ఈడీ రాడార్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలపై చట్టబద్ధ విచారణలు ఊపందుకున్నాయి.
By: A.N.Kumar | 2 Aug 2025 4:13 PM ISTతెలంగాణ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలపై చట్టబద్ధ విచారణలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, మద్యం స్కామ్, ఫార్ములా ఈ స్కామ్ వంటి కేసులతో పార్టీ ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు గొర్రెల పథకం కేసుతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్తల్లోకి వచ్చారు.
జూలై 30, 2025న, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడులు గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం ( SRDS)లో జరిగిన ఆర్థిక అక్రమాలపై అనుమానంతో జరిగాయి. తలసాని మాజీ ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) జీ. కల్యాణ్ కుమార్ ప్రాంగణంతో పాటు మధ్యవర్తులు, లబ్దిదారుల ఇళ్లలో ఈ దాడులు జరిగాయి.
లక్షలాది గొర్రెల కొనుగోలు, పంపిణీలో సుమారు రూ.1000 కోట్లకు పైగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఈ కేసులో ప్రధానంగా ఉన్నాయి. దర్యాప్తు సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలు కేసులో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసు దర్యాప్తులో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను స్వయంగా విచారణకు పిలిచే అవకాశం ఉందని తాజా సమాచారం. గొర్రెల పథకంలో తలసానికి నేరుగా సంబంధం ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. గతంలో జాతీయ పశుసంవర్ధక పథకాల అమలులో అవకతవకలు, మధ్యవర్తుల ద్వారా నిధుల మళ్లింపు వంటి ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.
ఈ గొర్రెల స్కామ్ కేసు బీఆర్ఎస్ పార్టీకి మరింత సంక్షోభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఈడీ విచారణ ఊపందుకున్న నేపథ్యంలో తలసాని రాజకీయ భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెల పథకం కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
