Begin typing your search above and press return to search.

మోదీకి ‘నెక్ట్స్ పీఎం’’ షాక్.. చెన్నై పర్యటనలో కలకలం

ప్రధాని మోదీ చెన్నై పర్యటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గత పర్యటనలకు భిన్నంగా ఎటువంటి నిరసనలు, ఉద్రిక్తతలు లేకుండా ఈ సారి మోదీ టూర్ ముగిసింది.

By:  Tupaki Political Desk   |   12 Oct 2026 11:46 AM IST
మోదీకి ‘నెక్ట్స్ పీఎం’’ షాక్.. చెన్నై పర్యటనలో కలకలం
X

ప్రధాని మోదీ చెన్నై పర్యటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గత పర్యటనలకు భిన్నంగా ఎటువంటి నిరసనలు, ఉద్రిక్తతలు లేకుండా ఈ సారి మోదీ టూర్ ముగిసింది. అదే సమయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి దళపతి విజయ్ హావాభావాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఆదివారం చెన్నైకి వచ్చిన ప్రధాని మోదీ సుమారు 13 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి విజయ్ కలిసి చెన్నై మెట్రోలో ప్రయాణించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి విజయ్ ముభావంగా ఉండటంపై నెట్టింట విస్తృత చర్చ జరుగుతోంది.

ప్రధాని మోదీ ఎప్పుడు చెన్నై వచ్చినా నిరసన ప్రదర్శనలే ఎక్కువగా ఉండేవని అంటున్నారు. అయితే ఈ సారి అటువంటి పరిస్థితి కనిపించకపోయినా, ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న తరుణంలో, సీఎం విజయ్ పేరును ప్రస్తావించినప్పుడు సభలోని కొందరు మద్దతుదారులు విజిళ్లు వేస్తూ ‘నెక్ట్స్ పీఎం విజయ్ 2029’’ అన్న ప్లకార్డును ప్రదర్శించడంతో కలకలం చెలరేగింది. ఈ ఊహించని పరిణామంతో ప్రధాని మోదీ ఒకింత షాక్ కు గురయ్యారని అంటున్నారు. మరో వైపు ప్రధాని మోదీ, సీఎం విజయ్ మెట్రోలో ప్రయాణించిన సమయంలో విజయ్ ఎక్కువగా మౌనంగా ఉండటం వైరల్ అవుతోంది. దీనిపై నెట్టింట రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకున్న డీఎంకేతో చేతులు కలిపేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనలో విజయ్ వ్యవహారశైలి ఆసక్తి రేకెత్తించింది. ప్రధాని పర్యటనకు ఒక్కరోజు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెన్నై వచ్చారు. ఆయనను విజయ్ సాదరంగా ఆహ్వానించారు. అంతేకాకుండా ఇద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేసి తమ మధ్య అవగాహనను చాటుకున్నారు. కానీ, ప్రధాని పర్యటనలో విజయ్ ముభావంగా ఉండటం చూస్తే బీజేపీ వైఖరి పట్ల ఆయన అంత సౌకర్యంగా లేరన్న సంకేతాలు ఇచ్చినట్లు కనిపించింది.

ఇక ప్రధాని సభలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ను వేదికపై కూర్చోబెట్టడం కూడా ముఖ్యమంత్రి విజయ్ అసంతృప్తికి లోనయ్యారని అంటున్నారు. గౌరవ పూర్వకంగా తాను ప్రధాని సభకు వెళితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం బీజేపీ పార్టీ కార్యక్రమంలా సభను నడిపిందని సీఎం విజయ్ భావించినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగానే చెన్నై మెట్రో రైలులో ప్రధాని తన చుట్టూ ఉన్నవారితో హుషారుగా మాట్లాడుతూ కనిపించినా, విజయ్ కల్పించుకోలేదని అంటున్నారు. దీనిద్వారా ప్రధానితో కలిసి ప్రయాణించడం తనకు ఏ మాత్రం సౌకర్యంగా లేదని ఆయన పరోక్షంగా చెప్పారని అంటున్నారు. ఇది రాజకీయంగా కూడా బీజేపీతో తాను కలిసేది లేదని చెప్పడమేనని అంటున్నారు.