ఇటు స్టాలిన్.. అటు మమత గెలిస్తే.. జరగబోయేది ఇదే!
ఆది నుంచి ఇక్కడి సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్.. మోడీని వ్యతిరేకిస్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో ఆయన ఢీ అంటే ఢీ అంటున్నారు.
By: Garuda Media | 3 May 2026 9:24 AM ISTఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం(మే 4) విడుదల కానున్నాయి. ఐదు రాష్ట్రాల్లో కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోడీపైనా.. కేంద్రంలోని బీజేపీ సర్కారు(కూటమి)పైనా ఆది నుంచి యుద్ధం చేస్తున్న రెండు కీలక రాష్ట్రాల ఫలితంపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. అవే..
1) పశ్చిమ బెంగాల్.
2) తమిళనాడు.
ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం దక్కించుకుంటే.. ఒక విధమైన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా.. రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుత ప్రభుత్వాలే మరోసారి విజయం దక్కించుకుంటే ఆ పరిణామం భిన్నంగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
తమిళనాడు:
ఆది నుంచి ఇక్కడి సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్.. మోడీని వ్యతిరేకిస్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో ఆయన ఢీ అంటే ఢీ అంటున్నారు.
1) జీఎస్టీలో రాష్ట్రాల వాటా: ఈ విషయంలో జనాభా ప్రాతిపదికన కాకుండా.. పన్నుల వసూళ్ల ప్రాతిపదికన రాష్ట్రాలకు న్యాయం చేయాలన్నది ప్రధాన డిమాండ్.
2) త్రిభాషా సూత్రం: హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్నది కీలక విమర్శ. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇతర పార్టీలతోపోల్చితే.. డీఎంకే ఈ రెండు అంశాలపైనా పట్టుదలతో ఉంది.
3) నియోజకవర్గాల పునర్విభజన: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన విషయాన్ని కూడా డీఎంకే తీవ్రంగా తప్పుబడుతోంది. రాష్ట్రంలోని కీలక పార్టీ ఏఐఏ డీఎంకే(జయలలిత) దీనికి మద్దతు ఇవ్వగా డీఎంకే వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో డీఎంకే కనుక విజయం దక్కించుకుంటే.. కేంద్రంలోని మోడీ సర్కారు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్న వాదన ఉంది. పైగా తమిళ అస్తిత్వానికి డీఎంకే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో డీఎంకే గెలుపు.. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. తద్వారా దక్షిణాదిలో ఏదో చేయాలని.. పాతుకుపోవాలని భావిస్తున్న బీజేపీకి అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. ఒకవేళ ఏఐఏ డీఎంకే కనుక విజయం దక్కించుకుంటే.. బీజేపీకి ఇక, దక్షిణాదిలో తిరుగు ఉండదన్న వాదన వినిపిస్తోంది. అలాకాకుండా విజయ్ విజయం దక్కించుకున్నా.. ఆయన కూడా బీజేపీకి బీ-టీంగా మారడం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.
బెంగాల్:
దేశం యావత్తు.. ఈ రాష్ట్రంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. వాస్తవానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. దేశంలోని అన్ని మీడియా సంస్థలు కూడా బెంగాల్‌పైనే ఎక్కువగా తమ దృష్టి పెట్టాయి. దీనికి కారణం.. వరుస విజయాలతో దూసుకుపోయిన.. మమతా బెనర్జీకి ఇక్కడ అడ్డుకట్ట వేసేలా కేంద్రం వేసిన వ్యూహాత్మక అడుగులే. ఏకంగా 2.4 లక్షల మంది కేంద్ర బలగాలను దింపేయడంతోపాటు.. కఠినమైన ఆంక్షల నడుమ ఈ ఎన్నికలను నిర్వహించారు. దీనికితోడు రెండో దశ ఎన్నికలు జరిగిన 142 స్థానాల్లో 123 చోట్ల టీఎంసీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరంతా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నవారే. ఇప్పుడు అలాంటి చోట బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నించింది. సర్ సహా.. గవర్నర్ రూపంలో వచ్చిన ఆటంకాలు.. ఎన్నికల సంఘం పెట్టిన నిబంధనలు ఇలా.. అనేక అడ్డంకులను దాటుకుని మమతా బెనర్జీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కితే.. ఉత్తరాదిపై బీజేపీ ప్రభావం తగ్గుతుందన్న అంచనాలు వస్తున్నాయి. నిజానికి ఇప్పుడు పూర్వాంచల్‌లో(ఒడిశా-పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు) బీజేపీ దూకుడు ఎక్కువగా ఉంది. గత ఒడిశా ఎన్నికల్లో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇప్పుడు అదే రీజియన్‌లో ఉన్న పశ్చిమ బెంగాల్‌ను కైవసం చేసుకుంటే.. ఉత్తరాది సహా పూర్వాంచల్‌లో కమలానికి తిరుగుండదు. అంతేకాదు.. జాతీయ స్థాయిలోనూ రాజకీయాలు ప్రభావితం అవుతాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో డీఎంకే గెలవడం.. బెంగాల్‌లో టీఎంసీ విజయం వంటివి దక్షిణాది, పూర్వాంచల్ సహా.. ఉత్తరాదిపై ప్రభావం చూపుతుందని.. బీజేపీ దూకుడు తగ్గుందని అంటున్నారు పరిశీలకులు. అలా కాకుండా బీజేపీ విజయం దక్కించుకుంటే.. ఇక, ప్రాంతీయ పార్టీలు చాపచుట్టేయడమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.ఏదేమైనా మే 4న వచ్చే ఫలితం కీలకం కానుంది.
