Begin typing your search above and press return to search.

కేసీఅర్ కి సమ ఉజ్జీ జీవన్ రెడ్డి... ఎన్టీఆర్ తోనే ఎంట్రీ !

అలాగే కేసీఆర్ అయితే బలమైన పార్టీకి సారధ్యం వహిస్తూ మలి విడత తెలంగాణా ఉద్యమాన్ని మలుపు తిప్పి రెండు సార్లు సీఎం పదవిని అందుకున్న ప్రముఖుడిగా ఉన్నారు.

By:  Satya P   |   10 April 2026 9:17 AM IST
కేసీఅర్ కి సమ ఉజ్జీ జీవన్ రెడ్డి... ఎన్టీఆర్ తోనే ఎంట్రీ !
X

తెలంగాణా రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామంగా చెప్పుకోవాల్సి ఉంది. అదే దిగ్గజ నాయకుడు టీ జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరడం. బీఆర్ఎస్ లో తొందరలో చేరుతాను అని జీవన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. జగిత్యాలలోని ఆయన ఇంటికి స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లో తన చేరిక లాంచనం అని జీవన్ రెడ్డి ప్రకటించారు. ఒక విధంగా చూస్తే తెలంగాణా పాలిటిక్స్ లో ఈ పరిణామం విశేషమైనదిగా చెప్పాల్సి ఉంది.

అన్న గారి ఆశీస్సులతో :

ఇక తెలంగాణా రాజకీయాల్లో ధీటైన నేతగా జీవన్ రెడ్డి ఉన్నారు. అలాగే కేసీఆర్ అయితే బలమైన పార్టీకి సారధ్యం వహిస్తూ మలి విడత తెలంగాణా ఉద్యమాన్ని మలుపు తిప్పి రెండు సార్లు సీఎం పదవిని అందుకున్న ప్రముఖుడిగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలకు కొన్ని పోలికలు ఉన్నాయి. జీవన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరూ తెలుగుదేశం పార్టీ నుంచే తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్ధులుగా 1983లో పోటీ చేశారు. అన్న ఎన్టీఆర్ టీడీపీ పెట్టగానే ఈ ఇద్దరు ఆ పార్టీలో చేరిపోయారు. అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో పాటు టికెట్లు కూడా అందుకున్నారు. జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసి గెలిస్తే సిద్ధిపేట నుంచి కేసీఆర్ పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఓటమి చెందారు. ఇక జీవన్ రెడ్డి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీఆర్ 1985 లో ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి 1985 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గొడిశెల రాజేశం గౌడ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్ నుంచి మరో అయిదు సార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అనేక శాఖలను నిర్వహించారు.

కేసీఆర్ మీద పోటీ :

ఇక మరో రాజకీయ ముచ్చట కూడా ఉంది. కరీంనగర్ లోక్ సభకు 2006 లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ మీద అప్పటి వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆయన ఆ రోజుల్లో ఢీ అంటే ఢీ కొడుతూ టీఆర్ఎస్ మీద దూకుడు రాజకీయం చేసేవారు. వైఎస్సార్ సైతం ఆయన్ని ఎంతగానో ప్రోత్సహించేవారు. అయితే ఇపుడు అదే జీవన్ రెడ్డి కేసీఆర్ పార్టీలో చేరడం రాజకీయ విశేషంగానే చెప్పుకోవాలి.

సీనియర్ మోస్టుగా :

కేసీఆర్ పార్టీలో సీనియర్ మోస్టు లీడర్లు బహు తక్కువ అని చెప్పాలి. కేసీఆర్ కంటే ముందే ఎమ్మెల్యే అయి మంత్రి పదవులు నిర్వహించి ఒకనాడు ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నికల్లో ఢీ కొట్టిన జీవన్ రెడ్డి అదే బీఆర్ఎస్ లో చేరడం మాత్రం రాజకీయంగా అనూహ్య పరిణామంగానే చూడాలి. అయితే రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ ప్రత్యర్ధులు తప్ప శతృవులు ఎవరూ ఉండరు. అందువల్ల ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా రాజకీయాల్లో కామన్ గానే చూడాలి మరో వైపు ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని కేసీఆర్ ఇదే నెలలో జరగబోయే బీఆర్ఎస్ ప్లీనరీలో చేర్చుకుంటారు అని ఘనంగా ఈ కార్యక్రమం సాగుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఆ వేడుక ఏ విధంగా సాగుతుందో.