తమ్ముళ్ల తొందర: తంబళ్లపల్లిలో క్యూ కట్టారుగా.. !
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా నిన్న మొన్నటి వరకు వ్యవహరించిన జయ చంద్రారెడ్డి ఇటీవల ఆ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 12 Oct 2025 9:00 PM ISTఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా నిన్న మొన్నటి వరకు వ్యవహరించిన జయ చంద్రారెడ్డి ఇటీవల ఆ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం కేసులో చంద్రారెడ్డి హస్తం కూడా ఉందని పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఫలితంగా నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పోస్టు ఖాళీ అయింది. అయితే, ఇప్పుడు ఈ పోస్టును దక్కించుకునేందుకు తమ్ముళ్ళు క్యూ కట్టారు. మాకంటే మాకే ఇవ్వాలని లెక్కకు మిక్కిలిగా నాయకులు పోటీ పడుతున్నారు.
తాజాగా ఇద్దరు నాయకులు వేరువేరుగా వచ్చి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. తంబళ్లపల్లి ఇన్చార్జి పోస్టు తమకు ఇవ్వాలని ఇద్దరు వేరువేరుగా కోరడం వేరువేరుగా వినతి పత్రాలు ఇవ్వడం పార్టీలో ఆసక్తిగా మారింది. వాస్తవానికి వైసీపీకి కంచుకోటగా ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కూడా వైసిపి నేత పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. అయితే గత కొన్ని నెలలుగా టిడిపి ఇన్చార్జిగా ఉన్న జయ చంద్రారెడ్డి ఇక్కడ దూకుడు ప్రదర్శించారు.
అన్ని కార్యక్రమాలు ఆయనే నిర్వహించడం, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆయనే పాల్గొనడం ద్వారా వైసిపిని దాదాపు తెరమరుగు చేయాలన్న వ్యూహంతో అడుగులు వేశారు. కానీ, అనూహ్యంగా నకిలీ మద్యం కేసు రావడంతో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు అదే పోస్టును కోరుకుంటున్న కీలకమైన వారిలో బీసీ నాయకుడు శంకర యాదవ్ తో పాటు శ్రీరామ్ చినబాబు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబట్టడంతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులపై ఇరువురు వేరువేరుగా నివేదికలు సమర్పించారు.
మెజారిటీ నాయకులు, కార్యకర్తలు తమతోనే ఉన్నారని తమ ఆధ్వర్యంలోనే పార్టీ పుంజుకుంటుందని వారు చెప్పడం గమనార్హం. అయితే, ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నది పల్లా శ్రీనివాసరావు అంతర్గతంగా చెబుతున్న మాట. కొన్నాళ్లపాటు ఆ పోస్టును ఖాళీగానే ఉంచి అసలు నియోజకవర్గం లో ఏం జరుగుతుందన్న విషయంపై చంద్రబాబు ఆరా తీస్తున్నారని ఇప్పటికిప్పుడు వేరే వ్యక్తిని మార్చినా పరిస్థితులు సర్దుబాటు అవుతాయా లేదా అనే అంశంపై కూడా ఆయన చర్చిస్తున్నారని సమాచారం.
అయితే తమకు కావాలంటే తమకు కావాలని నాయకులు పట్టు పట్టడంతో ఈ వ్యవహారం మరింత వివాదంగా మారే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎలా చూసినా తంబళ్లపల్లి నియోజకవర్గం లో టిడిపి పుంజుకుంటున్న దశలో అనూహ్యంగా నకిలీ మద్యం కేసు రావడం, ఇప్పుడు పదవుల కోసం తమ్ముళ్లు పోటీ పడటం వంటివి పార్టీలో చర్చనీయాంశంగా మారాయి నే చెప్పాలి. మరి చివరికి ఏం జరుగుతుంది చంద్రబాబు ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.
