రెబెల్స్ కు దళపతి షాక్.. మంత్రి పదవులపై విజయ్ సంచలన నిర్ణయం!
ఏఐడీఎంకే తిరుగుబాబు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తున్నారని తాజాగా జరుగుతున్న ప్రచారంపై విజయ్ స్పందించిన విధానంపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 20 May 2026 8:00 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ చాకచక్యంగా పనిచేస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. తన ప్రభుత్వం చిక్కుల్లో పడకుండా విజయ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ మిత్రపక్షాల విశ్వాసాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఏఐడీఎంకే తిరుగుబాబు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తున్నారని తాజాగా జరుగుతున్న ప్రచారంపై విజయ్ స్పందించిన విధానంపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ జరుగుతోంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పది మందితో కేబినెట్ ను ఏర్పాటు చేసిన దళపతి కొద్దిరోజుల్లో విస్తరణ చేపట్టే అవకాశం ఉందంటున్నారు. రెండో విడత విస్తరణలో తన ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఏఐడీఎంకే ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారని తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఊహాగానాలపై ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వీసీకే, కమ్యూనిస్టు పార్టీలు ఘాటుగా స్పందించాయని అంటున్నారు.
అనైతికంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో చేర్చుకుంటే, తాము మద్దతు ఉపసంహరించుకుంటామని వీసీకే, కమ్యూనిస్టులు తేల్చిచెప్పారని అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి విజయ్ అలర్ట్ అయ్యారని చెబుతున్నారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా, తమ కూటమి భాగస్వామ్య పక్షాలకు గట్టి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు.
అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను చేరదీసి, వారికి మంత్రి పదవులు కట్టబెట్టే యోచనలో సీఎం విజయ్ ఉన్నారనే వార్తలు రాగానే.. కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలైన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), లెఫ్ట్ (వామపక్ష) పార్టీలు అలర్ట్ అయ్యాయి. సిద్ధాంతపరంగా, రాజకీయంగా ఈ నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ అన్నాడీఎంకే రెబల్స్‌కు మంత్రి పదవులు ఇస్తే.. తాము ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించినట్లు సమాచారం.అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని టీవీకే మాకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చిందని టీవీకే చీఫ్ తోల్ తిరుమావళవన్ వెల్లడించడంతో ఆ ఊహాగానాలకు తెరపడిందని అంటున్నారు.
ఈ తాజా రాజకీయ పరిణామం వెనుక తమిళనాడు పాలిటిక్స్‌లో కొన్ని ఆసక్తికరమైన సమీకరణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చిన టీవీకే, ఇతర సాంప్రదాయ పార్టీల నుంచి వచ్చిన రెబల్స్‌కు పెద్దపీట వేస్తే పార్టీ సిద్ధాంతాలకే ముప్పు వస్తుందని టీవీకే నేతలు భావించారని అంటున్నారు. ఇదే సమయంలో మిత్రపక్షాలు సైతం అభ్యంతరం చెప్పడంతో రెబెల్స్ కు మంత్రి పదవుల ప్రతిపాదనకు ప్రారంభంలోనే ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ఈ విషయంలో టీవీకే కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి దెబ్బతినకుండా చూసుకోవడంతోపాటు ప్రజల్లోకి నెగెటివ్ సంకేతాలు వెళ్లకుండా ఉండేలా టీవీకే వేగంగా స్పందించిందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి రెబల్స్ వ్యవహారంలో సీఎం విజయ్ ఇచ్చిన క్లారిటీతో కూటమిలో రేగిన సెగలు చల్లారినట్లు కనిపిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ జరిగే సమయంలో విజయ్ ఎలాంటి అడుగులు వేస్తారనేది ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు. విజయ్ ప్రభుత్వం కొనసాగడానికి వీసీకే, కమ్యూనిస్టుల మద్దతు కన్నా, రెబెల్స్ సపోర్టు కీలకంగా పనిచేసే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చునని వ్యాఖ్యానిస్తున్నారు.
