తాడిపత్రిలో రాళ్లదాడి.. హైటెన్షన్.. జేసీకి ఎస్పీ వార్నింగ్?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం అంటేనే గత కొన్నాళ్లుగా రాజకీయాలతో వేడెక్కిన విషయం తెలిసిం దే.
By: Garuda Media | 1 Sept 2025 12:22 AM ISTఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం అంటేనే గత కొన్నాళ్లుగా రాజకీయాలతో వేడెక్కిన విషయం తెలిసిం దే. వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల నిత్యం రాజకీయ సమరం జరుగుతూనే ఉంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనిచ్చేది లేదని.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పడం.. దీనిని ఆయన సవాల్ చేయడం తెలిసిందే. దీంతో నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జేసీ వర్గీయులకు.. టీడీపీకే చెందిన కాకర్ల రంగనాథ్ వర్గీయులకు మధ్య రాళ్ల దాడి జరిగింది.
దీంతో తాడిపత్రిలో మరోసారి తీవ్ర హైటెన్షన్ నెలకొంది. రంగంలోకి దిగిన ఎస్పీ.. ఏకంగా.. జేసీకి వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. విషయంలోకి వెళ్తే.. తాడిపత్రిలో ఒకప్పుడు వైసీపీ నాయకుడిగా ఉన్న కాకర్త రంగనాథ్.. గత ఏడాది ఎన్నికలకు ముందు.. వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. అయితే.. ఈయనకు, జేసీ వర్గానికి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. పెద్దారెడ్డికి ఇప్పటికీ.. అనుచరుడిగానే వ్యవహరిస్తున్నాడని.. కాకర్లపై జేసీ వర్గం ఆరోపణలు చేస్తోంది. తాజాగా వినాయక చవితి ఉత్సవాలను జేసీ, కాకర్ల వర్గీయులు వేర్వేరుగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు ఎవరికి వారు పూజలు నిర్వహించారు.
ఆదివారం వినాయక నిమజ్జన ఘట్టం వచ్చింది. దీనికి ఇరు వర్గాలు కూడా పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నాయి. అయితే.. జేసీ వర్గానికి ఒక రూటు, కాకర్ల వర్గానికి మరో రూటును పోలీసులు కేటాయించారు. ఆయా మార్గాల్లోనే వినాయక విగ్రహాల ఊరేగింపు, శోభాయాత్రలను నిర్వహించుకోవాలని తేల్చి చెప్పారు. అయితే.. జేసీ వర్గం మాత్రం కాకర్ల వర్గానికి కేటాయించిన రూట్‌లోకి ప్రవేశించింది. దీంతో తమకు కేటాయించిన మార్గంలోకి మీరెలా వస్తారంటూ.. కాకర్ల వర్గం.. జేసీవర్గీయులపై వాదనకు దిగింది. ఈ క్రమంలో సమీపంలో రోడ్డు వేసేందుకు తీసుకువచ్చిన పెద్ద పెద్ద కంకరాళ్లతో ఇరు వర్గాలు దాడికి పాల్పడ్డాయి.
ఈ విషయం తెలిసిన జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. జేసీ వర్గానికి చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ముందుగా తాము నిర్ణయించిన మార్గంలో కాకుండా.. కాకర్ల వర్గానికి కేటాయించిన మార్గంలో శోభాయాత్రం చేయడం ఏంటని జేసీని ఎస్పీ నిలదీశారు. దీనికి ఆయన సమాధానం చెప్పకుండా.. నోరు చేసుకోవడంతో వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఘర్షణలతో ఇరు వర్గాల శోభాయాత్రలను పోలీసులు అడ్డుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. యాత్రల నిమజ్జాలను ప్రశాంతంగా ఎలాంటి డీజే ఎఫెక్టులు లేకుండా చేసుకోవాలని చెప్పి.. కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు.
