త్రిశంకు స్వర్గంలో తమిళనాడు...ప్రభుత్వం లేదు !
ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వం లేదు. గవర్నర్ అక్కడి ప్రభుత్వాన్ని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రద్దు చేశారు.
By: Satya P | 6 May 2026 11:44 PM ISTప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వం లేదు. గవర్నర్ అక్కడి ప్రభుత్వాన్ని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రద్దు చేశారు. తమిళనాడులో తాజాగా జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వం ఓటమి పాలు కావడంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఆయన ప్రభుత్వానికి గడువు కూడా తీరిపోవడంతో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తమిళనాడులో ప్రస్తుతం ప్రభుత్వం అన్నది లేకుండా పోయింది.
మెజారిటీ కొరత :
తమిళనాడులో హంగ్ ఏర్పడింది. ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. అతి పెద్ద పార్టీగా విజయ్ నాయకత్వంలోని టీవీకే ఉంది. ఆయన పార్టీకి 108 సీట్లు లభించాయి. అయితే ఆయన మెజారిటీకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం చూస్తున్న వేళ కాంగ్రెస్ నుంచి అయిదుగురు ఎమ్మెల్యేల మద్దతు దక్కింది. అయినా సరే మరో అయిదారుగురు అవసరం ఆయనకు ఉంది. అందుకే ఆయన గవర్నర్ ని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినా అనుమతి అయితే లభించలేదు. దాంతో విజయ్ కి మెజారిటీ సమస్య ఏర్పడింది.
ఏమి జరగనుంది :
ఇపుడు అర్జంటుగా విజయ్ చేయాల్సింది ఒక్కటే. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, అంతే కాదు తనకు మ్యాజిక్ ఫిగర్ 118కి సరిపడా నంబర్ కోసం చిన్న పార్టీల నుంచి ఎమ్మెల్యేలను సహకరించేలా చూసుకోవడం. గవర్నర్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విషయం తీసుకుంటే ఆయనకు మొత్తం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కనిపించాల్సి ఉందని అంటున్నారు. అలా జరిగితేనే విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఇది రాజ్యాంగం ప్రకారం ఆయనకు ఉన్న విచక్షణాధికారం. దాంతో విజయ్ ముందు పెద్ద చిక్కు ఉన్నట్లు అవుతోంది.
ఎప్పటికి అయ్యేను :
మెజారిటీ అంటే చిన్న పార్టీలు ఇవ్వాలి. డీఎంకేతో ఉన్న సీపీఐ సీపీఎం వీసీకే వంటి పార్టీలు అయితే విజయ్ పార్టీకి మద్దతుకు విముఖంగా ఉన్నట్లుగా చెప్పేశాయి. దాంతో మరింతగా పీట ముడి బిగుసుకుంటోంది. ఇంకో వైపు అన్నా డీఎంకే డీఎంకే పార్టీలు రెండూ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారం సాగుతున్నా అది కూడా అంతగా జరిగేది కాదని అంటున్నారు. దాంతో విజయ్ పార్టీ మెజారిటీ తెచ్చుకోకపోతే గవర్నర్ ఏమి చేస్తారు అన్నది ఒక చర్చగా ఉంది.
రాష్ట్రపతి పాలన :
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలను కూడా కొట్టి పారేయడానికి లేదని అంటున్నారు. కొంతకాలం పాటు అయినా రాష్ట్రపతి పాలన పెడితే అపుడు ఏ రెండు కూటములో లేక ఏ కొంత మంది ఎమ్మెల్యేలో అటు నుంచి ఇటు వచ్చి ప్రభుతానికి సిద్ధపడుతారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు అన్ని పార్టీలు ఇంకా ఎన్నికల వేడిలోనే ఉన్నాయి కాబట్టి ఆ బంధం అన్నది గట్టి పడక పోవచ్చు అని ఒక చర్చ ఉంది. ఏది ఏమైనా ఈ రోజుకు చూస్తే కనుక తమిళనాడులో ప్రభుత్వం అన్నది లేదు ఇలా కూడా ఎక్కువ కాలం ఉండకూడదు కాబట్టి విజయ్ విషయంలో ఒకటి రెండు రోజులు వేచి చూసి పరిస్థితిని కేంద్రానికి గవర్నర్ నివేదించవచ్చు ఆ మీదట రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
