తాడిపత్రిలో మండే...రాజకీయ మంటేనా ?
అనంతపురం జిల్లా తాడిపత్రిలో హాట్ హాట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అక్కడ ఉన్నది ఢీ కొట్టే నేతలే కావడం విశేషం.
By: Satya P | 18 Aug 2025 9:32 AM ISTఅనంతపురం జిల్లా తాడిపత్రిలో హాట్ హాట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అక్కడ ఉన్నది ఢీ కొట్టే నేతలే కావడం విశేషం. అయిదేళ్ళ పాటు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా హవా చలాయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి గత పదిహేను నెలలుగా తాడిపత్రిలోకి అడుగు పెట్టే చాన్సే లేకుండా పోయింది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన రాకను తీవ్రంగా అడ్డుకుంటున్నారు. రెండు మూడు సార్లు తాడిపత్రికి పెద్దా రెడ్డి వచ్చిన ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయారు. దాంతో ఈసారి చాలా గట్టి బందోబస్తు మీదనే వస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలతో:
తన సొంత నియోజకవర్గం సొంత ఊరులోకి తాను వెళ్ళనీయకుండా చేస్తున్నారు అని హైకోర్టుని ఆశ్రయించిన పెద్దారెడ్డికి పోలీసు ప్రొటెక్షన్ తో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తాడిపత్రిలో అడుగు పెట్టించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 18న అంటే సోమవారం ఉదయం 10 గంటలకు పోలీసులే స్వయంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోని ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏ అలజడి జరిగినా పోలీసులే వాటిని అదుపు చేయాలని పేర్కొంది. గొడవలు మరీ పెద్దవిగా ఉంటే మాత్రం వాటిని అదుపు చేయడానికి ఫోర్స్ ని సైతం ప్రయోగించాలని కోర్టు ఆదేశించింది. దాంతో ఫుల్ రక్షణతో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెద్దిరెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టబోతున్నారు.
జేసీ ఆధ్యాత్మిక కార్యక్రమం :
ఇదిలా ఉంటే సరిగ్గా అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తరలి రావాలని ఆయన పార్టీకి చెందిన అనుచరులను అభిమానులను పిలిచారు. దాంతో వారంతా తాడిపత్రిలోనే ఉండబోతున్నారు. రెండు కార్యక్రమాలు ఇద్దరు ప్రత్యర్ధులు ఒకే సమయం ఒకే ప్రాంతం దాంతో తాడిపత్రి వైపే సోమవారం అందరి చూపు ఉంది.
ఏమి జరగబోతుంది :
ఇప్పటిదాకా పెద్దారెడ్డి తాడిపత్రి రాకుండా విజయవంతంగా అడ్డుకున్న జేసీ ప్రభాకరరెడ్డి ఈసారి ఏ విధంగా చేస్తారు అన్నదే చర్చగా ఉంది. మరో వైపు తమ నాయకుడు పోలీసు బందోబస్తుతో వస్తున్నారు అని పెద్దారెడ్డి వర్గం కూడా గట్టిగానే రెడీ అవుతోంది. ఈ మధ్యలోనే పోలీసులకు అసలైన సవాల్ ఎదురవుతోంది అని అంటున్నారు. ఏ మాత్రం అలక్ష్యంగా ఉన్నా తాడిపత్రిలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయని ఆందోళన అయితే సాధర జనంలో ఉంది. అసలే మండే. ఇక పొలిటికల్ గా నువ్వా నేనా అని ఢీ కొడుతున్న రెండు వర్గాలు ఇద్దరు నాయకులు ప్రత్యర్ధులు కాదు శతృవులుగా భావించుకుని తలపడుతున్న నేపథ్యం అయితే తాడిపత్రిలో ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
