సిడ్నీలో ఉగ్ర రక్కసి... చర్చనీయాంశంగా ఉగ్రవాదుల బ్యాక్ గ్రౌండ్!
ఈ సందర్భంగా స్పందించిన న్యూ సౌత్ వేల్స్ పోలీసు కమిషనర్ మాల్ లాన్యోన్... నిందితులు ఇద్దరూ పాకిస్థాన్ నుంచి వచ్చినవారని తెలిపారు!
By: Raja Ch | 15 Dec 2025 1:16 PM ISTపాకిస్థాన్ ను ఉగ్రవాదాన్ని వేరు చేసి చూడలేమని చెబుతారు.. ప్రపంచ వ్యాప్తంగా యూదులే లక్ష్యంగా ఇటీవల పలు దేశాలకు చెందిన ఉగ్రవాదులు చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ ఏడాది మే లో వాషింగ్టన్ డీసీలోని యూదు మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది హత్యకు గురయ్యారు.
ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరోసారి యూదులే లక్ష్యంగా ఉగ్ర రక్కసి విరుచుకుపడింది. ఇందులో భాగంగా... బోండీ బీచ్ లో "చానుకా బై ద సీ" జరుపుకుంటున్న వారిపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. సుమారు 40 మంది వారకూ గాయపడ్డారు! ఈ సమయంలో.. ఇద్దరు ఉగ్రవాదుల బ్యాక్ గ్రౌండ్ చర్చనీయాంశంగా మారింది.
నిందితులిద్దరూ పాక్ నుంచి వచ్చారు!:
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో యూదుల ఉత్సవంపై దాడి జరిపిన ఇద్దరు సాయుధులను తండ్రీకొడుకులుగా గుర్తించిన దర్యాప్తు బృందం.. వారిద్దరూ పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. వీరిని సాజిద్ అక్రం (50), నవీద్ అక్రం (24)గా గుర్తించారు. ఈ సందర్భంగా భద్రతాదళాలు జరిపిన ఎదురుదాడిలో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందగా.. నవీద్ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నాడు!
ఈ సందర్భంగా స్పందించిన న్యూ సౌత్ వేల్స్ పోలీసు కమిషనర్ మాల్ లాన్యోన్... నిందితులు ఇద్దరూ పాకిస్థాన్ నుంచి వచ్చినవారని తెలిపారు! ఇదే సమయంలో.. సాజిద్ అక్రం లైసెన్స్ పొందిన తుపాకులను కలిగి ఉన్నాడని.. అతడి పేరు మీద ఆరు తుపాకులకు నమోదు చేసుకున్నాడని తెలిపారు. మరోవైపు ఘటనా స్థలం సమీపంలో రెండు యాక్టివ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)లను కలుగొన్నట్లు తెలిపారు.
ఐ.ఎస్.ఐ.ఎస్. తో సంబంధాలు!:
ఈ ప్రపంచంలో ఎక్కడ ఉగ్ర చర్య జరిగినా అందులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాకిస్థాన్ ప్రమేయం ఉంటుందని.. ఐసిస్ పాత్ర ఉంటుందని నానుడి! ఈ క్రమంలో తాజాగా ఆ మాటలకు మరోసారి బలం చేకూరే విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... సిడ్నీలో తాజాగా దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని చెబుతుండగా.. వారిద్దరికీ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్.)తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదే క్రమంలో.. నిందితులు ఉపయోగించిన కారులో ఐసిస్ జెండాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినందుకు 2019లో అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసిన వ్యక్తితో నవీద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో.. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందనేది ఆసక్తిగా మారింది.
ధైర్యవంతుడైన ముస్లిం!:
మతం ముసుగులో కొంతమంది ఉగ్రవాదులుగా మారుతుంటే.. మరికొంతమంది మాత్రం తమ మతం ఏదైనా అది మానవత్వమే అని చాటి చెబుతున్నారు! ఈ క్రమంలో తాజా ఘటనలో సాజిద్ అక్రం అనే దుండగుడితో పోరాడి తన ప్రాణాలకు తెగించి, తుపాకీ లాక్కొని, క్షణాల్లో లెక్కలేనన్ని ప్రాణాలు కాపాడాడు 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్.
ఆ సమయంలో తీవ్రంగా గాయపడిన అహ్మద్.. సెయింట్ జార్జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం స్థిరంగా ఉందని చెబుతున్నారు. అతడి సాహసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అతన్ని ‘ధైర్యవంతుడైన ముస్లిం’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు!
