వారంపాటు భారత్ లో తాలిబన్ విదేశాంగ మంత్రి.. 'జెండా' లేకుండానే
భారత్ -అఫ్ఘానిస్థాన్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి.. అఫ్ఘాన్ లోని రెండో ప్రధాన పట్టణం కాందహార్ మహా భారతంలోని కౌరవుల తల్లి గాంధారి పుట్టిల్లుగా చెబుతారు
By: Tupaki Political Desk | 9 Oct 2025 8:00 PM ISTభారత్ -అఫ్ఘానిస్థాన్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి.. అఫ్ఘాన్ లోని రెండో ప్రధాన పట్టణం కాందహార్ మహా భారతంలోని కౌరవుల తల్లి గాంధారి పుట్టిల్లుగా చెబుతారు. అఫ్ఘాన్ కు చెందిన బాబర్ భారతదేశంపైకి దండెత్తి వచ్చి మొఘల్ సామ్రాజ్యం స్థాపించారు. ఇలా చాలా అంశాల్లో రెండు దేశాలకు సంబంధాలు బలంగా ఉన్నాయి. అయితే, నాలుగేళ్ల కిందట అఫ్ఘాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టాక సంబంధాలు స్తబ్ధంగా మారిపోయాయి. కారణం.. తాలిబన్లపై ఉగ్రవాద ముద్ర ఉండడమే. అయితే, కాలమే అన్నిటికీ సమాధానం అన్నట్లు అదే తాలిబన్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత్ కు వచ్చారు. తాలిబన్ ప్రభుత్వంతో అసలు సంబంధాలే లేని స్థితి నుంచి ఆ దేశ మంత్రి భారత్ కు రావడం కీలక పరిణామమే కదా...!
జైశంకర్, ఢోబాల్ తో భేటీ..
తాలిబన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ ఒకటీ, రెండు రోజులు కాదు.. వారం రోజుల పాటు భారత్ లో ఉండనున్నారు. ఈ మేరకు ఆయన భారత్ కు చేరుకున్నారు. మన విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ తో చర్చలు జరుపుతారు. అయితే, ఈ వారం రోజులు ఆయన పర్యటనలో ఓ కీలక పాయింట్ ఉంది. అదే తాలిబన్ జెండా.
-సహజంగా దేశాల మంత్రులు సమావేశం అయినప్పుడు వారి వారి దేశాల పతాకాలను టేబుల్ మీద ఉంచుతారు. లేక కుర్చీల వెనుక ఉంచాలి. అయితే, తాలిబన్ ప్రభుత్వాన్ని మన దేశం గుర్తించలేదు. దీంతో జెండాకూ గుర్తింపు లేనట్లే. ఢిల్లీలోని అఫ్ఘాన్ రాయబార కార్యాలయంపై తాలిబన్ జెండాను ఎగురవేసేందుకు అనుమతి కూడా లేదు. గతంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్ జెండానే రాయబార కార్యాలయంపై ఎగురుతోంది.
అప్పడు మాత్రం తాలిబన్ జెండా..
ఇటీవల అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో భారత అధికారులు ముత్తాఖీతో సమావేశం అయ్యారు. సహజంగానే ఆ సమయంలో వారు తాలిబన్ జెండా ఉంచారు. దుబాయ్ లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో ముత్తాఖీ సమావేశంలో మాత్రం తాలిబన్ తో పాటు భారత జెండా కూడా లేదు. అయితే, ఈసారి భారత్ లో ముత్తాఖీతో చర్చలు జరగనున్నాయి. ఇప్పుడు తాలిబన్, అఫ్గాన్ ఏ జెండా ఉపయోగిస్తారో చూడాలి.
-అఫ్ఘాన్ లో ఇప్పటికీ భారత రాయబార కార్యాలయం లేదు. దౌత్య మిషన్ మాత్రం నామమాత్రం ఉంది. అయితే, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక మనసు మార్చుకున్నారు. భారత్ పట్ల సానుకూల వైఖరి కనబరుస్తున్నారు. స్నేహ హస్తం కూడా అందిస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. ఇప్పుడు ఏకంగా ముత్తాఖీనే భారత్ కు వచ్చారు. ఈ పర్యటనలో కీలక అంశాలు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
