Begin typing your search above and press return to search.

ఈసారైనా తమిళసై కల తీరేనా?

అత్యుత్తమ స్థానాల్లో పని చేసినా.. అందుకు భిన్నంగా తమకు అందని ద్రాక్షగా నిలిచే వాటి కోసం ప్రయత్నించటం.. భంగపడటం.. పట్టుదలతో మళ్లీ ప్రయత్నించే తీరు కొందరిలో ఉంటుంది.

By:  Garuda Media   |   4 April 2026 9:38 AM IST
ఈసారైనా తమిళసై కల తీరేనా?
X

అత్యుత్తమ స్థానాల్లో పని చేసినా.. అందుకు భిన్నంగా తమకు అందని ద్రాక్షగా నిలిచే వాటి కోసం ప్రయత్నించటం.. భంగపడటం.. పట్టుదలతో మళ్లీ ప్రయత్నించే తీరు కొందరిలో ఉంటుంది. అందుకు నిదర్శనంగా డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ను చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన ఆమె.. తన జీవితంలో ఎమ్మెల్యేగా గెలవలేకపోయానన్న కొరత ఉంది. దాన్ని తీర్చుకోవటానికి తాజాగా మరోసారి ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా తమిళనాడులోని మూలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన లక్ ను పరీక్షించుకుంటున్నారు.

భారతీయ జనతాపార్టీ సీనియర్ నేతగా తమిళ సై సుపరిచితురాలు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తమిళ సై తండ్రి కుమారి అనంతన్ కాంగ్రెస్ వాది. ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె.. రాజకీయాల్లో రాక ముందు ప్రజాసేవలో యాక్టివ్ గా ఉన్నారు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరించిన ఆమెకు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో గెలవాలన్నది తీరని కోరికగా నిలిచింది.

నిజానికి ఒక రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించినప్పటికీ.. తాను ఎమ్మెల్యేగా గెలవాలన్న కోరికను తీర్చుకోవాలన్న పట్టుదలతో మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా వేర్వేరు సందర్బాల్లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయటం.. ఓడిపోవటం అన్నది మామూలైంది. 2006లో రాధాపురం నుంచి పోటీ చేసిన తమిళ సై 2011లో వేళచ్చేరి నుంచి, 2016లో విరుగంబాక్కం నుంచి బరిలో ఉన్నారు. తాజాగా మైలాపూర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు.

ఇంతకు ముందు పోటీ చేసిన మూడు సందర్భాల్లోనూ ఆమె విజయం సాధించలేకపోయారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి.. ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల బరిలోకి మొదటిసారి దిగుతున్నారు. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం కాకుండా రెండు సందర్భాల్లో ఎంపీ ఎన్నికల్లోనూ పని చేసి ఓటమిపాలయ్యారు. 2009లో చెన్నై నుంచి.. 2019లో తూత్తుకుడి నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇలా పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటం తమిళసై రాజకీయ జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈసారైనా తమిళనాడు ఓటర్లు తమిళ సై విషయంలో సానుకూలంగా స్పందించి ఆమెను ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చేలా చూస్తారా? లేదా? అన్నది చూడాలి.