పెద్దారెడ్డి పొలిటికల్ చాప్టర్ క్లోజ్ చేస్తున్న జేసీ ?
కేతిరెడ్డి పెద్దారెడ్డిని గత పదిహేను నెలలుగా తన సొంత ఊరుకు రానీయకుండా తన ఇంట్లో అడుగు పెట్టనీయకుండా చేసిన ఘనత టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికే దక్కుతుంది.
By: Satya P | 25 Aug 2025 9:28 AM ISTకేతిరెడ్డి పెద్దారెడ్డిని గత పదిహేను నెలలుగా తన సొంత ఊరుకు రానీయకుండా తన ఇంట్లో అడుగు పెట్టనీయకుండా చేసిన ఘనత టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికే దక్కుతుంది. తాజాగా కూడా ఆయన హైకోర్టు ఆదేశాలతో వచ్చినా కూడా పోలీసులు లా అండ్ ఆర్డర్ పేరు చెప్పి వెనక్కి పంపించేశారు. ఇక హైకోర్టు ఆర్డర్ మీద మూడు వారాల స్టే విధించారు. సుప్రీం కోర్టులో కూడా పోలీసులు అప్పీల్ చేశారు. మొత్తానికి చూస్తే పెద్దారెడ్డికి తాడిపత్రికి మధ్య దూరం మరింతగా పెరిగిపోతోంది. ఆయన జేసీ పంతం మేరకు ఎప్పటికీ తాడిపత్రిలో అడుగుపెట్టలేడని అంటున్నారు.
ఆయన వద్దే వద్దు అంటూ :
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుటుంబం వైసీపీలో తనకు ఆగర్భ శత్రువులు అన్నట్లుగా జేసీ ప్రభాకరరెడ్డి చెబుతున్నారు. ఆయన తప్ప వైసీపీ ఎవరైనా తమ పార్టీకి కూటమికి ఎదురొచ్చి రాజకీయం చేసుకోవచ్చు అని జేసీ అంటున్నారు. తనది వ్యక్తిగతమైన వైరమని చెబుతున్నారు. ఆయన రాజకీయాలను అలా చేశారని చెబుతూ పెద్దారెడ్డిని వదులుకోవాల్సిందే అని వైసీపీ హైకమాండ్ కి పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు.
పెద్దారెడ్డి స్వయంకృతంగా :
అయితే ఇదంతా పెద్దారెడ్డి స్వయంకృతమని అంటున్నారు. ఆయన 2019 నుంచి 2024 మధ్య కాలంలో అయిదేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటూ జేసీ ఫ్యామిలీల మీద ఒక స్థాయిలో రాజకీయం చేశారు. జేసీల అనుచరులను ఇబ్బంది పెట్టారు వారిలో కొందరిని నియోజకవర్గం నుంచి బహిష్కరించారు. అలా తాను ఆనాడు చేసిన చర్యలే ఇపుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టి పీడిస్తున్నాయని అంటున్నారు. జేసీల మీద ఆనాడు పెద్దారెడ్డి పన్నిన వ్యూహాలు ఈ రోజు ఆయనకే చుట్టుకుని నానా తిప్పలు పెడుతున్నాయని అంటున్నారు.
నాథుడు లేని వైసీపీ :
ఇక తాడిపత్రిలో వైసీపీ మూడు సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచింది. అయినా పార్టీ రాజకీయం చేస్తూ బలంగా ఉంది. సంస్థాగతంగా తన పార్టీని కాపాడుకుంటూ వస్తోంది. అయితే పెద్దారెడ్డిని ఎపుడైతే తాడిపత్రి రానీయకుండా జేసీ ప్రభాకర రెడ్డి చేస్తున్న వ్యూహాత్మక రాజకీయంతో అక్కడ వైసీపీకి నాథుడు లేని పరిస్థితి ఉందని అంటున్నారు. నియోజకవర్గంలో యాక్టివిటీ లేకుండా పోయిందని అంటున్నారు. దాంతో అధినాయకత్వం కూడా ఇదేమిటి అని ఆలోచిస్తోందిట.
మాజీ ఇంచార్జి రేసులోకి :
ఇక ఇదే అదనుగా మాజీ ఇంఛార్జిగా ఉన్న రమేష్ రెడ్డి రేసులోకి వచ్చారు అని అంటున్నారు. ఆయన గతంలో తాడిపత్రి వైసీపీ ఇంచార్జిగా పనిచేశారు. గత మూడు ఎన్నికల నుంచి ఎమ్మెల్యే సీటుకి సైతం పోటీ పడుతున్నారు. అయితే 2014 లో తాడిపత్రి నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019, 2024 ఎన్నికల్లో పెద్దారెడ్డి పోటీ చేశారు. అయితే రమేష్ రెడ్డి 2029 ఎన్నికల మీద ఆశతో పార్టీ పెద్దలకు టచ్ లోకి వెళ్తున్నారుట. ఎటూ కోర్టు ఆదేశాలతో కానీ పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టలేరని ఒక వేళ వచ్చినా మునుపటి మాదిరిగా రాజకీయం చేయలేరని అంటున్నారు.
దాంతో వైసీపీ పెద్దలు సైతం కొత్త వారికి ఇంచార్జి పదవి ఇస్తే పార్టీ అక్కడ నిలబడుతుందని ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో రమేష్ రెడ్డికి ఆ చాన్స్ వస్తుందా అన్నది కూడా చర్చ సాగుతోంది. ఇక రమేష్ రెడ్డి అంగబలం అర్ధబలం కలిగిన వారు కావడంతో పాటు గతంలో ఇంచార్జిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకే వైసీపీ ఇంచార్జి ఇవ్వవచ్చు అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం పెద్దారెడ్డికి రాజకీయంగా భారీ షాక్ తగిలినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
