Begin typing your search above and press return to search.

దళపతి భయపడుతున్నారా? తమిళనాట హాట్ టాపిక్

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ స్థానిక ఎన్నికల నిర్వహణకు వెనకడుగు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

By:  Tupaki Political Desk   |   29 July 2026 2:29 PM IST
దళపతి భయపడుతున్నారా? తమిళనాట హాట్ టాపిక్
X

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ స్థానిక ఎన్నికల నిర్వహణకు వెనకడుగు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 90 వేల స్థానిక సంస్థలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. వీటికి ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించాల్సివుండగా, మరోమారు వాయిదా వేయాలని, ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే సంచలన విజయం సాధించిన ముఖ్యమంత్రి విజయ్ అదే ఊపుతో స్థానిక ఎన్నికలకు వెళతారని భావించినా, ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి సిద్ధంగా లేనట్లు భావిస్తున్నారు.

తమిళనాడులోని 28 జిల్లాల్లోని గ్రామీణ స్థానిక సంస్థల (పంచాయతీలు, పంచాయతీ యూనియన్లు, జిల్లా పరిషత్తులు) ప్రజాప్రతినిధుల పదవీ కాలం 2025 జనవరి 5వ తేదీతో ముగిసింది. మిగిలిన మిగతా 9 జిల్లాలలో గ్రామీణ స్థానిక సంస్థల పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్ నాటికి ముగియనుంది. ఈ జిల్లాల్లో గతంలో సరిహద్దుల పునర్విభజన కారణంగా అక్టోబర్ 2021లో ఆలస్యంగా ఎన్నికలు జరిగాయి. దీంతో డిసెంబరులోగా మొత్తం ఎన్నికలు నిర్వహించాల్సివుందని అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వివిధ కారణాలతో ఎన్నికల వాయిదా వేసే దిశగానే ఆలోచన చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో నిధుల పంపిణీ, బడ్జెట్ కేటాయింపులను నిర్ణయించే 7వ రాష్ట్ర ఆర్థిక సంఘం గడువును ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగానే స్థానిక సంస్థలకు నిధుల సర్దుబాటు జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ గడువు పెంచడంతో ఈ ఏడాది ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో చేతిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి విజయ్ స్థానిక ఎన్నికల నిర్వహణలో వెనకడుగు వేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లడం పార్టీకి శ్రేయస్కరమని సీనియర్ నేతలు, వ్యూహకర్తలు సలహా ఇవ్వడంతో సీఎం కూడా వచ్చే ఏడాది ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.

అధికారం చేతిలో ఉన్నప్పటికీ సీఎం విజయ్ స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్లకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు చూపుతున్నారు. అందులో ప్రధానమైనది రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో టీవీకే పార్టీకి బలమైన యంత్రాంగం లేకపోవడం పెద్ద సమస్యగా భావిస్తున్నారు. కేడర్ ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలను మెప్పించి గెలవగల నేతలు ఇంకా పూర్తిస్థాయిలో లేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆయా స్థానాలలో బలమైన పోటీ ఇవ్వగల 90 వేల మంది నేతలను సిద్దం చేయాల్సివుంటుందని అంటున్నారు. గ్రామీణ స్థాయిలో సంప్రదాయంగా వస్తున్న కేడర్ ఉండటం వల్ల విపక్ష పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే పోటీకి రెడీగా ఉన్నాయని చెబుతున్నారు. కానీ, టీవీకేకు ఈ క్షేత్రస్థాయి యంత్రాంగం సమకూర్చుకోవడం ఇప్పుడు కత్తిమీద సాములా మారిందని అంటున్నారు.

విపక్షాల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నేతలను పార్టీలో చేర్చుకోవాలని చూసినా ఇందుకు కూడా కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడమే బెటర్ అనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ పదవీ కాలం పూర్తయ్యే వరకు వేచిచూడాలనే ఆలోచన కూడా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం నియమించిన ఎన్నికల కమిషన్ వల్ల ప్రభుత్వానికి కొన్ని రకాలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ప్రస్తుత కమిషన్ పదవీకాలం పూర్తయిన తర్వాత కొత్తవారిని నియమించి ఎన్నికలకు వెళితే తాము అనుకున్నట్లు ఫలితాలు సాధించవచ్చనే అంచనాతో సీఎం విజయ్ స్థానిక ఎన్నికలకు ప్రణాళిక రచిస్తున్నారని అంటున్నారు.