సింపుల్, స్టైలిష్ సీఎం.. తమిళనాడులో దళపతి సరికొత్త ట్రెండ్
తాజాగా ఆయన చెన్నై మెట్రో రైలులో ప్రయాణించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
By: Tupaki Political Desk | 30 July 2026 3:31 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనదైన సింపుల్ అప్రోచ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సంప్రదాయ రాజకీయ నాయకుల మాదిరిగా భారీ కాన్వాయ్, హడావుడికి దూరంగా ఉంటున్న ఆయన సామాన్య ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఆయన చెన్నై మెట్రో రైలులో ప్రయాణించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సాధారణంగా సీఎం అనగానే ప్రత్యేక భద్రతా వలయాలు ఉంటాయి. భారీ కాన్వాయ్‌తో పెద్ద హంగానే చేస్తుంటారు. కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో ఈ తరహాలోనే ముఖ్యమంత్రుల ఆర్భాటాలను చూసిన ప్రజలు, ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ విభిన్నశైలిని చూసి ఆశ్చర్యపోతున్నారు.
చెన్నై నగరంలో మెట్రో విస్తరణ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన సీఎం విజయ్ స్వయంగా మెట్రోలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ఓమాందురార్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్న సీఎం విజయ్ క్యూ లైన్ వద్ద సాధారణ ప్రయాణికుడి మాదిరిగాటికెట్ కొనుగోలు చేశారు. సహచర మంత్రులు, అధికారులతో కలిసి సాధారణ కోచ్‌లో కూర్చుని నందనం వరకు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులతో ముచ్చటించడమే కాకుండా, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ అనూహ్య పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
కార్పొరేట్ సీఈవో లుక్.. ప్రత్యేక ఆకర్షణ
మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి విజయ్ తన పనితీరుతోపాటు తన బాడీ లాంగ్వేజ్‌తోనూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తలతల మెరిసే తెల్లని ఖద్దరు దుస్తులలో కనిపించే నేతలను చూసి, రాజకీయాల్లో ఉన్న వారు ఆ విధంగానే మెరిసిపోతారని భావించిన వారికి ముఖ్యమంత్రిగా తొలిరోజే విజయ్ షాక్ ఇచ్చారు. ఖద్దరు జోలికి వెళ్లకుండా తన గెటప్ విషయంలోనూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సరికొత్త సూటు, బూటు ధరించి ఒక ప్రొఫెషనల్ కార్పొరేట్ సీఈవోను తలపించేలా ఉండటానికే విజయ్ ప్రాధాన్యం ఇస్తున్నారు. మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్ నేటి జనరేషన్ (జెన్ జీ) యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన ఈ కార్పొరేట్ అప్రోచ్ తమిళ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంటి నుంచి క్యారేజ్ బాక్స్ తెచ్చుకోవడం, ఆఫీస్ వర్క్‌లో నిమగ్నం కావడం వంటి సాధారణ జీవనశైలిని ఆయన అనుసరిస్తున్నారు.
మెట్రో ఫేజ్-2 పరిశీలన
కేవలం పబ్లిసిటీ స్టంట్ లా కాకుండా, ఈ మెట్రో ప్రయాణం ద్వారా అధికారిక సమీక్షను కూడా విజయ్ విజయవంతంగా నిర్వహించారు. నందనంలోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం గిండి, కాశిమేడు, పోరూర్ నుంచి పూనమల్లి వరకు జరుగుతున్న మెట్రో ఫేజ్-2 నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పూనమల్లి - పోరూర్ మధ్య రాకపోకలు సాగించనున్న 'అన్‌అటెండెడ్ ట్రైన్ ఆపరేషన్' (డ్రైవర్ లెస్) మెట్రో రైలులో ట్రయల్ రన్ ప్రయాణం చేసి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా నాయకుడిగా ఇమేజ్.. ప్రజల అంచనాలు
విజయ్ అనుసరిస్తున్న ఈ సింపుల్ జీవనశైలి, ప్రజాక్షేత్రంలో నేరుగా వాలిపోయే తీరు ఆయనకు యువతలో ఉన్న మాస్ ఇమేజ్‌ను మరింత పెంచుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ విజువల్స్ క్షణాల్లో వైరల్ కావడంతో అభిమానులు పెద్దఎత్తున రీల్స్ షేర్ చేస్తున్నారు. అయితే, కేవలం మంచి విజువల్స్, ఇలాంటి సింపుల్ ట్రిక్స్ మాత్రమే ప్రజలను ఎక్కువ కాలం సంతృప్తి పరచలేవని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన అభివృద్ధి, మెరుగైన ప్రజా సేవలు, ఎన్నికల హామీల అమలుపైనే ప్రభుత్వం విజయం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, తమిళనాడు రాజకీయాల్లో తనదైన శైలితో ముఖ్యమంత్రి విజయ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
