దళపతి దెబ్బ : అన్నా డీఎంకేలో భారీ చీలిక ?
తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో తమిళ రాజకీయం పూర్తి స్థాయిలో మారనుంది. మళ్ళీ రెండు పార్టీల వ్యవస్థగా కూడా మార్పులు చెందనుంది.
By: Satya P | 10 May 2026 8:00 PM ISTతమిళనాడులో విజయ్ టీవీకే ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో తమిళ రాజకీయం పూర్తి స్థాయిలో మారనుంది. మళ్ళీ రెండు పార్టీల వ్యవస్థగా కూడా మార్పులు చెందనుంది. అయితే త్రిముఖ పోరులో వచ్చి నంబర్ వన్ ప్లేస్ లోకి టీవీకే వచ్చేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షం పాత్రలోకి డీఎంకే సర్దుకుంది. దాంతో మూడింది మూడవ పార్టీగా అన్నాడీఎంకేనని అంటున్నారు. ఆ పార్టీకి ఇమేజ్ ఉన్న లీడర్ షిప్ కొరత ఉంది. జయలలిత 2016లో సంపాదించి పెట్టిన అధికారాన్ని నాలుగేళ్ల పాటు అందుకుని అన్నా డీఎంకేని బీజేపీ అండతో 2026 ఎన్నికల దాకా మాజీ సీఎం పళనిస్వామి నడిపించగలిగారు. ఆయన విజయ్ వంటి ప్రజాకర్షణ నేత ముందు నిలిచి తట్టుకోలేరు అని అంటున్నారు.
రెండు ఓటములతో :
ఇక వరసగా రెండు ఎన్నికల్లో ఓటములతో అన్నా డీఎంకే దెబ్బ తిని పోతుంది అని అంటున్నారు. అన్నా డీఎంకేని గెలిపించే ప్రజాకర్షణ నాయకత్వం లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. నిజానికి 2026 ఎన్నికలు అన్నా డీఎంకేకి జీవన్మరణ సమస్యగా మారింది. డ్యాం ష్యూర్ గా గెలిచి తీరాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. దాంతో 53 మంది ఎమ్మెల్యేతో ఉన్న అన్నా డీఎంకే నిట్ట నిలువుగా చీలిపోనుంది అని అంటున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడం అన్నా డీఎంకే నుంచి ముఖ్యమంత్రిగా పళని స్వామి అవుతారు అని వార్తలు ప్రచారంలో ఉన్నా డీఎంకే వ్యూహాత్మకంగానే విజయ్ పార్టీకి అధికారం అందేందుకు పరోక్షంగా సహకరించింది అని అంటున్నారు. కచ్చితంగా మూడవ పార్టీ తమిళ రాజకీయాల్లో ఎలిమినేట్ కావాల్సిందే. అది అన్నా డీఎంకే అవుతుందని భావించే స్టాలిన్ విజయ్ గద్దెనెక్కేందుకు వీలుగా తన మిత్ర పార్టీలైన వామపక్షాలు వీసీకేలను సొంత నిర్ణయం తీసుకోవచ్చు అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఒక్కసారి విజయ్ కనుక అధికారంలోకి వస్తే కచ్చితంగా అన్నా డీఎంకే చీలిపోతుంది అని స్టాలిన్ వూహించడమే ఇందుకు కారణం. ఇపుడు అదే జరగబోతోంది అని అంటున్నారు.
సీనియర్ నేత సారధ్యంలో :
ఇప్పటిదాకా చూస్తే పళనిస్వామి పుదుచ్చేరితో పాటు అనేక చోట్ల రిసార్ట్ పాలిటిక్స్ నడిపి తన ఎమ్మెల్యేలను కాపాడుకున్నారు. అయితే తాజాగా పళనిస్వామి పెట్టిన ఎమ్మెల్యేల మీటింగుకు పది మంది దాకా గైర్ హాజరు అయ్యారు. వీరంతా పళనిస్వామి మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అంతే కాదు అన్నా డీఎంకేకు ఫ్యూచర్ లేదని కూడా అనేక మంది భావిస్తున్నారు. దీంతో అన్నా డీఎంకేలో సీనియర్ నేత అయిన సీవీ షణ్ముగం నాయకత్వంలో భారీ ఎత్తున అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిపోతారు అని అంటున్నారు. ఫిరాయింపుల దెబ్బ పడకుండా వీరంతా మూడింట రెండు వంతుల మంది పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.
బల పరీక్ష తరువాత :
ఈ నెల 13న విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొంటుంది. అక్కడ మెజారిటీ సులువుగానే విజయ్ కి లభిస్తుంది. తమిళనాడులో ఆ మీదట అసలైన రాజకీయ సయ్యాట మొదలవుతుందని అంటున్నారు. ఏకంగా 30 దాకా ఎమ్మెల్యేలు అన్నా డీఎంకే నుంచి టీవీకేలో చేరిపోతారు అని అంటున్నారు. దాంతో టీవీకే బలం అసెంబ్లీలో 150 దాకా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నంబర్ మరింతగా పెరిగితే కనుక మాజీ సీఎం పళనిస్వామి ఉండేది ఏవరు అసలు అన్నా డీఎంకే మనుగడలో ఉంటుందా అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
