Begin typing your search above and press return to search.

సినిమా రీల్ కాదిది.. ప్రజలిచ్చిన‌ రియల్ బాధ్యత!

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా దిగ్విజ‌యంగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   23 Jun 2026 4:00 PM IST
సినిమా రీల్ కాదిది.. ప్రజలిచ్చిన‌ రియల్ బాధ్యత!
X

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా దిగ్విజ‌యంగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అస‌లైన‌ ప్ర‌జా నాయ‌కుడు అంటే? ఎలా ఉండాలో చూపిస్తున్నారు. అసెంబ్లీ హాలు కొత్త అయినా? విజ‌య్ కు మాత్రం అది పాత‌దే అన్న చందంగా తాను చేయాల‌నుకున్న‌ది చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ ముగింపు సందర్భంగా విజ‌య్ ప్రతిపక్షాల విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు.

తాను ముఖ్యమంత్రి కావడం అనేది రాత్రికి రాత్రే జరిగిన పరిణామం కాదని.. దశాబ్దాలుగా ప్రజల్లో ఉంటూ సంపాదించుకున్న నమ్మకానికి నిదర్శనమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. `కొందరు వ్యక్తులు నేను నేరుగా సినిమా సెట్ నుండి వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. వారి భాషలోనే చెప్పాలంటే అది కేవలం ఒక రీల్ కథ మాత్రమే` అని వ్యాఖ్యానించారు. సినిమాల్లో నటించడం వేరు.. నిజ జీవితంలో ప్రజల‌ నమ్మకాన్ని గెలుచుకుని సభలోకి అడుగుపెట్టడం వేరు గుర్తుచేశారు.

తన రాజకీయ ప్రస్థానం వెనుక ఉన్న సుదీర్ఘ సామాజిక సేవా నేపథ్యాన్ని ఈ సందర్భంగా విజయ్ వివరించారు. 1990ల నుండి అభిమాన సంఘాల ద్వారా తమిళనాడు ప్రజలకు అండగా నిలిచామన్నారు. 2008 నుండి ఎన్నో సామాజిక సమస్యలపై నిరసనలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహించామని తెలిపారు. తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించ డానికంటే చాలా కాలం ముందే ప్రజల కోసం పనిచేశానని.. సామాజిక న్యాయం, విద్య , అవినీతి నిర్మూలన వంటి అంశాలు తన గత సినిమాల్లో కూడా ప్రతిబింబించాయన్నారు.

ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష ద్రవిడ మున్నేట్ర కజగం - అధికార పక్షం మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. గత డీఎంకే ప్రభుత్వంపై సీఎం విజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల క్షీణత, డ్రగ్స్ సమస్య, వివిధ శాఖల్లో పార్టీ నిధుల పేరిట ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపించారు. తాము ప్రజాధనాన్ని ఒక్క పైసా కూడా లూటీ చేయనివ్వబోమని.. అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయ్ హెచ్చరించారు.

ఇది రీల్ కాదు ..రియ‌ల్ అని అన్నా? విజ‌య్ అన్నా? సినిమాకు స్పూర్తి రియ‌ల్ లైఫ్. వాస్త‌వ జీవితాల నుంచే రీల్ పాత్ర‌లు పుడ‌తాయ‌న్న‌ది కాద‌న‌లేని నిజం. అందులోనూ ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ రీల్-రియ‌ల్ లైఫ్ సినిమా గా మారే అవ‌కాశం లేక‌పోలేదు. విజ‌య్ ఒకే చెప్పాలే గానీ ఆయ‌న క‌థ‌ను రాయ‌డానికి ఎంతో మంది రైట‌ర్లు సిద్దంగా ఉన్నారు.