Begin typing your search above and press return to search.

'అమ్మ' ప్ర‌భావం ఎంత‌?: ఈ ద‌ఫా క‌నిపించ‌ని `జ‌య‌`!

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో సెంటిమెంటుకు పార్టీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. గ‌తించిన నాయ‌కుల ఫొటోలు, ఫ్లెక్సీలు క‌నిపిస్తాయి.

By:  Garuda Media   |   18 March 2026 10:49 AM IST
అమ్మ ప్ర‌భావం ఎంత‌?: ఈ ద‌ఫా క‌నిపించ‌ని `జ‌య‌`!
X

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో సెంటిమెంటుకు పార్టీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. గ‌తించిన నాయ‌కుల ఫొటోలు, ఫ్లెక్సీలు క‌నిపిస్తాయి. వారి మాట‌లు కూడా వినిపిస్తాయి. త‌ద్వారా.. ఓటు బ్యాంకును త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తాయి. ముఖ్యంగా మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత సెంటిమెంటును అన్నాడీ ఎంకే నేత‌లు వినియోగించుకుంటారు. పురుట్చిత‌లైవి (విప్ల‌వ నాయ‌కురాలు)గా పేరొందిన జ‌య‌ల‌లిత సెంటిమెంటును ఒడిసి ప‌ట్టుకుని విజ‌యం సాధించే ప్ర‌య‌త్నం చేస్తారు.

కానీ, ఈ ద‌ఫా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌భావం కానీ.. జ‌య‌కు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ.. ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. 1) జ‌య‌కు మిత్రులుగా, న‌మ్మిన‌బంట్లుగా ఉన్న నాయ‌కులు రాజ‌కీయ వైరుధ్యాల‌తో విడిపోయారు. గ‌తంలో జ‌య‌కు న‌మ్మిన బంటుగా ఉన్న ప‌న్నీర్ సెల్వం.. క‌రుణానిధి పార్టీ డీఎంకే లోకి వ‌చ్చేశారు. దీంతో ఇప్పుడు జ‌య పేరును కూడా ఆయ‌న ప్ర‌స్తావించ‌డం లేదు. డీఎంకే పూర్తిగా జ‌య‌కు వ్య‌తిరేకం. దీంతో ఆయ‌న ఇప్పుడు క‌రుణ పేరునే ప్ర‌స్తావిస్తున్నారు.

ఇక‌, జ‌య‌కు నెచ్చెలిగా వ్య‌వ‌హ‌రించిన శ‌శిక‌ళ కూడా.. అన్నాడీఎంకే పార్టీకి దూర‌మ‌య్యారు. తాజాగా కొత్త‌పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీలోనూ ఆమె ఎక్క‌డా జ‌య‌పేరును కానీ.. ఆమె ఫొటోను కానీ వాడుకోక‌పోవ డం గ‌మ‌నార్హం. దిగువ‌స్థాయి వ‌ర్గంలో జ‌య‌కు సానుభూతి ఉన్న‌ప్ప‌టికీ.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గంలో ఆమె పై ఆగ్ర‌హం ఇప్ప‌టికీ ఉంద‌న్న చ‌ర్చ ఉంది. అవినీతి, అక్ర‌మాల వ్య‌వ‌హారాలు త‌ర‌చుగా ప్ర‌స్తావ‌న‌కు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌య‌పేరును ఇప్పుడు శశిక‌ళ కూడా వినియోగించుకోవ‌డం లేదు.

ఇక‌, జ‌య పెట్టిన పార్టీ అన్నాడీఎంకే(డీఎంకే నుంచి విడివ‌డి)లోనూ ఇప్పుడు జ‌య‌కు ప్రాధాన్యం త‌గ్గ‌డం చిత్రంగా అనిపించినా నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. అన్నాడీఎంకే ఇప్పుడు బీజేపీతో జ‌ట్టుక‌ట్టింది. ఆ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న ఒక‌ప్ప‌టి జ‌య శిష్యుడు ప‌ళ‌ని స్వామి.. బీజేపీకి అత్యంత అనుకూలంగా మారిపోయారు. ఇక‌, జ‌య‌కు, బీజేపీకి వ్య‌క్తిగ‌తంగా ఉన్న విభేదాలు అంద‌రికీ తెలిసిందే. మోడీని గ‌ద్దె దించుతాన‌ని ఆమె చేసిన శ‌ప‌థం కూడా తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు.. జ‌య పేరును ఎత్త‌కుండా.. ఆమె గురించిన ప్ర‌చారం లేకుండా.. ప‌ళ‌ని స్వామిని క‌ట్ట‌డి చేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ప‌ళ‌ని కూడా.. కేంద్ర ప‌థ‌కాలు, మోడీ హవానే ఎక్కువగా ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. సో.. మొత్తంగా రాజీక‌య ప‌రిష్వంగంలో జ‌య పేరు తుడిచిపెట్టుకుపోయింద‌నే చెప్పాలి.