ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?
తమిళనాడులో ఇద్దరు టీవీకే ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీఎం విజయ్ బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ ఓ ఫొటోగ్రాఫర్‌పై దాడి చేశారనే ఆరోపణలు, ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాలు పంపారనే వార్తలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా అనే ఆసక్తి నెలకొంది.
By: Tupaki Political Desk | 10 Nov 2026 6:26 PM ISTతమిళనాడులో అధికార టీవీకే ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి దళపతి విజయ్ సమావేశం కానున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ అత్యంత సాధారణంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు మాత్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి వ్యవహారశైలి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని చెబుతున్నారు. తాజాగా డిప్యూటీ స్పీకర్ రవిశంకర్, ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ ఒక మహిళా కలెక్టర్ కు అసభ్య సందేశాలు పంపారని కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని అంటున్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేలపై ఒకేసారి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలోకి వెళ్లిపోయింది. ఆ ఆరోపణలు తిప్పికొట్టడంలోనూ పార్టీ యంత్రాంగం విఫలమైందని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ తన నియోజకవర్గంలోని తాగునీటి సమస్య చెప్పిన ఒక ఫొటో గ్రాఫర్ పై దాడి చేశారు. తాను విజయ్ అభిమానిని అంటూ బాధితుడు చెబుతున్నప్పటికీ డిప్యూటీ స్పీకర్ కనికరించలేదు. ప్రజాప్రతినిధిని అన్న విషయాన్ని మరచిపోయి పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి దిగారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.
అదేవిధంగా ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ కళ్లకురిచి జిల్లా కలెక్టర్ కి అసభ్య మెసేజ్ లు పంపారనే ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మాజీ గవర్నర్ తమిళసై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే తీరును ప్రశ్నిస్తూ సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. అయితే తాను ఎలాంటి మెసేజ్‌లు పంపలేదని ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వివాదం రాజకీయంగా పార్టీకి నష్టం చేసినదిగా సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. తమ ఎమ్మెల్యేలు అనవసర వివాదాల్లో చిక్కుకోవడం ద్వారా పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయనే ఆలోచనతో అత్యవసరంగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
బుధవారం టీవీకే ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. తాను ఎంత క్రమశిక్షణతో నడుచుకుంటున్నా, ఎమ్మెల్యేలు మాత్రం వివాదాస్పదర వైఖరి కారణంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోందని సీఎం ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం విజయ్ ఎమ్మెల్యేలపై కఠిన వైఖరి ప్రదర్శించేందుకు సాహసిస్తారా? అనేది ఉత్కంఠకు గురిచేస్తోంది. మెజార్టీ కోసం ఇతర పార్టీలపై ఆధారపడిన సీఎం విజయ్ సొంత పార్టీ వారిపై వేటు వేసే అవకాశాలు లేవని, అలా అని ఉపేక్షిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంలో సీఎం విజయ్ తీసుకోబోయే నిర్ణయాలు సస్పెన్స్ గా మారాయి.
