దళపతి విజయ్ పక్కా స్కెచ్..! ఏఐడీఎంకే పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేల షాక్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇంకా నెల రోజులు కాకముందే విపక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు.
By: Tupaki Political Desk | 25 May 2026 11:00 PM ISTతమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇంకా నెల రోజులు కాకముందే విపక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో గ్యారెంటీ లేదని డీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యాఖ్యానించిన కొద్దిరోజుల్లోనే ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు ముగ్గురు తమ పదవులకు రాజీనామా సమర్పిస్తున్నట్లు స్పీకర్ కు లేఖలు సమర్పించారు. ఈ ముగ్గురు అధికార టీవీకే పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏఐడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత వేలుమణి వర్గంలోని దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని ఏఐడీఎంకే స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా, ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురు టీవీకేలో చేరి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులుగా తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నారు.
ఏఐడీఎంకే పార్టీకి చెందిన కుమారవేల్, జయకుమార్, సత్యభామ సోమవారం స్పీకర్ ను కలిసి తమ రాజనామా లేఖలు సమర్పించారు. వీరంతా అన్నాడీఎంకే తిరుగుబాటు నేత వేలుమణి వర్గంగా చెబుతున్నారు. వీరితోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలో రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీవీకే ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలనే ఆలోచనతోనే అన్నాడీఎంకే నేతలు రాజీనామా చేస్తున్నారని, ఉప ఎన్నికల్లో టీవీకే తరపున గెలిచి ప్రభుత్వంలో చేరాలని భావిస్తున్నారని సందేహిస్తున్నారు.
తమిళనాడు ఎన్నికల్లో 107 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే అధికారం కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టు, లెఫ్ట్ పార్టీలపై ఆధారపడింది. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 118 కాగా, టీవీకే పార్టీకి 11 మంది సభ్యుల బలం తక్కువ కావడంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అయితే కమ్యూనిస్టు, వీసీకే పార్టీలు ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తో సత్సంబంధాలను కోరుకుంటున్నారు. దీంతో ఎప్పటికైనా టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చన్న ధీమాతో డీఎంకే వ్యవహరిస్తోందని చెబుతున్నారు.
ఇది ముందే ఊహించిన ముఖ్యమంత్రి విజయ్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఏఐడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో మ్యాజిక్ మార్కు తగ్గుతుందని అంటున్నారు. అదేసమయంలో ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి కావాల్సిన బలం తెచ్చుకోవచ్చు అన్న ధీమాతో ముఖ్యమంత్రి విజయ్ వ్యూహరచన చేశారని అంటున్నారు. దీంతో త్వరలో మరికొందరు ఏఐడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి భారీగా ఉప ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
