Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌కు డీఎంకే షాక్.. ‘వెన్నుపోటుదారులు’ అంటూ ఫైర్!

ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోవడమే కాకుండా జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న ఇండియా కూటమిలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

By:  A.N.Kumar   |   6 May 2026 11:45 AM IST
కాంగ్రెస్‌కు డీఎంకే షాక్.. ‘వెన్నుపోటుదారులు’ అంటూ ఫైర్!
X

తమిళనాడు రాజకీయ యవనికపై అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోవడమే కాకుండా జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న ఇండియా కూటమిలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం.. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ బంధంలో చిచ్చు పెట్టింది.

తమిళనాడులో బలమైన పునాదులు కలిగిన ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే), కాంగ్రెస్ పార్టీలు గత కొన్ని ఎన్నికలుగా విడదీయలేని మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. అయితే తాజా పరిణామాలతో ఈ మైత్రి బీటలు వారింది. విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంపై డీఎంకే శ్రేణులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ అసంతృప్తిని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కారు."వెన్నుపోటు దారులు " అంటూ ఆయన చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కార్చిచ్చులా మారింది.

నేరుగా కాంగ్రెస్ పేరు ఎత్తకపోయినప్పటికీ ఆ వ్యాఖ్యల అంతరార్థం హస్తం పార్టీని ఉద్దేశించినదేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వరకు కలిసి నడిచిన కాంగ్రెస్, ఇప్పుడు తమ ప్రధాన రాజకీయ శత్రువుగా మారుతున్న విజయ్‌తో చేతులు కలపడం డీఎంకేకు మింగుడుపడటం లేదు.

విజయ్ ‘పవర్’ పాలిటిక్స్.. కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?

సినీ రంగం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ తొలి ఎన్నికల్లోనే అంచనాలకు మించిన ఓట్ల శాతాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ కింగ్ మేకర్‌గా ఎదిగారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంపై సానుకూల ప్రకటన చేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. డీఎంకే నీడలో కాకుండా, స్వతంత్రంగా ఎదిగేందుకు విజయ్ పార్టీ ఒక బలమైన వేదికగా కాంగ్రెస్‌కు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి విజయ్ ఒక ప్రధాన శక్తిగా మారతారని గ్రహించిన కాంగ్రెస్, ఇప్పుడే ఆయనతో స్నేహం పెంచుకోవాలని భావిస్తోంది.

కూటమి భవిష్యత్తుపై నీలినీడలు

కాంగ్రెస్ వైఖరి కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న ఇండియా కూటమి ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. మిత్రపక్షాల మధ్య సమన్వయం లోపించిందని, ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలను కాంగ్రెస్ గాలికొదిలేస్తోందని డీఎంకే నేతలు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. "కూటమి ధర్మాన్ని విస్మరించి ప్రత్యర్థితో చేతులు కలపడం రాజకీయ నైతికత అనిపించుకోదు" అని డీఎంకే సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేపటి సమావేశంపైనే అందరి కళ్లు

ఈ ఉత్కంఠకు తెరదించేలా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్ సీసీ) రేపు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలా? లేదా డీఎంకేను బుజ్జగించేలా మధ్యేమార్గం అనుసరించాలా? అనే అంశాలపై చర్చించనున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారికంగా విజయ్ వైపు మొగ్గు చూపితే డీఎంకే కూటమి నుంచి వైదొలగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక హై-వోల్టేజ్ డ్రామాను తలపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్రంలో కొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతాయా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.