Begin typing your search above and press return to search.

గుళ్లల్లో కాదు ఆ రాష్ట్రంలోని సీపీఎం ఆఫీసుల్లో లవ్ మ్యారేజీలు చేసుకోవచ్చట

గుళ్లు.. దేవాలయాలు.. ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు.. ఆర్యసమాజ్ లు నిలుస్తాయి.

By:  Garuda Media   |   26 Aug 2025 3:00 PM IST
గుళ్లల్లో కాదు ఆ రాష్ట్రంలోని సీపీఎం ఆఫీసుల్లో లవ్ మ్యారేజీలు చేసుకోవచ్చట
X

గుళ్లు.. దేవాలయాలు.. ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు.. ఆర్యసమాజ్ లు నిలుస్తాయి. అయితే.. ఇందుకు భిన్నంగా తాజాగా ఒక రాజకీయ పార్టీ రోటీన్ కు భిన్నమైన ప్రకటన చేసింది. ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే.. ఎక్కడికో వెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.. తమ పార్టీ ఆఫీసులకు వచ్చి లవ్ మ్యారేజీలు చేసుకోవచ్చన్న ప్రకటనతో అందరూ ఆ రాజకీయ పార్టీ వైపు చూసేలా చేశారు. ఇంతకీ ఆ రాజకీయ పార్టీ ఏది? ఏ రాష్ట్రంలో ఆ పార్టీ ఈ తరహా ప్రకటన చేసింది..? దీనికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

కమ్యూనిస్టు పార్టీల్లో ఒకటైన సీపీఎం ఈ వినూత్న ప్రకటన చేసింది. రాజకీయాలు.. ప్రజా సమస్యల పరిస్కారం కోసం గళం విప్పుతూ.. ప్రభుత్వాలపై పోరు చేసే ఈ పార్టీ.. అందుకు భిన్నంగా ప్రేమ పెళ్లిళ్లను తమ పార్టీ ఆఫీసుల్లో చేసుకోవాలని కోరటం సంచలనంగా మారింది. అయితే.. ఈ ప్రకటన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాదు. తమిళనాడు పార్టీ రాష్ట్ర శాఖ ఈ ప్రకటన చేసింది. అంటే.. ఇది తమిళనాడుకు మాత్రమే పరిమితం అనుకోవాలి.

ఇటీవల కాలంలో పరువు హత్యలు ఎక్కువ కావటంతో ఈ నిర్ణయాన్ని తాము తీసుకున్నట్లుగా తమిళనాడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం పేర్కొన్నారు. కులాంతర వివాహాలు చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు లేవని.. అందుకే ప్రేమికుల కోసం మార్క్సిస్టు కార్యాలయాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. కులాంతర వివాహాలు చేసుకోవాలని నిర్ణయించుకునే ప్రేమికులకు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న తమ పార్టీ కార్యాలయాల్లో నిక్షేపంగా చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. రాజకీయాలు చేయాల్సిన రాజకీయ పార్టీ ప్రేమికుల పెళ్లిళ్లకు వేదికగా మారటంపై తమిళులు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.