సీఎం విజయ్ తో వచ్చిన సోఫాలు.. అసలు నిజం చెప్పిన వీసీకే చీఫ్
తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న ‘సోఫాలు’పై విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) అధినేత తోల్ తిరుమావళవన్ అసలు నిజమేంటో చెప్పారు.
By: Tupaki Political Desk | 14 May 2026 7:00 PM ISTతమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న ‘సోఫాలు’పై విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) అధినేత తోల్ తిరుమావళవన్ అసలు నిజమేంటో చెప్పారు. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన క్రమంలో చెన్నైలోని వీసీకే కార్యాలయం, ఏఐడీఎంకే తిరుగుబాటు నేత, మాజీ మంత్రి షణ్ముగం ఇంటికి కొత్త సోఫాలు వెళ్లడంపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో తన కార్యాలయానికి వచ్చిన సోఫాపై తిరుమావళవన్ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై గతంలోనే వీసీకే నేతలు క్లారిటీ ఇచ్చినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. దీంతో మరోసారి సోఫాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది తిరుమావళవన్ వివరణ ఇచ్చారని అంటున్నారు.
ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ప్రతిగా సోఫాలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని వీసీకే చీఫ్ తిరుమావళవన్ కొట్టిపడేశారు. ఎన్నికలకు ముందే తమ కార్యాలయానికి కొత్త సోఫాల కోసం ఆర్డర్ ఇచ్చామని, అవి ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్ తమ కార్యాలయానికి వచ్చే సమయంలో డెలవరీ అయ్యాయని తిరుమావళవన్ వివరించారు. ముఖ్యమంత్రి విజయ్ కి ప్రచారం జరుగుతున్నట్లు సోఫాలకు ఎటువంటి సంబంధం లేదని వీసీకే చీఫ్ స్పష్టత నిచ్చారు. తన వివరణతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తిరుమావళవన్ కోరారు.
అయితే ముఖ్యమంత్రి విజయ్ వెళ్లిన సమయంలోనే ఏఐడీఎంకే తిరుగుబాటు నేత షణ్ముగం ఇంటికి చేరిన కొత్త సోఫాలపై ఇంకా క్లారిటీ రావాల్సివుందని అంటున్నారు. తమిళనాట కొన్ని రోజులుగా ఈ సోఫాలపై పెద్ద చర్చే జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ సాధించని టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కొత్త సోఫాలు కలకలం రేపాయి. వీటిని ‘పుష్ప’ సినిమాలో సోఫాలతో పోల్చుతూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేయడంతోపాటు వీడియోలను వైరల్ చేశారు.
దీంతో కొన్నిరోజులుగా కొత్త సోఫాలుపై చర్చ సోషల్ మీడియాలో వాడివేడిగా జరుగుతోంది. దీనివల్ల రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆలోచనతోపాటు ప్రజల్లో లేనిపోని అపోహలు పెరుగుతున్నాయని భావించిన వీసీకే చీఫ్ తిరుమావళవన్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు. కానీ, ఏఐడీఎంకే తిరుగుబాటు వర్గం నుంచి వివరణ లేకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదని అంటున్నారు. మొత్తానికి వీసీకే చీఫ్ వివరణతో ‘కొత్త సోఫాల’పై జరుగుతున్న ప్రచారంలో ముఖ్యమంత్రి విజయ్ కి సంబంధం లేదన్న క్లారిటీ అయితే వచ్చిందని అంటున్నారు.
