Begin typing your search above and press return to search.

రెడ్ జోన్‌: 'తాడిప‌త్రి' మునిసిప‌ల్ పోరు మామూలుగా లేదే..!

ఇక‌, తాజాగా తాడిపత్రి పురపాలక సంఘం (మున్సిపాలిటీ) ఎన్నికల నేపథ్యంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య మ‌రింత వేడి రాజుకునే అవకాశం ఉంది.

By:  Garuda Media   |   17 Sept 2026 5:00 AM IST
రెడ్ జోన్‌: తాడిప‌త్రి మునిసిప‌ల్ పోరు మామూలుగా లేదే..!
X

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రాజకీయం తీవ్ర ఉత్కంఠ భరితంగా ఉంది. మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు ఇంకా నోటిఫికేష‌న్ విడుద‌ల కాక‌ముందే.. ఇక్క‌డ రాజ‌కీయ ర‌గ‌డ ప్రారంభ‌మైంది. రాజకీయ ఆధిపత్య పోరుకు ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌లు కేరాఫ్‌గా మారుతున్నాయి. నియోజకవర్గంలో టీడీపీ అగ్రనేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తున్న విష‌యం తెలిసిందే. జేసీ వర్సెస్ కేతిరెడ్డి సవాల్ ప్రతిసవాళ్లతో నియోజ‌క‌వ‌ర్గం కొన్నాళ్లుగా ర‌ణ‌రంగంగా మారుతోంది.

ఇక‌, తాజాగా తాడిపత్రి పురపాలక సంఘం (మున్సిపాలిటీ) ఎన్నికల నేపథ్యంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య మ‌రింత వేడి రాజుకునే అవకాశం ఉంది. దీనిని ఎన్నిక‌ల సంఘం రెడ్ జోన్‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. స్థానిక రాజకీయాల నేప‌థ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, సవాళ్లు విసురుకుంటు న్నారు. ఇటీవల ఈ ఇరువర్గాల సమాంతర ర్యాలీలు, ఆందోళనల పిలుపులతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులపై దాడులు, వేధింపులు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ఇప్ప‌టికీ నాటి ఘ‌ట‌న‌ల‌పై చ‌ర్య‌ల‌కు పోరాడుతున్నారు.

2024 ఎన్నికల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో టీడీపీ మరింత దూకుడు పెంచేలా చేస్తున్నా రు. యువ‌త‌ను స‌మీక‌రిస్తున్నారు. జెన్‌జీ పిలుపుతో ఆయ‌న స్థానిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రింత గ‌ట్టిగా పోరాడుతున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ పోరు పెద్ద‌గా లేక‌పోయినా.. ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌రోసారి పెద్దారెడ్డి పుంజు కునే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ అనుకూల మండ‌లాలు.. ప్రాంతాల్లో టీడీపీ జెండాను ఎగ‌ర‌వేసే కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిస్తున్నారు.

గ‌తంలోనేవైసీపీకి దెబ్బ‌..!

నిజానికి వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు 2021లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనే.. తాడిప‌త్రిని జేసీ వ‌ర్గం కైవసం చేసు కుంది. అప్ప‌ట్లో బొటా బొటి మెజారిటీతోనే గెలిచినా.. వైసీపీకి భారీ షాకిచ్చింది. ఇక‌, ఇప్పుడు కూట‌మి అధికారంలో ఉండ‌డం. యువ నాయ‌కుడు అస్మిత్ రెడ్డి వ్యూహాలు వేస్తున్న క్ర‌మంలో వైసీపీ ఇక్క‌డ ఏమేర‌కు త‌న ప్ర‌భావం చూపిస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారిపోయింది. అధికారంలో ఉన్న‌ప్పుడే... పాగా వేయ‌లేక‌పోయామ‌ని.. ఇప్పుడు ఏం చేస్తామ‌ని మెజారిటీ వైసీపీ కార్య‌క‌ర్త‌లు కూడా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. త‌న పంథాలో ముందుకు సాగాల‌ని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంతంతో ఉండ‌డం గ‌మ‌నార్హం.