Begin typing your search above and press return to search.

షాంపేన్ సీసాలే 40 మందిని బలితీసుకున్నాయి..

కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకాలనుకున్న ఆ వేడుక చివరకు మృత్యుఘోషగా మారింది.

By:  A.N.Kumar   |   3 Jan 2026 12:07 PM IST
షాంపేన్ సీసాలే 40 మందిని బలితీసుకున్నాయి..
X

కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకాలనుకున్న ఆ వేడుక చివరకు మృత్యుఘోషగా మారింది. స్విట్జర్లాండ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన క్రాన్స్-మోంటానా పట్టణంలో జరిగిన అగ్ని ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో సుమారు 40మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

అసలేం జరిగింది?

స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మాంటానాలో డిసెంబర్ 31 అర్ధరాత్రి కొత్త ఏడాది వేడుకల ఉత్సాహంలో ఉన్న సమయంలో ‘లీ కనసల్టేషన్’ అనే బార్ లో ఈ ప్రమాదం సంభవించింది. జరిగిన భారీ పేలుడు.. అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో సుమారు 40 మంది మరణించగా.. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వేడుకల్లో భాగంగా షాంపేన్ బాటిళ్లలో ఉంచిన ఫైర్ వర్క్స్ (స్పార్కర్లు) ఒక్కసారిగా పేలిపోయాయి. ఆ మంటలు పైకప్పుకు అంటుకోవడంతో క్షణాల్లో బార్ అంతా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బార్ లో 100 మందికి పైగా పర్యాటకులు వేడుకల్లో మునిగిపోయి ఉన్నారు. పేలుడు సంభవించిన నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న వారు బయటకు రావడానికి దారి లేక మంటల్లో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఇది అంతర్జాతీయంగా పేరున్న స్కీ రిసార్ట్. ఇక్కడ ఎప్పుడూ పర్యాటకులు అధికంగా ఉంటారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అని పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలు

మొదట ఈ భారీ పేలుడు చూసి అందరూ ఉగ్రవాద దాడి అని భయపడ్డారు. కానీ, ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు ఆ అవకాశాన్ని కొట్టిపారేశారు. వాలైస్ కాంటన్ ప్రాసిక్యూటర్ జనరల్ బియాట్రిస్ మాట్లాడుతూ.. షాంపేన్ బాటిళ్లలో పెట్టిన ఫైర్‌వర్క్స్ పైకప్పుకు అతి సమీపంలో ఉండటం వల్లే మంటలు వేగంగా వ్యాపించి ఉండొచ్చని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి అని తెలిపారు. గాయపడిన 113 మందిలో స్విస్ పౌరులతో పాటు ఫ్రాన్స్, ఇటలీకి చెందిన వారు కూడా ఉన్నారు. మృతదేహాలు కాలిపోవడంతో గుర్తు పట్టడం కష్టంగా మారిందని, డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

రెస్య్కూ ఆపరేషన్

ప్రమాదం జరిగిన వెంటనే స్విస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి 10 హెలిక్యాప్టర్లు, 40 అంబులెన్సులు, వందలాది మంది అగ్ని మాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బార్ కిక్కిరిసి ఉండటం వల్ల తొక్కిసలాట కూడా జరిగి మరణాల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. వేడుకల సమయంలో బాణసంచా, ఫైర్‌వర్క్స్ విషయంలో చిన్న నిర్లక్ష్యం ఎంతటి పెను ప్రమాదానికి దారి తీస్తుందో ఈ ఘటన మరో హెచ్చరికగా నిలిచింది.