Begin typing your search above and press return to search.

శ్రీరాముడు అందరివాడు.. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం వ్యక్తి వ్యాఖ్యలు

తన వ్యాఖ్యల్లో దైవత్వం గురించి హుస్సేనీ చెప్పిన మాటలు నెటిజన్లను ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి.

By:  A.N.Kumar   |   5 Aug 2026 3:56 PM IST
శ్రీరాముడు అందరివాడు.. మత సామరస్యానికి ప్రతీకగా  ముస్లిం వ్యక్తి వ్యాఖ్యలు
X

మనుషుల మధ్య సోదరభావాన్ని, శాంతిని పెంపొందించే వార్తలు ఎప్పుడూ నెటిజన్ల మనసులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా మత సామరస్యానికి అద్దం పట్టే ఓ అరుదైన దృశ్యం నెట్టింట విస్తృతంగా చర్చనీయాంశమైంది. సామాజికవేత్త సయ్యద్ హుస్సేనీ శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి. శ్రీరాముడు ఏ ఒక్క వర్గానికో లేదా ఒక్క మతానికో సొత్తు కాదని.. ఆయన అందరివాడని ఆయన వ్యాఖ్యానించారు.

తాను కూడా పూర్తి విశ్వాసంతో "జై శ్రీరామ్" అని చెబుతానని పేర్కొన్న సయ్యద్ హుస్సేనీ.. రాముడు మర్యాద పురుషోత్తముడిగా ఈ ప్రపంచానికే గొప్ప ఆదర్శమని అభిప్రాయపడ్డారు. రామరాజ్యం అనేది కేవలం ఒక మతానికి సంబంధించిన భావన మాత్రమే కాదని, అది సమాజంలో న్యాయం, సమానత్వం, సుపరిపాలన ధర్మానికి ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు. రామరాజ్యంలో మహిళలకు పూర్తి రక్షణ, ప్రజలందరికీ సమాన న్యాయం, పాలకుల బాధ్యత వంటి మహోన్నత విలువలు ఉన్నాయని వివరించారు. సమాజంలో శాంతి, సామరస్యం పునర్నిర్మించబడాలంటే శ్రీరాముడు చూపిన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు.

తన వ్యాఖ్యల్లో దైవత్వం గురించి హుస్సేనీ చెప్పిన మాటలు నెటిజన్లను ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి. దేవుళ్లందరూ ఒక్కటేనని.. ముస్లింలు ఉండకూడదని దేవుళ్లు భావించి గాలిని ఇవ్వడం ఆపేస్తే మనం బతకలేమని ఆయన గుర్తుచేశారు. సృష్టికర్తయిన దేవుడికే లేని భేదభావాలు, వివక్ష మనుషులమైన మనకెందుకు అని ఆయన ప్రశ్నించారు. మతం పేరుతో మనుషుల మధ్య గోడలు కట్టకుండా, పరస్పర గౌరవం సోదరభావంతో జీవించాలని కోరారు.

సోషల్ మీడియాలో ముస్లిం ప్రముఖులు లేదా సామాజిక కార్యకర్తలు శ్రీరాముడి ప్రాశస్త్యం గురించి, రామరాజ్యంలోని లౌకిక విలువల గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలువురు మేధావులు రామరాజ్యాన్ని పేదరికం లేని, వివక్షకు తావులేని సమాజంగా అభివర్ణించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మతం కంటే మానవత్వమే గొప్పదని, ఇలాంటి సందేశాలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని మెజారిటీ నెటిజన్లు కొనియాడుతున్నారు. అదే సమయంలో దేశంలో మతాలకు అతీతంగా పరస్పర సహనం, విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉందంటూ నెట్టింట ఆరోగ్యకరమైన చర్చలు సాగుతున్నాయి.

మొత్తానికి సయ్యద్ హుస్సేనీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట మత సామరస్యానికి సరికొత్త వేదికను ఏర్పాటు చేశాయి. సంకుచిత భావాలను పక్కన పెట్టి మానవత్వాన్ని చాటిచెప్పే ఇటువంటి సందేశాలు సమాజ పురోగతికి ఎంతో దోహదపడతాయని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.