మొహం మీదే తేనెతుట్టె !
కానీ ఒక వ్యక్తి ఏకంగా తన మొహం మీద వాలిన సుమారు 60 వేల తేనెటీగలను ఏకంగా 5 గంటల 3 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని చోలన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు.
By: Garuda Media | 20 Aug 2026 2:05 PM ISTఒక్క తేనెటీగ కరిస్తే మనం విలవిలలాడిపోతాం. తేనెటీగలు కనిపించాలంటే అక్కడి నుండి పారిపోతాం. కానీ ఒక వ్యక్తి ఏకంగా తన మొహం మీద వాలిన సుమారు 60 వేల తేనెటీగలను ఏకంగా 5 గంటల 3 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని చోలన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలక్కాడు సమీపంలోని మలయడిపుతూర్ గ్రామానికి ఎస్.ఎసక్కిముత్తు ఆలియాస్ మురుగన్ ఈ రికార్డు సృష్టించాడు. వల్లియూర్ లోని మారియా ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ఈ రికార్డుకు వేదిక కావడం విశేషం.
27 ఏళ్ల మురుగన్ వ్యవసాయ డిప్లొమా చేసి స్వయం ఉపాధి మార్గంలోకి వచ్చి తన తల్లి పేరు మీద కమల నేచురల్ హనీ ఫార్మ్ నడుపుతున్నాడు. గత ఆరేళ్లుగా తేనెటీగల పెంపకంలో ఉన్న మురుగన్ స్వచ్చమైన తేనెతో పాటు 18 రకాల ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తున్నాడు.
యువత , రైతులు స్వయం ఉపాధి వైపు రావాలని, ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా గ్రామీణ ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని, తేనెటీగలను ఇబ్బంది పెట్టకుంటే అవి కుట్టవు అని నిరూపించడం, ఎక్కువ మందిని ఆకర్షించి, తేనెటీగల పెంపకాన్ని ఆకర్షించడం తన ప్రధాన ఉద్దేశం అని చెబుతున్నాడు.
ప్రతి నెల మురుగన్ తన ఫార్మ్ లో 100 మందికి వారానికి 2 రోజులు తేనెటీగల పెంపకంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. నెలకు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు.
