Begin typing your search above and press return to search.

అతి పెద్ద పార్టీని పిలవాలని ఎక్కడా లేదు !

గవర్నర్ పూర్తిగా సంతృప్తి చెందిన మీదటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ మెజారిటీ అన్నది అసెంబ్లీలో నిరూపించుకునే దానికి ముందే గవర్నర్ కూడా సంతృప్తి చెందాల్సి ఉంటుందని న్యాయ కోవిదులు చెబుతున్నారు.

By:  Satya P   |   8 May 2026 2:00 PM IST
అతి పెద్ద పార్టీని పిలవాలని ఎక్కడా లేదు !
X

రాజ్యాంగంలో గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉంటాయి. ఏ పార్టీని కానీ ప్రభుత్వాన్ని పిలిచి ప్రమాణం చేయించాలన్నాది ఆయన ఇష్టం. అయితే అది రాజ్యాంగానికి లోబడి తీసుకునే నిర్ణయం గా ఉండాలి. ఇపుడు దేశమంతా ఒకే విషయం చర్చిస్తోంది. తమిళనాడులో అతి పెద్ద పార్టీగా సీట్లు పొందిన టీవీకేని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎందుకు పిలవడం లేదు అని. దీని మీద ఎవరికి తోచిన తీరులో వారు భాష్యాలు చెబుతున్నారు గతంలో జరిగింది కదా అలాగే చేయాలని రూల్ లేదు, అసలు అతి పెద్ద పార్టీని ఆహ్వానించాలని ఎక్కడా లేదని కూడా రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. గవర్నర్ పూర్తిగా సంతృప్తి చెందిన మీదటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ మెజారిటీ అన్నది అసెంబ్లీలో నిరూపించుకునే దానికి ముందే గవర్నర్ కూడా సంతృప్తి చెందాల్సి ఉంటుందని న్యాయ కోవిదులు చెబుతున్నారు.

విజయ్ ని కోరడం సబబే :

టీవీకేకి తాజా ఎన్నికల్లో 108 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో విజయ్ రెండవ చోట పోటీ చేసిన సీటు తీసేస్తే నికరంగా 107 మాత్రమే. ఇక కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది అంటే మరో అయిదుగురు, ఇలా 112 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 118 కి ఆరు సీట్లు తక్కువగా ఉంది. కేంద్రంలో 1998లో వాజ్ పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓటమి పాలు అయింది. అలాంటిది ఆరుమంది ఎమ్మెల్యేల మద్దతు అంటే చిన్న విషయం కాదు. ముందు ప్రభుత్వం ఏర్పాటుకు చాన్స్ ఇస్తే మెజారిటీ తరువాత నిరూపించుకుంటాను అనడం ఏదైతే ఉందో దాని వల్ల చాలా సార్లు ప్రభుత్వాలు కూలిపోయాయని అంటున్నారు. ఆ విధంగా గవర్నర్ తన విచక్షణను ఉపయోగించి మెజారిటీ లేని ప్రభుత్వాలను పిలుస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే రాజేంద్ర అర్లేకర్ గతంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉన్న వారు. పైగా అసెంబ్లీలో మెజారిటీ విషయం మీద కూడా అవగాహన ఉన్న వారు. రాజ్యాంగం ప్రకారం చూస్తే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించడం గవర్నర్ ప్రథమ విధి. అందుకే ఆయన విజయ్ ని 118 మ్యాజిక్ ఫిగర్ తో రమ్మని కోరారని అంటున్నారు. ఇందులో తప్పేమి ఉందని రాజ్యంగ నిపుణులు అంటున్నారు.

అతి పెద్ద పార్టీ అయితే :

ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు ఉంటుందనుకోవడం ఒక అపోహ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే సంచలన వ్యాఖ్యలు చేశరు. ఆయన తాజాగా ఒక జాతీయ స్థాయి చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తమిళనాడు పరిణామాల పట్ల రాజ్యాంగం న్యాయ సంబంధ అంశాల గురించి కూలంకషంగా వివరించారు. తన వద్దకు వచ్చిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ముందే మెజారిటీ నిరూపించుకోమని కోరడం గవర్నర్ కి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆయన విశ్లేషించారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గవర్నర్ అసలైన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

కచ్చితమైన హామీగా :

ఎవరో మద్దతు ఇస్తామని మాట సాయంగా చెబితే దానికి విశ్వసించాలన్నది గవర్నర్ కి లేదని అన్నారు. మద్దతు లేఖలు కావాలని స్పష్టంగా ఆయన కోరడంలో తప్పు లేదని కూడా హరీశ్ సాల్వే అన్నారు. మద్దతు ఇచ్చిన వారి సంతకాలతో పత్రాలు సమర్పించాలని గవర్నర్ కోరడం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ హితమే కాదు గవర్నర్ విచక్షణాధికారం కూడా అని ఆయన అన్నారు. అంతే కాదు గవర్నర్ తన పరిధిని ఎక్కడా దాటినట్లు కానే కాదని హరీశ్ సాల్వే వదించారు. అయితే ఎమ్మెల్యేల పరేడ్ ని లోక్ భవన్ లో నిర్వహించాలని గవర్నర్ కోరితే తప్పు అని అన్నారు.

తమిళనాడులొ సంక్లిష్టత :

తమిళనాడులో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయని హరీశ్ సాల్వే అన్నారు. ఎక్కువ సీట్లు సాధించి ఒక పాపులర్ సినీ స్టార్ ముందుకు వచ్చారని ఆయనకు ప్రభుత్వం ఏర్పాటుకు చాన్స్ ఇవ్వాలని కొందరు వాదిస్తున్నారు అని అదే సమయంలో రాజకీయంగానూ అనిశ్చి తి నెలకొన్న విషయం కూడా చూడాలని అన్నారు. గవర్నర్ ఈ రెండో వైపు చూస్తున్నారు అని హరీశ్ సాల్వే అభిప్రాయపడ్డారు. అంటే హంగ్ అసెంబ్లీ వచ్చింది. ఎవరికీ మెజారిటీ లేదు, దాంతో గవర్నర్ పాత్ర చాలా కీలకం గా మారుతోంది అని అన్నారు.

రాష్త్రపతి పాలన మేలు :

ఒక అతి పెద్ద పార్టీని ఆహ్వానించి ఆ పార్టీ బల నిరూపణలో ఫెయిల్ అయితే గవర్నర్ ఏం చేయగలరని కూడా ప్రశ్నించారు. దాని కంటే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అధికారం అవకాశం కూడా రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కి ఉంటుందని హరీశ్ సాల్వే గుర్తు చేస్తున్నారు. దేశంలో స్వతంత్ర్య రాజ్యాంగ వ్యవస్థలుగా ఎన్నికల సంఘం, గవర్నర్ వంటివి ఉన్నాయని, రాజకీయంగా తమకు ఇబ్బంది అనుకుంటే తమకు నచ్చని నిర్ణయాలు తీసుకుంటే కనుక వాటి మీద విమర్శలు చేయడం ఒక తప్పుడు అలవాటుగా ఈ రోజున మారిందని హరీశ్ సాల్వే అన్నారు. రాజకీయాలే కాదు రాజ్యాంగం పట్ల కూడా విశ్వాసం ఉంచాలని హితవు పలికారు.