Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాట పొలిటిక‌ల్ మిస్ట‌రీ.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడులో పొలిటిక‌ల్ మిస్ట‌రీ నెల‌కొంది. ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో.. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

By:  Garuda Media   |   6 May 2026 9:15 AM IST
త‌మిళ‌నాట పొలిటిక‌ల్ మిస్ట‌రీ.. ఏం జ‌రుగుతుంది?
X

త‌మిళ‌నాడులో పొలిటిక‌ల్ మిస్ట‌రీ నెల‌కొంది. ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో.. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. 108 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని ప్ర‌భంజ‌నం సృష్టించిన టీవీకే పార్టీ అధినేత‌, ద‌ళ‌ప‌తి విజ‌య్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా ముందుకు రాలేదు. త‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు లేని నేప‌థ్యంలో భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఏంట‌నేది కూడా ఆయ‌న చెప్ప‌లేదు. అంత‌ర్గ‌తంగా పొత్తుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తున్నా.. ఏ పార్టీతో క‌లుస్తారు? ఎవ‌రిని అక్కున చేర్చుకుని అధికారం ద‌క్కించుకుంటార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

గ‌వ‌ర్న‌ర్ యూట‌ర్న్‌?

మ‌రోవైపు.. గ‌వ‌ర్న‌ర్ యూట‌ర్న్ తీసుకునే అవ‌కాశం ఉంద‌న్న వాద‌నా వినిపిస్తోంది. ప్ర‌స్తుత 16వ అసెంబ్లీ ముగియ‌డానికి ఈ నెల 10వ తేదీ వ‌ర‌కే స‌మ‌యం ఉంది. ఈ లోగానే.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలి. అయితే.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఎమ్మెల్యేల సంఖ్య విజ‌య్ కు లేదు. పోనీ.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా.. త‌ర్వాత‌.. ఆయ‌న విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు కూడా.. కేవ‌లం నాలుగు రోజుల్లోనే జ‌ర‌గాల్సి ఉంటుంద‌ని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. దీనికి గ‌వ‌ర్న‌ర్ అవ‌కాశం ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఎందుకంటే.. తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని.. త‌మ‌ను ఆహ్వానించాల‌ని విజ‌య్‌.. రాష్ట్ర ఇంచార్జ్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న ప‌ర్లేక‌ర్‌కు లేఖ పంపారు. కానీ, ఆయ‌న నుంచి స‌మాధానం రాలేదు. లోక‌భ‌వ‌న్‌(రాజ్‌భ‌వ‌న్‌) వ‌ర్గాల నుంచి కూడా ఎలాంటి స‌మాచారం లేదు. ఇక‌, విజ‌య్‌తో పొత్తులపై ఇత‌ర పార్టీలు కూడా మౌనంగా ఉన్నాయి. ఆయ‌న ఆహ్వానిస్తేనే తాము అడుగులు వేయాల‌న్న కోణంలో చిన్నా చిత‌కా పార్టీలు ఆలోచ‌న చేస్తున్నాయి. త‌మంత‌ట తాముగా విజ‌య్ వ‌ద్ద‌కు వెళ్తే.. అప్పుడు తాము ఆశించిన ప‌ద‌వులు ద‌క్క‌క పోవ‌చ్చ‌ని భావిస్తున్నాయి.

దీంతో పొత్తుల విష‌యంలోనూ.. అటు గ‌వ‌ర్న‌ర్ నుంచి ఆహ్వానం వ‌చ్చే విష‌యంలోనూ సందిగ్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఈ నెల 10తో అసెంబ్లీ, ప్ర‌భుత్వ గ‌డువు కూడా తీరిపోతుంది. ఫ‌లితంగా ఏ పార్టీకీ మెజారిటీ రాని నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు సిఫార‌సు చేసే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఎలాంటి మ‌లుపు తిరుగుతాయ‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది.