Begin typing your search above and press return to search.

తూర్పులో పెద్దపులి కోసం.. ఏమిటీ స్పెషల్ కెమెరాల స్పెషాలిటీ!

అవును... రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దీని వల్ల ఇప్పటికే ఎనిమిది పశువులు మృత్యువాత పడిన పరిస్థితి.

By:  Raja Ch   |   6 Feb 2026 11:50 AM IST
తూర్పులో పెద్దపులి కోసం.. ఏమిటీ స్పెషల్  కెమెరాల స్పెషాలిటీ!
X

దాదాపు వారం రోజులుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో రాజమండ్రి, రాజానగరం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ, వివిధ ప్రాంతాల్లో ఐదు ఆవులు, ఒక గేదె, రెండు దూడలను చంపేసి తినేసింది! దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ సమయంలో ఈ పులిని బంధించడం కోసం స్థానిక బృందాలతో పాటు పూణె నుంచి స్పెషల్ రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. ఈ సమయంలో నాలుగు రకాల స్పెషల్ కెమెరాలను ఫిక్స్ చేశారు!

అవును... రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దీని వల్ల ఇప్పటికే ఎనిమిది పశువులు మృత్యువాత పడిన పరిస్థితి. ఇందులో భాగంగా... బుధవారం రాజానగరం మండలం భూపాలపట్నం పరిధిలోని పామాయిల్ తోటలో ఒక ఆవుని చంపగా.. జి.యర్రంపాలెం పరిధిలోని తోటలో రెండు ఆవులను, ఒక దూడను చంపేసింది. ఈ సమయంలో గురువారం రాత్రికి జి.యర్రంపాలెం, కేశవరం మధ్యలో ఓ పరిశ్రమ ప్రాంతంలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు.

తాజాగా ఆ పులిని బంధించడం కోసం రెస్క్యూ బృందం పూణె నుంచి వచ్చింది. ఈ సమయంలో.. ఈ బృందం, పశువైద్య నిపుణులతో కలిసి గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అది ఇప్పటికే చంపిన పశువుల కళేబారాల కోసం ఆ ప్రాంతాలకు తిరిగి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో.. అది తిరిగే పొలాలను, ప్రాంతాలను పసిగట్టేలా థర్మల్ డ్రోన్స్ తో పాటు పలు రకాల కెమెరాలను ఏర్పాట్లు చేశారు! ఈ దెబ్బతో పులి అలజడి తెలిస్తే వెంటనే దాన్ని బంధించే అవకాశం ఉందని అంటున్నారు!

పులి జాడ కనుగునేందుకు 25 ట్రాప్ కెమెరాలు వినియోగిస్తుండగా.. ఇవి జంతు కదలికలను మెమరీ కార్డులో నిక్షిప్తం చేస్తాయి. ఇదే క్రమంలో... చీకటి పడిన తర్వాత గమనించేందుకు ఉపకరించేలా థర్మల్ డ్రోన్ లను అమర్చుతున్నారు. చీకట్లో పులి కనిపించకపోయినా.. దాని బాడీ టెంపరేచర్ ను డ్రోన్ కు అనుసంధానం చేసి పరిశీలిస్తారు.. ఆ టెంపరేచర్ ను ఇవి గుర్తించిన వెంటనే సమాచారం చేరవేస్తాయి. ఇదే క్రమంలో.. సుమారు పది 4జీ కెమెరాలను తెప్పించగా.. ఇవి పులిని చూసినవెంటనే సమాచారం అందిస్తాయి!

ఇదే క్రమంలో... పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్న ప్రాంతాల్లో మూడుచోట్ల కేజ్ లకు పీటీజడ్ కెమెరాలను అమర్చుతారు. ఆ కేజ్ లో పులి చిక్కుకున్న వెంటనే.. కనెక్ట్ అయ్యి ఉన్న నంబర్లకు సమాచారం వెళ్తుంది. ఈ విధంగా అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక సదుపాయాలనూ ఉపయోగించుకుంటూ.. స్థానిక అధికారులు, పూణె నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పెద్ద పులిని బంధించేందుకు ప్రయత్నాలు షురూ చేశారు!