Begin typing your search above and press return to search.

భారత్ పాస్ పోర్టుతో బోండీ బీచ్ షూటర్... హైదరాబాద్ తో కనెక్షన్ ఇదే..!

ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల బోండీ బీచ్ లో యూదులు ఉత్సవం చేసుకుంటుండగా.. ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   16 Dec 2025 5:29 PM IST
భారత్  పాస్  పోర్టుతో బోండీ బీచ్  షూటర్... హైదరాబాద్  తో కనెక్షన్ ఇదే..!
X

ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల బోండీ బీచ్ లో యూదులు ఉత్సవం చేసుకుంటుండగా.. ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో సాజిద్ అక్రం (50), అతని కుమారుడు నవీద్ అక్రం (24) విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో.. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఈ సందర్భంగా జరిపిన ఎదురుకాల్పుల్లో నవీద్ అక్రం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో సెక్యూరిటీ నడుమ చికిత్స పొందుతుండగా.. అతని తండ్రి సాజిద్ అక్రం మాత్రం అక్కడికక్కడే మృతి చెందాడు! ఈ క్రమంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆ ఘటనలోని నిందితుడు సాజిద్ అక్రం భారతదేశ పాస్ పోర్టును వాడుతుండగా.. దాన్ని హైదరాబాద్ నుండి పొందినట్లు చెబుతున్నారు.

అవును... ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రం వద్ద ఇండియన్ పాస్ పోర్ట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పైగా.. అతడు ఆ పాస్ పోర్టును హైదరాబాద్ నుంచి పొందినట్లు చెబుతున్నారు.

ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ప్రతినిధిని ఉటంకిస్తూ.. తండ్రి ఇండియన్ పాస్ పోర్టుపై పాలస్తీనాకు నవంబర్ 1 నుంచి నవంబర్ 28 మధ్య ప్రయాణించగా.. కొడుకు ఆస్ట్రేలియన్ పాస్ పోర్టుపై ప్రయాణిస్తున్నాడు అని అంతర్జాతీయ మీడియా నివేదించింది. కాగా.. తొలుత ఇతనికి పాకిస్థాన్ తో సంబంధాలున్నట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో... సాజిద్ అక్రం 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో.. గత 25 ఏళ్లలో అతడు రెండుసార్లు హైదరాబాద్ కు వచ్చినట్లు కథనాలొస్తున్నాయి. అతడి కుమారుడు ఆస్ట్రేలియాలోనే జన్మించినట్లు చెబుతున్నారు. ఈ కథనాల నడుమ తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది.

తెలంగాణ డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన!:

ఈ సందర్భంగా స్పందించిన తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా... సాజిద్ 27 ఏళ్ల క్రితమే 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడని.. అతడు బీకామ్ చదివాడని తెలిపింది. ఇక ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత యూరోపియన్ యువతి వెనెరా గ్రోసోను వివాహం చేసుకోగా.. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని.. వీరిద్దరూ ఆస్ట్రేలియా పౌరులే అని తెలిపింది.

అయినప్పటికీ హైదరాబాద్ తో అతడికి పెద్దగా కాంటాక్ట్స్ లేవని చెప్పిన డీజీపీ కార్యాలయం.. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత అతడు ఆరుసార్లు భారత్ కు వచ్చాడని తెలిపింది. అందుకు కారణం.. కుటుంబ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల కోసమే అని.. అతడికి హైదరాబాద్ లో ఎలాంటి నేర చరిత్ర లేదని తెలంగాణ డీజీపీ కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో.. సాజిద్ కు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాల గురించి తమకేమీ తెలియదని హైదరాబాద్ లోని కుటుంబ సభ్యులు తెలిపినట్లు వెల్లడించింది.