ఆయన కొట్టు సర్దుకోవాల్సిందే ?
రాజకీయాల్లో అవకాశాలు వస్తూంటాయి. వాటిని నిలబెట్టుకోవాల్సింది నేతలు. ఇక అధికారంలో ఉన్నపుడు ఏమి చేసినా ప్రకాశవంతంగా ఉంటుంది.
By: Satya P | 4 Feb 2026 9:22 AM ISTరాజకీయాల్లో అవకాశాలు వస్తూంటాయి. వాటిని నిలబెట్టుకోవాల్సింది నేతలు. ఇక అధికారంలో ఉన్నపుడు ఏమి చేసినా ప్రకాశవంతంగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉంటేనే ఎంత చేసినా ఏ మాత్రం కనిపించదు, కంటికి కూడా ఆనదు, వైసీపీ పరిస్థితి అలాగే ఉంది. ఆ పార్టీలో కీలక నేతలు ఇపుడు మధనం చెందుతున్నదీ అదే. విపక్షంలో ఉన్నపుడు గట్టిగా నిలబడాలి. కానీ అధికార పక్షం బలంగా ఉంది. దాంతో వెనకా ముందూ ఆడుతున్నారు. ఇక అధినాయక్త్వం అలా వేచిచూసే నేతల మీద సీరియస్ యాక్షన్ కి దిగిపోతోంది. గోదావరి జిల్లాలో ఒక సీనియర్ నేత ఇంచార్జి పదవికి ఆ విధంగా ముప్పు వాటిల్లింది.
గూడెంలో సడెన్ చేంజ్ :
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వైసీపీ ఇంచార్జిగా ఉన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణను ఆ పదవి నుంచి తప్పించి కొత్తగా వడ్డీ రఘురాం ని వైసీపీ హైకమాండ్ నియమించింది. దాంతో గూడెం వైసీపీలో రాజకీయ ప్రకంపనలు రాజుకుంటున్నాయి. కొట్టు సీనియర్ నేత, ఏకంగా నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖలను చూశారు. అయితే ఆయన ఇంచార్జిగా పార్టీని బలోపేతం చేయడం లేదన్న నివేదికల నేపథ్యంలో ఈ యాక్షన్ తీసుకున్నారు అని అంటున్నారు.
తీవ్ర అసంతృప్తితో :
తనకు కనీస మాత్రంగా అయినా సమాచారం ఇవ్వకుండా పదవి నుంచి తప్పించారని కొట్టు తన బాధను సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారుట. అయితే అధినాయకత్వం వెర్షన్ మరోలా ఉంది. ఎన్నో సార్లు ఆదేశాలు ఇచ్చినా పార్టీ పటిష్టత కోసం పనిచేయలేక్పోయారని అంటున్నారు. పార్టీ ముఖ్యం కాబట్టే ఈ సీరియస్ డెసిషన్ తీసుకున్నారని చెబుతున్నారు
కొత్తగా ఉందిట :
ఇక కొత్త ఇంచార్జిగా వడ్డి రఘురాం కి బాధ్యతలు ఇవ్వగానే ఆయన తన పనిలో తాను బిజీ అవుతున్నారని పార్టీ మీటింగ్స్ పెడుతున్నారని అంటున్నారు. ఇక పాత ఇంచార్జి మాజీ మంత్రి పెద్దాయనగా కొట్టు సలహా సూచనలు ఆయన అనుభవం కోసం పలు మార్లు వడ్డి ఆయనను కలిసే ప్రయత్నం చేసినా కొట్టు నుంచి పాజిటివ్ రియాక్షన్ అయితే రాలేదని అంటున్నారు. ఫోన్ లోకి సైతం అందుబాటులోకి రాలేదని అంటున్నారు. దాంతో గూడెంలో రెండు వర్గాలు మొదలయ్యాయని చెబుతున్నారు.
ఏం చేయబోతున్నారు :
ఇక కొట్టు సత్యనారాయణ ఇంచార్జి పదవిని తీసేయడం అవమానంగా భావిస్తున్నారుట. వడ్డి రఘురాం కి బాధ్యతలు ఇవ్వడం అంటే ఆయనకే రేపటి రోజున అవకాశాలు అని అధినాయకత్వం చెప్పకనే చెబుతోంది. దాంతో కలసి పనిచేయడానికి కొట్టు సిద్ధపడకపోవచ్చు అని అంటున్నారు. అదే సమయంలో ఆల్టర్నేషన్ గా ఏమైన కొత్త ఆలోచనలు చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. కొట్టు వైపు వైసీపీలో ఒక వర్గం ఉంది. అయితే మెజారిటీ నేతలు కొత్త ఇంచార్జి వైపు ఉన్నారని అంటున్నారు మరి తన వర్గంతో కలసి ఆయన చేసే సమాలోచనలు ఏ విధంగా సాగుతాయి అన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో యాక్టివ్ గా ఉంటేనే పాలిటిక్స్ లో చోటు లేకపోతే ఎంత పెద్ద నేత అయినా కొట్టు మూసేసుకోవాల్సిందే అన్న మాట కూడా వినిపిస్తోంది. మరి కొట్టు ఏమి చేస్తారో చూడాల్సిఉంది.
