సిడ్నీలో కాల్పులకు ముందు ఉగ్రవాదులు ఏమి చేశారంటే.. పిక్స్ వైరల్!
ఈ సమయంలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీకొడుకు ఇద్దరూ కాల్పులకు ముందు ఓ రహస్య ప్రాంతంలో ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
By: Raja Ch | 22 Dec 2025 4:40 PM ISTఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల ఘోర మారణహోమం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఉత్సవం చేసుకొంటున్న యూదులపై బోండీ బీచ్ లో తండ్రీకొడుకులు సాజిద్ అక్రం (50), నవీద్ అక్రం (24) కాల్పులకు పాల్పడ్డారు. అనంతరం జరిగిన ఎదురు కాల్పుల్లో సాజిద్ మరణించగా.. నవీద్ తీవ్రంగా గాయపడి చికిత్స పొంది, ఇటీవల కోమా నుంచి బయటకొచ్చాడు. ఈ సమయంలో కాల్పులకు ముందు వీరి ట్రైనింగ్ గురించి కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.
అవును... బోండీ బీచ్ లో తండ్రీకొడుకులు సాజిద్, నవీద్ లు ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా సుమారు 30 మంది గాయపడ్డారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడినవారు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ సమయంలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీకొడుకు ఇద్దరూ కాల్పులకు ముందు ఓ రహస్య ప్రాంతంలో ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.
తాజాగా ఈ విషయాన్ని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో.. ఓ గ్రామీణ ప్రాంతంలో నిందితులు ఇద్దరూ తుపాకులు పట్టుకుని ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని వీడియోలను అధికారులు పరిశీలించారు. వారు ప్రాక్టీస్ చేసిన ఆ గ్రామీణ ప్రాంతం.. న్యూ సౌత్ వేల్స్ లోని మారుమూల ప్రాంతంగా అధికారులు అనుమానిస్తున్నారని తెలుస్తోంది.
డిసెంబర్ 14న జరిగిన బీచ్ లోని మారణహోమానికి ముందు డిసెంబర్ 12 సాయంత్రం నాటి సీసీటీవీ ఫుటేజ్ లో బోండీ బీచ్ పక్కన వారు కారులో ప్రయాణించగా.. అనంతరం వీరిద్దరూ ఫుట్ బ్రిడ్జి వెంబడి నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు రోజుల తర్వాత వీరిద్దరూ అదే స్థానంలో ఉండి ప్రజలపై కాల్పులు జరిపారు అని పోలీసులు పేర్కొన్నారు. ఇది ఉగ్రవాదుల రెక్కీ, అనంతరం ఎగ్జిక్యూషన్ కు రుజువని పోలీసులు ఆరోపిస్తున్నారు.
దాడి జరిగిన రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సిడ్నీలోని శివరౌ క్యాంప్సీలో అద్దెకు తీసుకున్న వసతి గృహాన్ని వదిలి ఇద్దరు వ్యక్తులు దుప్పట్లో చుట్టబడిన పొడవైన భారీ వస్తువులను మోసుకెళ్తూ కారులో ఉంచడం సిసీ కెమెరాలో రికార్డైంది. వీటిలో సింగిల్ బ్యారెల్ షాట్ గన్ లు, ఒక బెరెట్టా రైఫిల్ తో పాటు నాలుగు ఇంప్రూఫైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ పరికరాలు, రెండు ఐఎస్ జెండాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
కాగా... ఇద్దరు ఉగ్రవాదులు సాజీద్ అక్రం, నవీద్ అక్రం నవంబర్ లో ఫిలిపీన్స్ లో పర్యటించారనే విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ సుమారు 27 రోజుల పాటు ఫిలిప్పీన్స్ లోని దావో నగరంలో ఓ సాధారణ హోటల్ లో గడిపారు. ఈ క్రమంలో.. తండ్రి సాజిద్ ఇండియన్ పాస్ పోర్ట్ తోనూ, కొడుకు నవీద్ ఆస్ట్రేలియా పాస్ పోర్టు తోనూ పర్యటించారు. అక్కడ 27 రోజులు ఏమి చేశారనేదానిపైనా దర్యాప్తు జరుగుతోంది.
