Begin typing your search above and press return to search.

నిన్న మాటలు, నేడు తూటాలు... పాక్ పై ఆఫ్గాన్ దూకుడు వెనుక కీలక కారణం!

ఇదే సమయంలో... పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ దాక్కున్న ఐ.ఎస్.ఐ.ఎస్ సభ్యులను తక్షణమే బహిష్కరించాలని.. లేదా, వారిని ఇస్లామిక్ ఎమిరేట్‌ కు అప్పగించాలని ముజిహిద్ సూచించారు.

By:  Raja Ch   |   12 Oct 2025 3:53 PM IST
నిన్న మాటలు, నేడు తూటాలు... పాక్  పై ఆఫ్గాన్  దూకుడు వెనుక కీలక కారణం!
X

ఇటీవల అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌ లో భారీ పేలుళ్లు కలకలం సృష్టించిన సంగతి తెలిల్సిందే. తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) చీఫ్‌ నూర్ వాలి మెహ్సూద్‌ స్థావరం లక్ష్యంగా పాక్‌ ఫైటర్‌ జెట్లు దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఢిల్లీలో మాటలతో పాక్ కు మంట పుట్టించిన తాలిబన్లు.. ప్రస్తుతం సరిహద్దుల్లో పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు.

అవును... భారత్ తమ మిత్రదేశం అని ప్రకటించిన ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ.. ఢిల్లీ వేదికగా పాకిస్థాన్ కు మంట పుట్టించే కామెంట్లు చేశారు. ఇందులో భాగంగా... కాశ్మీర్‌ ను భారతదేశంలో భాగంగా పేర్కొంటూ ఆమీర్ ఖాన్ ముత్తాఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై పాక్ స్పందిస్తూ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ మండిపడింది.

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌ లో వరుస పేలుళ్లకు పాకిస్తానే కారణమని ముత్తాఖీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాబూల్‌ లో ఇటీవల జరిగిన వైమానిక దాడుల తర్వాత ఆఫ్ఘన్ సరిహద్దులో జరిగిన ప్రతిదాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారని, 30 మంది గాయపడ్డారని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆదివారం వెల్లడించారు.

ఇదే సమయంలో... పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ దాక్కున్న ఐ.ఎస్.ఐ.ఎస్ సభ్యులను తక్షణమే బహిష్కరించాలని.. లేదా, వారిని ఇస్లామిక్ ఎమిరేట్‌ కు అప్పగించాలని ముజిహిద్ సూచించారు. ఈ ఐ.ఎస్.ఐ.ఎస్. గ్రూప్ వల్ల ఆఫ్ఘనిస్తాన్‌ తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ముప్పు ఉందని.. వీరిని పాక్ పెంచి పోషిస్తుందని మండిపడ్డారు.

కాగా... కాబుల్‌ లో తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ చీఫ్‌ నూర్ వాలి మెహ్సూద్‌ స్థావరం లక్ష్యంగా పాక్‌ ఫైటర్‌ జెట్లు దాడి చేసినట్లు జబీహుల్లా ముజాహిద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా ప్రస్తుతం తాలిబన్‌ దళాలు సరిహద్దుల వెంబడి దాడులు చేపట్టినట్లు అఫ్గాన్‌ అధికారులు వెల్లడించారు. ఇవి మరింత ఉద్ధృతం అవుతాయని హెచ్చరించారు.

సరిహద్దులను మూసివేసిన పాకిస్తాన్!:

రెండు దేశాల భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో.. పాకిస్తాన్ ఆదివారం ఆఫ్ఘనిస్తాన్‌ తో తన ప్రధాన సరిహద్దు క్రాసింగ్‌ లను మూసివేసిందని రాయిటర్స్ నివేదించింది. ఇందులో భాగంగా... ఆఫ్ఘనిస్తాన్‌ తో పాకిస్తాన్‌ కు ఉన్న రెండు ప్రధాన క్రాసింగ్‌ లు అయిన తోర్ఖం, చమన్ లు తాజాగా మూసివేయబడ్డాయి. ఇదే సమయంలో ఖర్లాచి, అంగూర్ అడ్డా, గులాం ఖాన్ వద్ద ఉన్న మూడు చిన్న మార్గాలు సైతం మూసివేయబడ్డాయని స్థానిక అధికారులు తెలిపారు.