డీఎంకే రహస్య సర్వే... విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే రిజల్ట్ ఇదే!
విజయ్ ఎన్నికల అవకాశాలపై కరూర్ తొక్కిసలాట పెద్దగా ప్రభావం చూపలేదని అధికార డీఎంకే నియమించిన రహస్య సర్వే అంచనా వేసింది.
By: Raja Ch | 15 Oct 2025 3:41 PM ISTవచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ప్రధానంగా సినీనటుడు, టీవీకే అధినేత కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం పరిణామాలు, సమీకరణాలు మరింతగా మారుతున్నాయని అంటున్నారు. అయితే.. ఆ దుర్ఘటన అనంతరం జరిగినట్లు చెబుతున్న ఓ సర్వే ఫలితాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.
అవును... 'ది ప్రింట్' మీడియా అందించిన కథనం ప్రకారం... విజయ్ ఎన్నికల అవకాశాలపై కరూర్ తొక్కిసలాట పెద్దగా ప్రభావం చూపలేదని అధికార డీఎంకే నియమించిన రహస్య సర్వే అంచనా వేసింది. ఈ కథనం ప్రకారం... వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) 23 శాతం ఓట్లను సాధించగలదని తెలుస్తోంది.
ఎన్డీఏ కూటమిలో టీవీకే చేరితే..?:
ఈ కథనం ప్రకారం.. ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ, అన్నాడీఎంకేలతో టీవీకే చేతులు కలిపితే.. ఆ రహస్య సర్వే డీఎంకేకు 50 శాతం, ఎన్డీఏకు 35 శాతం, సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకేకు 12 శాతం, ఇతరులు 3 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది! అయితే... అన్నాడీఎంకేలోని అంతర్గత ఘర్షణలు, బీజేపీ సైద్ధాంతిక వ్యవహారాలు తమిళనాడులో కూటమి ఓట్లను పరిమితం చేయవచ్చని సర్వే అంచనా వేసింది!
టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే..?:
ఇక టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది ఈ రహస్య సర్వే వెల్లడించినట్లు కథనం పేర్కొంది. ఇందులో భాగంగా... డీఎంకే ఓట్ల 45 శాతానికి, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఓట్ల వాటా 22 శాతానికి తగ్గవచ్చని.. ఇదే సమయంలో విజయ్ పార్టీకి 23 శాతం ఓట్లు వస్తాయని.. సీమాన్ ఎన్టీఏ కు మద్దతు 5 శాతానికి తగ్గవచ్చని సర్వే అంచనా వేసింది!
ఇలా విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే.. రాష్ట్రంలోని ప్రతి పార్టీ ఓటు వాటాను ఆయన కొంతమేర తినేస్తున్నట్లు చూడవచ్చని సర్వేలో పాల్గొన్న ఒక వ్యూహకర్త అన్నారని ది ప్రింట్ తెలిపింది. ఇదే సమయంలో విజయ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే 2029, 2031లో డీఎంకేకు బలమైన పోటీదారుగా ఎదగవచ్చని ప్రజాభిప్రాయం సూచిస్తుందని సర్వే నివేదిక వెల్లడించింది!
స్పందించిన డీఎంకే, టీవీకే!:
ఈ సందర్భంగా స్పందించిన డీఎంకే ఎమ్మెల్యే సీవీఎంపీ ఎజిలరసన్... చాలా మంది పార్టీ సభ్యులకు ఈ రహస్య సర్వే గురించి తెలియకపోయినా... రాబోయే అసెంబ్లీ ఎన్నికలు డీఎంకే, ఎన్డీఏ మధ్య సైద్ధాంతిక యుద్ధంగా మారవచ్చే నమ్మకాన్ని ఈ ఫలితాలు బలపరుస్తున్నాయని అన్నారు!
ఇదే సమయంలో స్పందించిన టీవీకే పార్టీ అధికార ప్రతినిధి రాజ్ మోహన్ స్పందిస్తూ... ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమ గ్రాఫ్ పెరుగుతుందని అన్నారు. ఓటర్లలో విజయ్ విశ్వసనీయత చెక్కుచెదరకుండా ఉందని తమకు తెలుసు కాబట్టి, డీఎంకే నుంచి తమకు ధ్రువీకరణ అవసరం లేదని అన్నారు! ఇదే సమయంలో... రాబోయే నెలల్లో విశ్వసనీయత, ఓట్ల వాటా మరింత పెరుగుతుందని తెలిపారు!
మరోవైపు అన్నాడీఎంకే ఈ ఫలితాలను తోసిపుచ్చింది. ప్రధానంగా డీఎంకే నాయకత్వాన్ని సంతోషంగా ఉంచడానికే ఈ సర్వే నిర్వహించబడిందని తెలిపింది!
234.. 1,245.. 2,91,000!:
తమిళనాడు అసెంబ్లీకి ఉన్న 234 స్థానాల్లోనూ సగటున ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 1,245 మంది శాంపుల్స్ ని సేకరించిన ఈ సర్వేలో మొత్తంగా 2.91 లక్షల మంది అభిప్రాయాలు సేకరించారు. కాగా... కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత.. అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ మధ్య ఈ సర్వే జరగడం గమనార్హం.
