బాబాయ్ స్టాలిన్ కి అమ్మాయ్ కయల్విళి సవాల్ ?
ఇదిలా ఉంటే మాజీ డీఎంకే నాయకుడు ఎంకే అళగిరి కుమార్తె కయల్విళి రాజకీయంగా చురుకైన పాత్ర పోషించాలని చూస్తున్నారు.
By: Satya P | 31 May 2026 8:00 AM ISTతమిళనాడు రాజకీయం ఎపుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అక్కడ కుటుంబ పార్టీలలో జరిగే అలజడి ఎపుడూ జనాలకు ఒక చర్చకు ఆస్కారం కల్పించే అంశమే. తమిళనాడులో డీఎంకే దిగ్గజ నేతగా వ్యవస్థాపకులలో ఒకరిగా నిలిచిన కరుణానిధి తనదైన ముద్రను ఆ రాష్ట్రంలో రాజకీయంగా వేశారు. ఇక ఆయన తరువాత వారసత్వం మీద పోటీ ఇద్దరు అన్న దమ్ముల మధ్యన వచ్చింది. అనాడు కేంద్ర మంత్రిగా యూపీయే ప్రభుత్వంలో పనిచేసిన అళగిరి డీఎంకే సారధ్యం తనకు కావాలని బలంగా కోరుకున్నారు. అయితే తమ్ముడు స్టాలిన్ వైపు కరుణానిధి మొగ్గు చూపడంతో అది తీవ్రంగా ఆయన వ్యతిరేకించారు. దాంతో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించి మరీ స్టాలిన్ ని తన రాజకీయ వారసుడిగా కరుణానిధి ప్రకటించారు. అలా అళగిరి రాజకీయం ముగిసిపోయింది. అయితే ఇపుడు ఆయన కుమార్తె కయల్విళి సరికొత్త రాజకీయంతో తన సొంత బాబాయ్ డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ ని సవాల్ చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు.
చురుకైన మహిళా నేతగా :
ఇదిలా ఉంటే మాజీ డీఎంకే నాయకుడు ఎంకే అళగిరి కుమార్తె కయల్విళి రాజకీయంగా చురుకైన పాత్ర పోషించాలని చూస్తున్నారు. ఆమె డీఎంకేలో కూడా మహిళా నాయకురాలిగా కీలక పాత్ర పోషించారు. అయితే తండ్రికే అక్కడ స్థానం లభించకపోవడంతో ఆమె రాజకీయం ఆగింది. అయితే ఆమె టీవీకే ద్వారా తన కొత్త రాజకీయాన్ని మొదలు పెడుతున్నారు. ఈ మధ్యనే ముగిసిన తమిళనాడు ఎన్నికల్లో ఆమె టీవీకే తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి అళగిరి గురించి ప్రస్తావించారు. తన తండ్రి డీఎంకేకి ఎంతో సేవ చేశారు కానీ ఆయనకు సరైన అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు పార్టీకి దూరం చేశారు అని స్టాలిన్ మీద పరోక్ష విమర్శలు చేశారు. ఇక టీవీకే గెలిచి విజయ్ సీఎం గా ప్రమాణం చేసిన కార్యక్రమానికి ఆమె హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.
మంత్రులతో భేటీ :
ఇదిలా ఉంటే కయల్విళి తమిళనాడు సచివాలయాన్ని సందర్శించి టీవీకే సీనియర్ మంత్రులతో సమావేశమైన అంశం ఇపుడు చర్చకు తావిస్తోంది. ఆమె అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే)లో త్వరలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపధ్యంలోనే మంత్రులతో ఆమె భేటీ అని అంటున్నారు. ఇక కయల్విళి సచివాలయంలో కొన్ని గంటలపాటు గడిపి కీలక మంత్రులతో చర్చలు జరిపారు. ఆమె ముఖ్యమంత్రి విజయ్ కొత్త ప్రభుత్వం తమిళనాడులో ఒక కొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొంటూ ఈ మధ్యనే బహిరంగంగా ప్రశంసించారు.
మేయర్ పదవి కోసం :
ఇదిలా ఉంటే మదురైలోని స్థానిక రాజకీయ వర్గాల అంచనా ప్రకారం చూస్తే కయల్విళి తొందరలోనే టీవీకేలో చేరి మదురై కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిత్వం దక్కించుకుంటారు అని అంటున్నారు. ఈ కీలకమైన ఎన్నికలలో ఆమె తనదైన పాత్రను పోషించేందుకు ఉత్సాహపడుతున్నారని అంటున్నారు. ఆమె రాజకీయ జీవితానికి మేయర్ పదవి తొలి మెట్టు అని అంటున్నారు. గతంలో స్టాలిన్ కూడా చెన్నై మేయర్ గా పనిచేసి ఆ మీదటనే రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. ఇపుడు బాబాయ్ బాటలోనే కయల్విళి వ్యవహరిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు ఆమె టీవీకేలో భవిష్యత్తులో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు. దీంతో బాబాయ్ స్టాలిన్ ని అమ్మాయ్ కయల్విళి సవాల్ చేస్తుందా అన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
