Begin typing your search above and press return to search.

మరీ ఇంత హంగు, అర్భాటం అవసరమా? దళపతిపై కామెంట్స్ జోరు!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు నెలలుగా సింప్లిసిటీతో ఆకట్టుకుంటున్న ముఖ్యమంత్రి విజయ్ పై తాజా విమర్శలు హీట్ పుట్టిస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   6 Aug 2026 4:42 PM IST
మరీ ఇంత హంగు, అర్భాటం అవసరమా? దళపతిపై కామెంట్స్ జోరు!
X

తమిళనాడులో ముఖ్యమంత్రి దళపతి విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలు ఎంతో ఆసక్తికరంగా మారుతున్నాయి. సంప్రదాయ ద్రావిడ పార్టీల రాజకీయాలకు భిన్నంగా, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా విజయ్ సర్వశక్తులతో ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ సమయంలోనే ఆయన కొన్ని విమర్శలకు గురవుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సహజమే అయినప్పటికీ, ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి హోదాలో తన కాన్వాయ్ లో ఎన్ని వాహనాలు ఉండాలి? హంగు, ఆర్భాటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? వాటివల్ల లాభనష్టాలు ఎలా ఉంటాయనే విషయమై విజయ్ దృష్టిపెట్టాల్సివుందని అంటున్నారు.

కాన్వాయ్‌పై విమర్శలు

సాధారణంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం భారీ భద్రతా ఏర్పాట్లు, భారీ వాహన శ్రేణి (కాన్వాయ్) ఉండటం పరిపాటిగా చెబుతున్నారు. అయితే సీఎం ప్రమాణ స్వీకారానికి ముందే తనకు కేటాయించిన భద్రతా వాహనాలను తిరస్కరించిన విజయ్, ఇప్పుడు లెక్కకు మించి వాహనాలను తన కాన్వాయ్ లో చేర్చుకుని విమర్శలకు గురవుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. తరచూ అధికారిక పర్యటనకు వెళుతున్న దళపతి వెంట భారీగా వాహనాలు పరుగులు తీయడంపై ప్రజలు కూడా గుసగుసలు ఆడుకుంటున్నారని చెబుతున్నారు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ముఖ్యమంత్రి భద్రత నిమిత్తం సుమారు డజనుకు పైగా వాహనాలు కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండటంపై విమర్శకులు పెదవి విరుస్తున్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా, రోడ్లను బ్లాక్ చేస్తూ పెద్ద ఎత్తున వాహనాలతో సాగే ఈ కాన్వాయ్ సంస్కృతిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎంతో సింపుల్‌గా, సాధారణ ప్రజల్లో ఒకడిగా ఉండాలని భావించే విజయ్ వెనుక ఇంత పెద్ద ఎత్తున వీఐపీ ఆర్భాటం జరగడం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. భారీ సంఖ్యలో వాహనాలు ఉండటం వల్ల ప్రజాధనం వృథా కావడమే కాకుండా, సీఎం కాన్వాయ్ వెళ్ళేటప్పుడు సాధారణ ప్రజలకు కలిగే ట్రాఫిక్ అంతరాయంపై కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోందని చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు నెలలుగా సింప్లిసిటీతో ఆకట్టుకుంటున్న ముఖ్యమంత్రి విజయ్ పై తాజా విమర్శలు హీట్ పుట్టిస్తున్నాయి. సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా ఉండేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి విజయ్ ఇతర నేతలు, ముఖ్యమంత్రుల మాదిరిగా భారీ కాన్వాయ్ ను వాడటం అవసరమా? అన్న చర్చ జరుగుతోంది. దేశంలో ఇంధన భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.