Begin typing your search above and press return to search.

పొరుగు రాష్ట్రంలో కల్లు గీస్తే జైలు శిక్షలు.. అసలు కారణం ఏంటి..?

పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కల్లును ఒక సంప్రదాయ పానీయంగా, ఆరోగ్యకరమైన పానీయంగా భావిస్తుంటే.. తమిళనాడులో మాత్రం దశాబ్దాలుగా దానిపై నిషేధం కొనసాగడం విడ్డూరమైన అంశం.

By:  Tupaki Political Desk   |   28 April 2026 11:28 AM IST
పొరుగు రాష్ట్రంలో కల్లు గీస్తే జైలు శిక్షలు.. అసలు కారణం ఏంటి..?
X

పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కల్లును ఒక సంప్రదాయ పానీయంగా, ఆరోగ్యకరమైన పానీయంగా భావిస్తుంటే.. తమిళనాడులో మాత్రం దశాబ్దాలుగా దానిపై నిషేధం కొనసాగడం విడ్డూరమైన అంశం. 1987లో ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వం హయాంలో విధించిన నిషేధం వెనుక రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలున్నాయి. తమిళనాడులో తాటి, కొబ్బరి చెట్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ కల్లు విక్రయించడం లేదా సేకరించడం అక్కడ నేరం. పొరుగున ఉన్న కేరళ, తెలుగు రాష్ట్రాల్లో కల్లు గీత వృత్తిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తుంటే, తమిళనాడులో మాత్రం ఈ వృత్తిని చట్టవిరుద్ధం చేశారు. అప్పటి సీఎం ఎంజీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ నిషేధం నేటికీ కొనసాగుతుండడంపై అక్కడి రైతులు, గీత కార్మికులు దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు.

నిషేధానికి కారణాలు..

ప్రభుత్వం కల్లు నిషేధించడానికి ప్రధానంగా మూడు కారణాలు చెప్పింది. కల్లు సేకరించిన తర్వాత అది త్వరగా పులిసిపోతుంది. దానిని ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు లేదంటే కిక్కు పెంచడానికి కొందరు రసాయనాలు కలుపుతున్నారని, ఇది ప్రజల ఆరోగ్యానికి మరింత ప్రమాదంలోకి నెడుతుందని ప్రభుత్వం గుర్తించింది. దీనిని పర్యవేక్షించడం కష్టమైన పనిగా అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. కల్లు అనేది సహజంగా దొరికే పానీయం. దీనిపై ప్రభుత్వానికి పెద్దగా పన్నులు రావు. అదే సమయంలో ప్రభుత్వం విక్రయించే మద్యం ద్వారా వేల కోట్లు వస్తుంది. కల్లు అందుబాటులో ఉంటే ప్రభుత్వ మద్యం అమ్మకాలు తగ్గుతాయన్న ఆర్థిక కోణం కూడా దీని వెనుక ఉందని బహిరంగ రహస్యం. గ్రామీణ ప్రాంతాల్లో కల్లు డిపోల వద్ద గొడవలు జరుగుతున్నాయని, మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందనే సామాజిక కారణాన్ని కూడా ప్రభుత్వం వాడుకుంది.

నీరా వర్సెస్ కల్లు

కలును నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం 'నీరా'కు మాత్రం అనుమతి ఇచ్చింది. చెట్టు నుంచి తీసిన తాజా రసాన్ని 'నీరా' అంటారు. దీనిలో ఆల్కహాల్ ఉండదు. అదే రసాన్ని పులియబెడితే 'కల్లు'గా మారుతుంది. నీరాను నిల్వ చేయడం కష్టం, కొన్ని గంటల్లోనే కల్లులా మారిపోతుంది. దీనిని నియంత్రించడం పోలీసులకు, అబ్కారీ శాఖకు సవాలుగా మారింది. ఫలితంగా నీరా అమ్మకాలపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.

రైతుల ఆవేదన..

తమిళనాడులోని పశ్చిమ జిల్లాల్లో కొబ్బరి, తాటి రైతులు ఈ నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశాల్లో వైన్, బేర్ల మాదిరిగానే కల్లును ఒక నాచురల్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుందని వాదిస్తున్నారు. పక్కనే ఉన్న కేరళలో కల్లు అమ్మకాలు చట్టబద్ధమే కాకుండా, అది పర్యాటక రంగంలో ఒక భాగంగా మారింది. అక్కడ లేని సమస్య తమిళనాడులోనే ఎందుకు అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ప్రతి ఎన్నికల సమయంలోనూ కల్లుపై నిషేధం ఎత్తేస్తామనే హామీలు వినిపిస్తుంటాయి. కానీ, ఏ ప్రభుత్వం కూడా మద్యంపై వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కల్లు కేవలం మత్తు పానీయంగా కాకుండా.., వ్యవసాయ అనుబంధ ఉత్పత్తిగా గుర్తిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కల్తీ జరగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో బాట్లింగ్ చేసి విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం, ఇటు రైతులకు లాభం చేకూరుతుంది. అప్పటి వరకు తమిళనాడు ప్రజలకు కల్లు అనేది ఒక 'నిషేధిత అమృతం'గానే మిగిలిపోనుంది.