Begin typing your search above and press return to search.

పెంచి పోషించిన పాము పాక్ ని కాటేస్తోందా ?

ఆఫ్ఘానిస్తాన్ తో అంతా బాగుంది అనుకుంటూ చేయాల్సినవి అన్నీ చేసింది. తీరా చూస్తే ఇపుడు అదే తాలిబన్లు పాక్ కి ఎదురు తిరిగారు. అంతే కాదు వారు పాక్ కే పెను సవాల్ గా మారారు. దాంతో పాక్ ఇపుడు తల్లడిల్లుతోంది.

By:  Satya P   |   5 July 2026 9:28 AM IST
పెంచి పోషించిన పాము పాక్ ని కాటేస్తోందా ?
X

పాకిస్థాన్ కి ఎపుడూ తన సొంత దేశం గురించి ప్రజల ఆకలి గురించి ఆలోచన కంటే భారత్ మీద విషం చిమ్మడం అసూయతో రగిలిపోవడం ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధాలు చేయడం ఉగ్ర భూతాన్ని పెంచి పోషించి వదలడం ఇలాంటి వాటి మీదనే తన సర్వ శక్తులూ ఉపయోగించింది. అంతే కాదు తన స్వీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కూడా ఉగ్ర తండాలకు అండదండలు అందించింది. పచ్చగా ఉండే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అక్కడ పాలకులకు వ్యతిరేకంగా తాలిబన్లను దువ్వి వారికి అన్ని విధాలుగా మద్దతు ఇచ్చి పాక్ వారిని నిలబెట్టింది. వారితో చేయాల్సిన పనులు అన్నీ చేయించుకుంది. ఆఫ్ఘానిస్తాన్ తో అంతా బాగుంది అనుకుంటూ చేయాల్సినవి అన్నీ చేసింది. తీరా చూస్తే ఇపుడు అదే తాలిబన్లు పాక్ కి ఎదురు తిరిగారు. అంతే కాదు వారు పాక్ కే పెను సవాల్ గా మారారు. దాంతో పాక్ ఇపుడు తల్లడిల్లుతోంది.

పాక్ మీదకి తాలిబన్ల దాడి :

తాజాగా చూస్తే పాకిస్థాన్ లోని భూభాగాల మీద తాలిబన్లు డ్రోన్లతో తాజాగా దాడులు చేశారు. కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకుని మరీ ఈ విధంగా తాలిబన్లు తెగబడ్డారు. దానికి ముందు పాకిస్థాన్ ఆఫ్ఘాన్ మీద వైమానిక దాడులు చేసింది. కాబూల్ కాందహార్ నగరాలను లక్ష్యంగా చేసుకుంది. ఆఫ్ఘాన్ గడ్డ మీద నుంచి పాక్ మీదకు ఉగ్ర దాడి చేస్తున్న ఖిఖ్కీ ఉగ్ర మూకలకు అలాగే బలూచిస్థాన్ లో విముక్తి పోరాటం చేస్తున్న వారికి ఆఫ్ఘాన్ నుంచి మద్దతు దక్కుతోంది. అలాంటి ఉగ్ర మూకలను అణచివేసే విషయంలో తాలిబన్లు అలసత్వం వహిస్తున్నారు అన్నది పాక్ ఆగ్రహానికి కారణం. అయితే వారిని ఆపడానికి తాలిబన్లకు ఏ రకమైన శక్తి సరిపోవడం లేదు, పైగా ఎవరి మాట ఎవరూ వినే పరిస్థితిలో లేరు. ఇక ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా 20 దాకా ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిని ఆపడం తాలిబన్ల తరం కావడం లేదని అంటున్నారు. తాలిబన్ల మధ్య కూడా అనేక అంశాలలో ఏకాభిప్రాయం లేదని అంటున్నారు.

తాత్కాలిక ఒప్పందం కుదిరినా :

ఇదిలా ఉంటే ఆ మధ్య దాకా అడపా దడపా భారీ దాడులు చేసుకున్న రెండు దేశాలూ కూడా ఆ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే తాజాగా పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దానికి ప్రతిగా పాక్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు జరిపింది. దీంతో తాలిబన్లు మరింతగా రగిలిపోతున్నారు. పాక్ సరిహద్దులలో ఏకంగా సైనిక దాడులకు తాలిబన్లు దిగుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఏకంగా డ్రోన్లతోనే పాక్ గడ్డ మీద అతి ముఖ్యమైన లక్ష్యాలను చేసుకుని తాలిబన్లు దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య భీకర సమరానికి రంగం సిద్ధం అయినట్లే అంటున్నారు.

తాలిబన్లకు రష్యా మద్దతు :

ఈ క్రమంలో అనూహ్యంగా తాలిబన్లకు రష్యా మద్దతుగా నిలుస్తోంది. ఆ దేశంతో స్నేహం చేయడానికి రష్యా ముందుకు రావడం విశేషం. గత ఏడాది తాలిబన్ల పాలనను గుర్తించి అధికార ముద్ర వేసిన రష్యా ఇపుడు మరింతగా స్నేహానికి ముందుకు రావడం విశేషం. ఈ దోస్తీలో భాగంగా కీలకమైన సైనిక సహకార ఒప్పందాలు కుదిరాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ లో అనాటి సోవియట్ సైనిక ఆయుధాలను యుద్ధ విమానాలకు రిపేరు చేసి ఆఫ్ఘనిస్తాన్ కి ఇచ్చేందుకు రష్యా అంగీకరించింది. దీంతో తాలిబన్లు ఇపుడు సైనిక పరంగా ఆయుధాల పరంగా మరింత శక్తిమంతులు కానున్నారు. ఇక మీదట మాపైన పాక్ దాడి చేయలేదని తాలిబన్ల రక్షణ మంత్రి కీలక ప్రకటన చేయడం ద్వారా పాక్ పీచమణుస్తామని రష్యా మద్దతు తమకు ఉందని చెప్పుకున్నట్లు అయింది. దాంతో పాక్ మరింతగా ఇబ్బందుల్లో పడినట్లు అవుతోంది అని అంటున్నారు.

రష్యా వ్యూహాత్మకం :

ఇక రష్యా తాలిబన్లతో స్నేహం చేయడం వెనక ఆ దేశ ప్రయోజనాలు దానికి ఉన్నాయి అంటున్నారు ఉక్రెయిన్ యుద్ధం తరువాత సెంట్రల్ ఆసియాలో మరింతగా బలాన్ని పెంచుకోవడానికి రష్యా చూస్తోంది అని అంటున్నారు. అలాగే ఆఫ్ఘాన్ నుంచి ఉగ్ర శక్తులు కొన్ని రష్యా మీద దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖోరోసాన్ వంటివి ఆఫ్ఘన్ గడ్డ నుంచే ఆపరేట్ చేస్తున్నాయి. 2024లో అలా మాస్కో కాన్సెర్ట్ హాలు మీద ఉగ్ర దాడి జరిగింది. తాలిబన్లకు దోస్తీగా ఉంటూ ఈ తరహా ఉగ్ర చర్యలను ఆఫ్ఘన్ గడ్డ మీదనే అడ్డుకోవాలని రష్యా వ్యూహంగా చెబుతున్నారు. మరో వైపు చూస్తే రష్యా తాలిబన్ల అవసరాలు ఎలా ఉన్నా ఈ దోస్తీతో పాక్ ఇబ్బందులో పడడం భారత్ కి కూడా ఎంతో ఊరటను ఇచ్చే పరిణామం అని అంటున్నారు. పాముకు పాలు పోసి పెంచితే ఏదో నాడు కాటు వేస్తుంది అన్నది పాక్ విషయంలో రుజువు అవుతోంది.