తమిళనాడు సీఎం విజయ్ సలహాదారుడిగా వైఎస్ అనిల్ రెడ్డి స్నేహితుడు
ఇందులో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎర్రదొడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కావడం ఇప్పుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా సంచలనంగా మారింది.
By: A.N.Kumar | 23 May 2026 6:32 PM ISTతమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. సినీ రంగాన్ని శాసించి.. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) తన మార్క్ పరిపాలనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం మరింత సమర్థవంతంగా, వేగంగా ప్రజా నిర్ణయాలు తీసుకునేలా ఇద్దరు తన అత్యంత సన్నిహితులకు తన ప్రత్యేక సలహాదారులుగా నియమించారు. ఇందులో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎర్రదొడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కావడం ఇప్పుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా సంచలనంగా మారింది.
తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. విష్ణురెడ్డితో పాటు జాన్ ఆరోక్యసామిలను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా నియమించారు. ఇందులో విష్ణురెడ్డికి ప్రజా కార్యక్రమాలు, సాధారణ పరిపాలన వ్యవహారాల వంటి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించడం ఆయన సమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. మరో సలహాదారు ఆరోక్యసామి రాజకీయ వ్యూహాల విభాగంలో పనిచేయనున్నారు.
కలికిరి నుంచి కోలీవుడ్ వరకు.. విష్ణురెడ్డి విజయ ప్రస్థానం!
విష్ణురెడ్డి పూర్తి పేరు ఎర్రదొడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లె. గ్రానైట్ వ్యాపారవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన విష్ణురెడ్డి.. సుమారు 15 ఏళ్ల క్రితం చెన్నైకి వెళ్లారు. తన కష్టాన్ని, నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వ్యాపారవేత్తగా ఎదుగుతూనే తమిళ సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతో ఆయన నమ్మకమైన సంబంధాలను ఏర్పరుచుకున్నారు. నటుడు విజయ్‌తో ఏర్పడిన పరిచయం కాలక్రమేణా బలమైన స్నేహంగా నమ్మకంగా మారింది. విజయ్ సినీ కెరీర్‌కు సంబంధించిన పలు కీలక వ్యవహారాలను విష్ణురెడ్డి అత్యంత సమర్థవంతంగా పర్యవేక్షించారనే పేరుంది.
టీవీకే పార్టీకి వెన్నుదన్నుగా...
విజయ్ రాజకీయ పార్టీ 'టీవీకే' (తమిళగ వెట్రి కళగం) స్థాపనలోనూ పార్టీ ఆర్థిక వ్యూహాలను రూపొందించడంలోనూ విష్ణురెడ్డి తెరవెనుక కీలక పాత్ర పోషించారు. విజయ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ ఎదుగుదలకు ఆయన ఎంతో కృషి చేశారు.
నమ్మకానికి దక్కిన అత్యున్నత గౌరవం
ముఖ్యమంత్రి విజయ్‌కు విష్ణురెడ్డి అత్యంత నమ్మకస్తుడైన ‘రైట్ హ్యాండ్’గా గుర్తింపు పొందారు. గతంలో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలిసిన అధికారిక సందర్భంలోనూ విష్ణురెడ్డి ఆయన వెంటే ఉన్నారు.
రాజకీయాల్లో నమ్మకానికి, సమర్థతకు మించిన అర్హత లేదు. విజయ్ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనతో పాటు నడిచిన, మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్న వ్యూహకర్తలకు ప్రభుత్వంలో కీలక స్థానాలు కల్పించడం ద్వారా... తను నమ్మిన వాళ్లని ఉన్నత స్థానాల్లో ఉంచుతారనే మంచి సందేశాన్ని పంపారు. పరిపాలనను మరింత పారదర్శకంగా, ప్రజామోదయోగ్యంగా మార్చడంలో విష్ణురెడ్డి అనుభవం ప్రభుత్వానికి ప్లస్ కానుంది.
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం
విష్ణురెడ్డికి కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ మంచి అవగాహన ఉంది. ఆయన కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి రామనారాయణరెడ్డి గతంలో అద్దవారిపల్లె సర్పంచ్‌గా, మహల్ ఎంపీటీసీగా, కలికిరి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా ప్రజాసేవలో చురుగ్గా పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి విష్ణురెడ్డి సమీప బంధువు. ఈ రాజకీయ అనుభవం, పరిపాలనపై ఉన్న అవగాహన తమిళనాడు ప్రభుత్వానికి ఎంతో ఊపునిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
సరికొత్త ఆశలతో విజయ్ సర్కార్ అడుగులు
గతంలో కొందరు సలహాదారుల నియామకాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఈసారి ముఖ్యమంత్రి విజయ్ ఎంతో పక్కా వ్యూహంతో అడుగులు వేశారు. సినీ, వ్యాపార రంగాల్లో రాణించి, క్షేత్రస్థాయిలో మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఉన్న విష్ణురెడ్డి, ఆరోక్యసామి వంటి వారిని ఎంచుకోవడం ద్వారా ప్రభుత్వ పాలనలో కార్పొరేట్ స్థాయిలో వేగం, పారదర్శకత వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మూలాలున్న విష్ణువర్ధన్ రెడ్డి తమిళనాడు ప్రభుత్వంలో ఇంతటి కీలక పదవిని దక్కడంపై తమిళనాట విమర్శలున్నా తెలుగునాట హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి విజయ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, తమిళనాడు అభివృద్ధిలో విష్ణురెడ్డి తనదైన ముద్ర వేస్తారని ఆశిద్దాం!
