని అనుకోలేం. మరోవైపు కాంగ్రెస్ పార్టీని కాదని కొత్తగా పార్టీపెట్టిన జగన్ 2014లో దెబ్బతిని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన పరిస్థితి. అయితే.. అనూహ్యంగా 2019లో ఘన విజయం సాధించారు. ఇక 2024క్కి వచ్చే సరికి బీజేపీ - టీడీపీ - జనసేన కూటమి ముందు తేలిపోయారు. 11 స్థానాలకు పరిమితమయ్యారు.

ఏపీలో జరిగిన ఈ మూడు పార్టీల, ఆ మూడు పార్టీల అధినేతల అనుభవాలను పరిగణలోకి తీసుకుని విజయ్... ఏదో ఒక కూటమిలో చేరే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాకాదు ఎవరి అనుభవం వారిది, ఎవరి నమ్మకం వారిది అని ఒంటరిగానే పోటీ చేసి తన సత్తా చాటే అవకాశం ఉందా అనేది మరింత ఆసక్తిగా మారింది.

కారణం... వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తే అదో గొప్ప చరిత్రగా మిగిలిపోతుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవి ఆయనను వరిస్తుంది! అలా కాకుండా కాంగ్రెస్, ఎన్డీయే కూటమిలో చేరితే.. ఎవరు గెలిస్తే వారి తరుపున ఉప ముఖ్యమంత్రి పదవి లభించే ఛాన్స్ పుష్కలంగా ఉంది! మరి ఈ సమయంలో విజయ్.. అనుభవాలను పరిగణలోకి తీసుకుంటారా.. లేక, స్వానుభవం వైపు మొగ్గుచూపుతారా అనేది వేచి చూడాలి.