Begin typing your search above and press return to search.

స్పీకర్ కుర్చీపై విజయ్ వింత కథ.. సభలో నవ్వులు పూయించిన విజయ్..

ఎంతో అనుభవం ఉన్న నాయకుడిలా సభను నడుపుతున్నారు తమిళనాడు సీఎం విజయ్. సభలో ఛలోక్తులు, సభ్యులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూనే చిన్న చిన్న కథలను కూడా చెప్తున్నారు.

By:  Tupaki Political Desk   |   12 May 2026 3:51 PM IST
స్పీకర్ కుర్చీపై విజయ్ వింత కథ.. సభలో నవ్వులు పూయించిన విజయ్..
X

ఎంతో అనుభవం ఉన్న నాయకుడిలా సభను నడుపుతున్నారు తమిళనాడు సీఎం విజయ్. సభలో ఛలోక్తులు, సభ్యులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూనే చిన్న చిన్న కథలను కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగా ‘స్పీకర్ కథ’ ఒక చెప్పి సభలో నవ్వులు పూయించారు. స్పీకర్ పదవి అంటే అది పరమాన్నం కాదు, పక్కాగా 'ప్రమాదం' అనిపిస్తోంది. అసెంబ్లీలో అందరినీ కంట్రోల్ చేస్తూ, గంభీరంగా కనిపించే స్పీకర్ పదవి వెనుక ఇంతటి 'భయంకరమైన' హిస్టరీ ఉందా అని విన్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మన నాయకులు ఒక చిన్న పదవి కోసం కొట్టుకు చస్తుంటే, ఒకప్పుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి మనుషులను బలవంతంగా ఈడ్చుకొచ్చేవారట! విజయ్ ఈ కథను మరీ అంత డీటైల్డ్‌గా ఎందుకు చెప్పారో కానీ, ప్రస్తుతం ఉన్న స్పీకర్లకు మాత్రం ఇది వింటుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

ఇంగ్లాండ్ పార్లమెంట్..

ఈ వింత ఆచారం ఇంగ్లాండ్ పార్లమెంట్ నుంచి పుట్టిందని విజయ్ వివరించారు. రాజుల కాలంలో పార్లమెంట్ తీసుకునే నిర్ణయాలను వెళ్లి రాజుకు చెప్పడం అంటే.. సింహం నోట్లో తల పెట్టడమేనట. ఒకవేళ పార్లమెంట్ నిర్ణయం రాజుకు నచ్చకుంటే ఆ వార్తను పట్టుకొచ్చిన స్పీకర్‌కు 'మరణశిక్షే'! ‘చెప్పేవాడికి బుద్ధి ఉండాలి.. వార్త మోసుకొచ్చిన వాడికి చావు ఉండాలి’ అనే టైపులో రాజులు ఉండేవారట. ఈ భయంతోనే స్పీకర్ పదవి అంటే అప్పట్లో అందరూ ఆమడ దూరం పారిపోయేవారు.

బలవంతంగా కూర్చోబెట్టడమే!

స్పీకర్ పదవి ఇస్తామన్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో, బ్రిటీష్ పార్లమెంట్ ఒక వింత పద్ధతికి తెర లేపింది. స్పీకర్‌గా ఒకరిని ఎన్నుకున్నాక, ఆయన ‘నాకొద్దు బాబోయ్’ అని మొత్తుకున్నా సరే.. ఇద్దరు సభ్యులు వెళ్లి ఆయన చేతులు పట్టుకొని, బలవంతంగా ఈడ్చుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టేవారు. అందుకే నేటికీ స్పీకర్‌గా ఎన్నికైన వారిని ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కలిసి గౌరవంగా కుర్చీ వరకు తీసుకెళ్తుంటారు. కానీ, ఆ గౌరవం వెనుక ఉన్న అసలు కారణం.. ఆ రోజుల్లో దాన్ని ఒక 'బలిపీఠం'లా చూడడమేనని విజయ్ సెలవిచ్చారు.

విజయ్ చెప్పిన ఈ కథ వింటుంటే.. ‘నాటి స్పీకర్లకు ప్రాణ భయం ఉంటే, నేటి స్పీకర్లకు మైకుల భయం, పేపర్ల భయం ఉంది’ అనిపిస్తోంది. రాజులు లేకపోయినా, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొడవలు రాజుగారి కోపం కంటే తక్కువేమీ కాదు! స్పీకర్ కుర్చీలో కూర్చోవడం అంటే అందరి తిట్లు భరించడమే అని విజయ్ హింట్ ఇస్తున్నారో ఏమో కానీ, ఈ హిస్టరీ పాఠం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పదవి కోసం పాకులాడే నాయకులు ఈ కథ వింటే.. అప్పుడు స్పీకర్ పదవికి ఇంటర్వ్యూలు కూడా రావు’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

విజయ్ మార్క్ ‘సినిమాటిక్’ హిస్టరీ!

ముఖ్యమంత్రి విజయ్ ఏదైనా చెబితే అది పక్కాగా సినిమా సీన్ లాగే ఉంటుంది. స్పీకర్ పదవి గురించి ఆయన ఇచ్చిన ఈ వివరణ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో కానీ.. ఆ కుర్చీలో కూర్చోబెట్టేటప్పుడు జరిగే ‘బలవంతంగా పీఠంపై కూర్చోబెట్టడం’ వెనుక ఉన్న వేదనను మాత్రం అద్భుతంగా ఆవిష్కరించారు. పదవి అంటే హోదా మాత్రమే కాదు, అది ఒక 'బాధ్యతాయుతమైన ప్రమాదం' అని విజయ్ తనదైన శైలిలో తేల్చేశారు. మొత్తానికి విజయ్ చెప్పిన ఈ కథ విన్నాక.. ‘పదవి వద్దు బాబోయ్.. ప్రాణం ఉంటే చాలు’ అనుకున్న నాటి స్పీకర్ల ధైర్యానికి (లేదా భయానికి) జోహార్లు అర్పించాల్సిందే!