తాడిపత్రిలో జేసి Vs కేతిరెడ్డి.. మరోసారి మొదలైన లొల్లి!
తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలకు సిద్ధమవడంతో పట్టణంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
By: Tupaki Political Desk | 12 Nov 2025 3:45 PM ISTతాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలకు సిద్ధమవడంతో పట్టణంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒకవైపు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాలు మోహరించారు. ఇరువర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి కత్తిపట్టుకుని తిరుగుతున్నారని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేతిరెడ్డి డ్రామాలను సహించేది లేదని హెచ్చరించారు.
రెండు పార్టీల కార్యకర్తలు వందలాదిగా గుమికూడటంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలకు ప్రతిపక్ష వైసీపీ పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎటువంటి లేకుండా కొనసాగగా, తాడిపత్రిలో మాత్రం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పోటీ కార్యక్రమంతో వేడెక్కించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఎమ్మెల్యే బుధవారమే నిర్వహించారు. దీంతో రెండు వర్గాలు ఎదురుపడితే ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయనే భయంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో ఆయన ఇంటి వద్ద అడ్డుకున్నారు.
అయితే పోలీసు ఆంక్షల నడుమే బయటకు వచ్చిన పెద్దారెడ్డి ర్యాలీ చేస్తానని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆయనకు వాగ్వాదం జరిగింది. కేతిరెడ్డి బయటకు వెళితే శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. కాగా, ఈ పరిణామాలపై ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి స్పందిస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తీరును తప్పుబట్టారు. తాడిపత్రి నియోజకవర్గంలో తాము ఎక్కడా కేతిరెడ్డిని ఆపడం లేదని, అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆయన ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఉదయం సమయంలో చేసుకోవాలని సూచించారు.
వైసీపీ హయాంలో ఐదేళ్ల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తప్పేముందని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని ఎమ్మెల్యే వెనకేసుకొచ్చారు. కేతిరెడ్డి ఇప్పటికీ కూడా ఫ్యాక్షన్ చేయాలంటే ఏ కాలంలో ఉన్నారో ఒక్కసారి చూసుకోవాలని హితవు పలికారు. కాగా, తాడిపత్రిలో నిర్వహించాల్సిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసుల సూచనలతో తాము యాడికి మండల కేంద్రానికి మార్చుకున్నామని, అయినా పోలీసులు అడ్డుకోవడం సరికాదంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి భయపడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ రోహిత్ కుమార్ ను దూషించిన చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీశారు.
