డ్రైవింగ్ లైసెన్స్ నుండి తాగునీటి వరకు: సీఎం విజయ్ మార్క్ పాలన వెనుక వ్యూహం ఇదేనా?
ప్రజలకు రవాణా శాఖ సేవలను వేగంగా.. సులభంగా అందించే ఉద్దేశంతో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు.
By: A.N.Kumar | 3 Sept 2026 5:00 AM ISTతమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన వరుస సంస్కరణల ప్రకటనలు ఆ రాష్ట్ర పరిపాలనా సరళిలో ఒక కీలక మలుపుగా మారాయి. రవాణా వ్యవస్థను డిజిటలైజ్ చేయడం.. నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం.. ప్రాథమిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వం తన సరికొత్త ఆలోచనా విధానాన్ని చాటుకుంది.
ప్రజలకు రవాణా శాఖ సేవలను వేగంగా.. సులభంగా అందించే ఉద్దేశంతో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఇకపై డ్రైవింగ్ పరీక్ష ఉత్తీర్ణులైన రోజే డిజిటల్ లైసెన్స్ పొందే అవకాశం కలగడమే కాకుండా వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను నేరుగా ఆన్‌లైన్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సింగ్’ విధానం ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పౌరుడైనా తన అనుకూలమైన ప్రాంతం నుంచే ఆర్టీఓ సేవలను పొందే వెసులుబాటు లభిస్తుంది. క్యూఆర్ కోడ్ ఆధారిత ఈ డిజిటల్ విధానం వల్ల పత్రాలు పోయినా సులభంగా మళ్లీ ప్రింట్ తీసుకునే వీలుండటంతో పాటు నకిలీ పత్రాల వినియోగానికి చెక్ పడుతుంది.
పాలనలో సాంకేతికతతో పాటు సామాజిక దృక్పథానికి పెద్దపీట వేస్తూ గత ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడిన రైతులు మరియు ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో రూల్ 110 కింద చేసిన ఈ ప్రకటన ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవించడంలో భాగమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పరందూరు విమానాశ్రయ స్థ సేకరణ ఆందోళనలు, తిరువణ్ణామలై సిప్‌కాట్ పారిశ్రామిక జోన్ నిరసనల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులతో పాటు వివాదాస్పద పిడి యాక్ట్ కేసులను రద్దు చేయడం ద్వారా నిరసనకారులకు మరియు వారి కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభించింది.
ప్రజావసరాలను తీర్చే క్రమంలో తాగునీటి మరియు పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులకు భారీగా రూ.4,800 కోట్లను కేటాయించారు. చెన్నై ఉత్తర ప్రాంతంతో పాటు ఆవడి, పొన్నేరి ప్రాంతాల నీటి సమస్య తీర్చడానికి మింజూరులో రోజుకు 400 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో డిశాలినేషన్ ప్లాంట్ నిర్మించనున్నారు. ఆవడి మున్సిపల్ కార్పొరేషన్‌లో 24 గంటల నీటి సరఫరా కోసం రూ.500 కోట్లు, మదురై మరియు కడలూరు వంటి ప్రాంతాల నీటి వసతులకు రూ.1,000 కోట్లు కేటాయించగా, కీల్పాక్ వాటర్ ప్లాంట్ విస్తరణకు మరిన్ని నిధులు వెచ్చించనున్నారు. దీనితో పాటు తిరునెల్వేలి మరియు సేలంలో రూ.547 కోట్లతో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులిచ్చారు. ఈ సమగ్ర నిర్ణయాలు తమిళనాడు అభివృద్ధిలో మరియు పారదర్శక పాలన అందించడంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి.
