సర్వే రిపోర్ట్... రాజకీయాల్లో స్టార్ హీరో సరికొత్త సంచలనం..!
ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా విజయ్ కు మంచి నెంబరే రావడం.
By: Raja Ch | 7 Feb 2026 12:23 PM ISTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ - మే లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కగా.. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన స్టార్ హీరో విజయ్ సంచలనాలు కచ్చితంగా ఉంటాయనేలా ఓ సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది. విజయ్ తమిళ రాజకీయాల్లో తాను చెప్పుకున్నట్లు కింగ్ అవుతారా.. చాలామంది విశ్లేషకులు భావిస్తున్నట్లు కింగ్ మేకర్ అవుతారా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ సంచలనాలు మాత్రం సృష్టించనున్నారని రిపోర్ట్ చెబుతోంది.
అవును... మరికొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా... అధికారంలో ఉన్న డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి (ఎస్.పీ.ఏ) 35.8 శాతం ఓటర్ల మద్దతు సంపాదించుకునే అవకాశం ఉండగా.. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి 33.8% ఓటర్ల మద్దతు పొందే అవకాశం ఉంది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా రాజకీయ అరంగేట్రం చేసి, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీవీకే 19.2% ఓట్ల వాటాతో మూడో బలమైన పార్టీగా అవతరించడం గమనార్హం!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... తాజా ఓట్ వైబ్ విజయ్ టీవీకే పార్టీ... ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కంటే అధికార డీఎంకేని ఎక్కువగా దెబ్బ కొడుతుందని.. ఆ వైపు నుంచే ఎక్కువ మంది మద్దతును పొందుతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా... సుమారు 31.5% మంది టీవీకే పార్టీ డీఏంకేను దెబ్బతీస్తుందని చెబుతుండగా.. ఏఐఏడీఎంకేకు మాత్రం 19.9% మాత్రమే నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. దీంతో.. ఎప్పుడైతే అధికార పక్షానికి దెబ్బ తీసే స్థితిలో టీవీకే ఉంటుందో ఆ పార్టీపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందనే అర్ధం అని అంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా విజయ్ కు మంచి నెంబరే రావడం. ఇందులో భాగంగా... తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలి ను 33.3% మంది ప్రజలు బలపరుస్తుండగా.. పళనిస్వామికి 29.8% మంది మద్దతు పలుకుతున్నారు. అయితే... విజయ్ కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా 23.2% మద్దతు పలకడం గమనార్హం. దీంతో ఈ తాజా ఓట్ వైబ్ తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. తమిళ ప్రజానికంలో విజయ్ ప్రభావం స్పష్టంగానే కనిపిస్తుందని అంటున్నారు.
వాస్తవానికి రెండు ప్రధాన కూటములు 35.8%, 33.8% మద్దతుతో ఉన్నప్పటికీ.. వాటికంటే 19.9 శాతంలో టీవీకే వెనుకబడి ఉన్నప్పటికీ ఈ వాటా పార్టీ తుది ఫలితాన్ని రూపొందించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించగలదని అంటున్నారు. ముఖ్యంగా 18 నుంచి 24 వయస్సు గల యువ ఓటర్లు పోటీని పునర్నిర్మిస్తున్నారని.. వీరిలో మెజారిటీ ఓటర్లు విజయ్ వైపు ఆకర్షితులైతే తుది ఫలితాల్లో లెక్కలు కీలకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో మహిళా ఓటర్ల మద్దతు ఇక్కడ విజయ్ కు కీలకం కాబోతుందని చెబుతున్నారు.
ఏది ఏమైనా... గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా వెలువడుతున్న సర్వే ఫలితాలు.. టీవీకేకు క్రమక్రమంగా మద్దతు పెరుగుతుందని సూచిస్తుండటంతో పాటు తాజా ఓట్ వైబ్ ఓ కీలక నెంబర్ ను తెరపైకి తేవడం.. ఇందులో సుమారు 6.5% ఇతర పార్టీలకు మద్దతు పలుకుతున్నట్లు చెప్పడంతో పాటు 5% మంది ప్రజలు ఇంకా చెప్పలేమని అనడంతో.. విజయ్ పెర్ఫార్మెన్స్ మరింత పెరిగితే ఎన్నికల నాటికి సంచలనాలు తప్పకపోవచ్చనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి!
