Begin typing your search above and press return to search.

'విలేజ్ కుకింగ్ ఛానల్'.. యూట్యూబ్‌తో లక్షల ఆదాయం.. పెరియతంబి విజయగాథ ఇదే!

ప్రతిభకు, కష్టపడే తత్వానికి భాషా సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ‘విలేజ్ కుకింగ్ ఛానల్’.

By:  A.N.Kumar   |   3 Aug 2026 5:13 PM IST
విలేజ్ కుకింగ్ ఛానల్.. యూట్యూబ్‌తో లక్షల ఆదాయం.. పెరియతంబి విజయగాథ ఇదే!
X

ప్రతిభకు, కష్టపడే తత్వానికి భాషా సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ‘విలేజ్ కుకింగ్ ఛానల్’. సాధారణ గ్రామీణ జీవనశైలి, సంప్రదాయ పద్ధతుల్లో భారీ స్థాయిలో చేసే వంటలు, వాటన్నింటికీ మించి పదిమందికి పెట్టే దాతృత్వం.. ఈ ఛానల్‌ను ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఈ అద్భుత విజయ ప్రస్థానానికి ప్రధాన ఆకర్షణ.. ఆ ఛానల్ పెద్ద దిక్కు అయిన ‘పెరియతంబి’.

ప్రయాణం మొదలైందిలా..

ప్రారంభంలో సరదాగా పెరియతంబి చేసే సంప్రదాయ గ్రామీణ వంటకాలను వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. నాటు కోడి చికెన్, మటన్, చేపల పులుసు, బిర్యానీలు.. ఇలా పెద్ద పెద్ద పాత్రల్లో వందలాది మందికి సరిపడా వంటలు చేసే ఆయన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దానికి వచ్చిన అపారమైన ఆదరణతో కుటుంబ సభ్యులు, గ్రామంలోని మిత్రులను కలుపుకొని అధికారికంగా ‘విలేజ్ కుకింగ్ ఛానల్’ను నెలకొల్పారు.

సేవా గుణమే అసలైన విజయం

ఈ ఛానల్ సాధించిన విజయం కేవలం రుచికరమైన వంటలకే పరిమితం కాలేదు. తాము వండిన ఆహారాన్ని పేదలు, అనాథలు, వృద్ధులు,ఆకలితో ఉన్న వారికి ఆప్యాయంగా పంపిణీ చేయడమే వీరిని ప్రత్యేకంగా నిలబెట్టింది. వీరు చేసే ప్రతి వీడియో చివరలో వందలాది మంది ఆకలి తీర్చడమే ఈ ఛానల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది.

మైలురాళ్ళు.. గుర్తింపులు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా ఈ బృందంతో కలిసి వెజిటేబుల్ బిర్యానీ వండి, వారితో కలిసి భోజనం చేయడం ఈ ఛానల్ చరిత్రలోనే ఒక ప్రత్యేక ఘట్టం. భారత్‌లోనే కాక దుబాయ్ వంటి దేశాల్లో కూడా వీరు తమ వంటకాలతో సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఈ ఛానల్‌కు యూట్యూబ్‌లో 30.8 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ రెవెన్యూ, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా నెలకు సుమారు రూ. 11 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు ఆదాయం గడిస్తూ గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

స్ఫూర్తిదాయక సందేశం

ఏలాంటి భారీ హంగులు, గ్లామర్ లేకపోయినా.. స్వచ్ఛమైన మనస్సు, పల్లెటూరి వాతావరణం, తోటివారికి సహాయం చేసే గుణం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని పెరియతంబి, ఆయన బృందం నిరూపించారు. నలుగురికీ కడుపునిండా అన్నం పెడుతూ తమ జీవితాలనూ బంగారంగా మార్చుకున్న ఈ ‘విలేజ్ కుకింగ్ ఛానల్’ ప్రయాణం, సొంతంగా ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప స్ఫూర్తిదాయక కథనం.